Begin typing your search above and press return to search.

స్వలింగ సంపర్కాలపై చరిత్ర ఏం చెబుతోంది?

తాజాగా సుప్రీంకోర్టు తీర్పు సమయంలో న్యాయమూర్తులు కూడా ప్రాచీన కాలం, మధ్య యుగ కాలంలోనే స్వలింగ సంపర్కాలున్నాయనే విషయాన్ని ఏకీభవించారు.

By:  Tupaki Desk   |   20 Oct 2023 11:30 PM GMT
స్వలింగ సంపర్కాలపై చరిత్ర ఏం చెబుతోంది?
X

స్వలింగ సంపర్కాల వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ వివాహాలపై నిర్ణయాధికారం సుప్రీంకోర్టు పార్లమెంటుకే వదిలేసింది. దీంతో స్వలింగ వివాహాలు చేసుకోవాలని ఆశించేవారు తీవ్ర నిరాశకు గురయ్యారు.

కాగా మనదేశంలో ప్రాచీన, మధ్యయుగాల కాలం నుంచే స్వలింగ సంపర్కాలు ఉన్నాయని, పలు దేవాలయాలు, కట్టడాలపై ఉన్న చిహ్నాలు ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు, హిస్టరీ సబ్జెక్టు ప్రొఫెసర్లు చెబుతున్నారు.

ప్రస్తుతం భారత్‌ లో స్వలింగ సంపర్కాలను గుర్తించనప్పటికీ.. ఇలాంటి బంధాలు శతాబ్దాల నుంచే కొనసాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు పలు ఆధారాలను సైతం వారు చూపుతున్నారు.

తాజాగా సుప్రీంకోర్టు తీర్పు సమయంలో న్యాయమూర్తులు కూడా ప్రాచీన కాలం, మధ్య యుగ కాలంలోనే స్వలింగ సంపర్కాలున్నాయనే విషయాన్ని ఏకీభవించారు. స్వలింగ సంపర్కం అనేది భారత్‌ కు కొత్తదేమీ కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రాచీన కాలం నుంచీ స్వలింగ సంపర్కాలు దేశంలో ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

అలాగే మరో న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్కే కౌల్‌ సైతం ప్రాచీన కాలంలో స్వలింగ సంపర్కాన్ని కేవలం సెక్స్‌ కోణంలోనే మాత్రమే చూసేవారు కాదన్నారు. వీరి మధ్య ప్రేమ, భావోద్వేగపరమైన మద్దతు లాంటి వాటికి కూడా సమాజంలో చోటు ఉండేదని తెలిపారు.

మరోవైపు ప్రముఖ చరిత్రకారుడు సలీమ్‌ కిడ్వాయ్‌ తో కలిసి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వనిత ‘‘సేమ్‌–సెక్స్‌ లవ్‌ ఇన్‌ ఇండియా: రీడింగ్స్‌ ఫ్రమ్‌ లిటరేచర్‌ అండ్‌ హిస్టరీ’ పేరుతో 15 భారత భాషల్లోనున్న సాహిత్యాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. ఈ పుస్తకంలో భారత్‌ లో ప్రాచీన కాలంలో ఉన్న స్వలింగ సంపర్కాలను గురించి ఆమె లోతుగా వివరించే ప్రయత్నం చేశారు.

భారతీయ ప్రాచీన సాహిత్యం, వివిధ కవులు, రచయితలు, రాయబారులు రాసిన పుస్తకాలు, రచనలు, వివిధ దేవాలయాలు, కట్టడాలపై ఉన్న బొమ్మలను, చిహ్నాలను పరిశీలిస్తే ప్రాచీన కాలం నుంచే మనదేశంలో స్వలింగ సంపర్కాలు ఉన్నట్టు స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఆ కాలంలో స్వలింగ సంపర్కులపై వివక్ష కూడా ఉండేది కాదంటున్నారు.

మధ్యప్రదేశ్‌ లోని ప్రపంచ ప్రఖ్యాత ఖజురహో దేవాలయాలపైన ఉన్న బూతు బొమ్మలు స్వలింగ సంపర్కాన్ని సూచిస్తున్నాయని పేర్కొంటున్నాయి. అలాగే మొఘల్‌ చక్రవర్తుల కాలం నాటి సాహిత్యంలోనూ స్వలింగ సంప్కర సంబంధాలపై అనేక విషయాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా ఖిల్జీ వంశస్తుల్లోనే కాకుండా ఢిల్లీ సుల్తానుల్లోనే గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ స్వయంగా స్వలింగ సంపర్కుడేనని చెబుతున్నారు.

ఇక 4వ శతాబ్దంనాటి వాత్సాయన కామసూత్రాల్లో సైతం.. ఒకరి శ్రేయస్సును మరొకరు కోరుకునే ఇద్దరు పురుషులు కూడా ఒక్కటి కావచ్చు అని రాసివుందని చెబుతున్నారు. కులాంతర, వర్గాంతర వివాహాలను కూడా వారి తల్లిదండ్రులు ఆమోదించేవారని అంటున్నారు. దీని ద్వారా స్వలింగ సంపర్కాన్ని కూడా వారు పూర్వజన్మల కోణంలో చూసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

కాగా మనదేశంలో మధ్య ప్రదేశ్‌లో 1988లోనే ఇద్దరు మహిళా పోలీసులు లీల, ఊర్మిలా శ్రీవాస్తవ పెళ్లి చేసుకున్నారు. వీరి ఫొటోను అప్పట్లో ఒక వార్తాపత్రిక ప్రచురించింది. ఆధునిక భారతదేశంలో తొలి స్వలింగ సంపర్క వివాహంగా దాన్ని పేర్కొంది. దీంతో ఉన్నతాధికారులు ఆ ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అయితే ఆ జంటకు వారి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించింది.

అసలు పెళ్లంటే.. రెండు మనసులు ఒక్కటి కావడమని ఆ జంట అప్పట్లో ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఏ గ్రంథంలో కేవలం ఒక మహిళను ఒక పురుషుడే పెళ్లి చేసుకోవాలని ఉంది? అని ఆ జంట ప్రశ్నించింది.

కాగా స్వలింగ సంపర్క వివాహాలు చేసుకుంటున్నవారు ఎక్కువగా చిన్న చిన్న పట్టణాల్లోనే ఉంటున్నారని.. ఇందులోనూ దిగువ మధ్యతరగతికి చెందినవారే ఎక్కువని చెబుతున్నారు. అయితే వీరిలో చాలామంది చదువుకోవడంతోపాటు ఉద్యోగాలు కూడా చేస్తున్నారని ఒక పరిశోధనలో తేలింది.