Begin typing your search above and press return to search.

ఎన్డీయే ప్రభుత్వం ఏమైంది పవన్...?

రాజకీయాలలో అతి ముఖ్యమైనది స్థిరత్వం. అది రైటో రాంగో ఏమైనా కానీ తాను అన్న మాటకు కట్టుబడి ఉండే నాయకుడి వైపు జనాలు కనీసంగా అయినా ఉంటారు.

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:30 PM GMT
ఎన్డీయే ప్రభుత్వం ఏమైంది పవన్...?
X

రాజకీయాలలో అతి ముఖ్యమైనది స్థిరత్వం. అది రైటో రాంగో ఏమైనా కానీ తాను అన్న మాటకు కట్టుబడి ఉండే నాయకుడి వైపు జనాలు కనీసంగా అయినా ఉంటారు. బ్యాడ్ లక్ ఏంటి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ శైలిలో అదే మైనస్ గా మారుతోంది.

ఆయన అది తనలో నిజాయతీ అనుకుంటున్నారు. తాను బోల్డ్ గా మాట్లాడుతున్నాను అని కూడా భావిస్తున్నారు. ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాను అని కూడా ఆయన తలపోస్తున్నారు. కానీ పవన్ ఎన్ని తడబాట్లు పడ్డారో ఎన్ని సార్లు మాటల కప్పదాట్లు వేశారో జనాలకు లెక్క బాగానే ఉంటోంది.

అలా పవన్ తాజాగా కూడా తన మాటల మీద తాను నిలబడలేదా అన్న చర్చ అయితే వస్తోంది. పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలలో వారాహి యాత్ర చేస్తున్నపుడే ఢిల్లీ నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. అపుడు ఆయన అర్జంటుగా ఢిల్లీ వెళ్లారు. ఎన్డీయే మీటింగులో పాల్గొన్నారు. అలా వారాహి యాత్రకు విరామం ఇచ్చి బీజేపీ కేంద్ర పెద్దలతో మీటింగులో పాలుపంచుకున్న ఆనందం ఆయనకు చాలా ఉంది.

దాంతో ఆ తరువాత వారాహి యాత్రను మొదలెట్టినపుడు ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని గొప్పగా ప్రకటించారు. ఎన్డీయే అంటే బీజేపీ జనసేన మాత్రమే ఉన్నాయి. అప్పటికీ ఇప్పటికీ కూడా తెలుగుదేశం అయితే లేదు. పవన్ కళ్యాణ్ వచ్చేది ఎన్డీయే సర్కార్ అని ప్రకటించి రెండు నెలలు కూడా కాలేదు. ఇంతలో ఏమైందో ఏమో ఉమ్మడి క్రిష్ణా జిల్లాలోని అవనిగడ్డ వారాహి యాత్రకు వచ్చేసరికి మాత్రం మాట మారింది.

ఏపీలో ప్రభుత్వం కూడా మారింది. అదే పవన్ ఆలోచనలలో. ఆయన మాట్లాడుతూ అన్నదేంటి అంటే ఏపీలో 2024 ఎన్నికల తరువాత వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వం అని. అంటే ఇక్కడ బీజేపీ ఏమైంది. అసలు గాయబ్ అయింది. అంతే కాదు ఎన్డీయే సర్కార్ అన్న పవన్ మాటలు ఏమయ్యాయి అంటే కన్వీనియెంట్ గా పక్కకు పోయాయనే చెప్పాలి.

మరి గోదావరి జిల్లాలను ఆనుకుని క్రిష్ణా జిల్లా ఉంది. సమయం చూసినా జస్ట్ రెండు నెలల వ్యవధి మాత్రమే. ఇంతలో పవన్ నోటి నుంచి రెండు రకాల స్టేట్మెంట్స్. ఎన్డీయే పోయి జనసేన టీడీపీ కూటమి వచ్చింది. అసలు సోదిలోకి కూడా బీజేపీ లేదు. అయినా సరే బీజేపీ మిత్రపక్షం అనే అంటూంటారు పవన్. బీజేపీ వారు అదే అంటూంటారు.

మరి ఇలా కీలకమైన విషయం, రేపటి ఎన్నికల్లో ప్రజలు ఓటేసి గెలిపించాలసిన పార్టీల కూటమి ఏదో పవన్ కచ్చితంగా చెప్పలేకపోతే అది ఆయన రాజకీయానికే ఇబ్బందికరం కాదా అన్న చర్చ అయితే నడుస్తోంది. పవన్ తాను ఇపుడు టీడీపీతో ఉన్నాను అని అనుకోవచ్చు. కానీ బీజేపీతో విడిపోయామనో లేక వారితో కటీఫ్ అనో ఏదో ఒకటి క్లారిటీగా చెప్పాలి కదా.

అలాంటిది ఏదీ చెప్పకుండా జనసేన టీడీపీ ప్రభుత్వం అంటే జనాలు ఎలా అర్ధం చేసుకుంటారు. అసలు పవన్ పొత్తులు ఇలా చీటికి మాటికీ మారుస్తున్నారు స్థిరం లేదు అన్న భావన జనంలోకి పోతే అసలే ఎసరు కదా. ఇదే కదా వైసీపీ వారు ప్రచారం చేస్తోంది. పవన్ ది నిలకడ లేని రాజకీయం అని వైసీపీ నేతలు దీని మీదనే కదా దుమ్మెత్తిపోస్తోంది. మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ ఇపుడు టీడీపీ స్నేహాన్ని కోరుకుంటున్నాను. టీడీపీ తాను కలిస్తే ప్రభుత్వం వస్తుంది అని నమ్ముతున్నారు. జనాలకు ఇదే తమ కూటమి అని చెబుతున్నారు.

జనాల సంగతి అలా ఉంటే బీజేపీకి అయినా పవన్ మిత్రుడి రాజకీయ ప్రకటనల నుంచి సరైన సందేశం వచ్చిందా. వారికి ఏమైనా అర్ధం అయిందా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఏపీలో 2014 నాటి పొత్తులు రిపీట్ అవుతాయా లేదా అన్న చర్చ ఒక వైపు సాగుతూంటే పవన్ ఎత్తులు పొత్తుల విన్యాసం మాత్రం మరో రకంగా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఇవన్నీ ఏ రాజకీయ తీరానికి చేరుతాయో.