Begin typing your search above and press return to search.

ఏమిటీ పాలిమర్ కరెన్సీ? ఇప్పుడున్ననోట్ల మార్పు ఎందుకు?

రిజర్వుబ్యాంక్ లెక్కల ప్రకారం మన దేశంలో కరెన్సీ నోట్ల జీవితకాలం కనిష్ఠంగా రెండేళ్ల.. గరిష్ఠంగా ఏడేళ్లు మాత్రమే. దీంతో.. నోట్ల తయారీ ఖర్చు అంతకంతకూ పెరుగుతోంది.

By:  Garuda Media   |   11 Jun 2026 12:36 PM IST
ఏమిటీ పాలిమర్ కరెన్సీ? ఇప్పుడున్ననోట్ల మార్పు ఎందుకు?
X

పాలిమర్ కరెన్సీ. ఏమిటిది? దీనికి మనం రెగ్యులర్ గా వాడే నోట్లకు మధ్య తేడా ఏంటి? ఉన్నట్లుండిఈ పాలిమర్ నోట్ల ముచ్చట అందరినోట ఎందుకు నానుతోంది? ఇప్పుడున్న కరెన్సీ నోట్ల స్థానంలో వీటిని ఎప్పుడు అమల్లోకి తేవాలని భావిస్తున్నారు? ఇంతకూ వీటి తయారీకి ఖర్చు మాటేంటి? ఇంతకూ ఈ కొత్త నోట్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? లాంటి ఎన్నో ప్రశ్నలు మదిలో మెదలుతుంటాయి. ఈ సందేహాలకు సమాధానాలు వెతికితే.. విషయం మొత్తం ఇట్టే అర్థమైపోతుంది.

దశాబ్దాల తరబడి మనం వినియోగిస్తున్నది పేపర్ కరెన్సీ. పేపర్ తో తయారు చేసే నోట్లను వాడకం అలవాటే. వీటితో వచ్చిన సమస్య ఏమంటే.. పేపర్ కరెన్సీని తేలిగ్గా కాకున్నా.. కాస్తంత కష్టపడితే నకిలీ నోట్లను తయారు చేయొచ్చు. ఇదొక సమస్య అయితే.. వీటిని వాడే క్రమంలో కొన్ని సంవత్సరాలకే ఇవి పాడైపోతుంటాయి. మన దేశంలో కరెన్సీ నోట్లను ఒక్కొక్కరు ఒక్కోలా వాడతారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే.. వీటిని పలు మడతలు వేయటం చూస్తుంటాం.ఇప్పుడు తగ్గింది కానీ.. గతంలో భారతదేశ గ్రామీణ ప్రాంత మహిళలు తమ చీర కొంగుల్లో చిన్న మడతలుగా పెట్టి ముడి వేసి ఉంచుకోవటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. భారతదేశంలోని వాతావరణ పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. కొన్నిచోట్ల అతి శీతలం అయితే.. మరికొన్నిచోట్ల ఉష్ణ ప్రాంతాలు.. ఇంకొన్నిచోట్ల సమశీతోష్ణ స్థితి. ఈ కారణంగా కరెన్సీ నోట్ల తరచూ పాడయ్యే పరిస్థితి.

రిజర్వుబ్యాంక్ లెక్కల ప్రకారం మన దేశంలో కరెన్సీ నోట్ల జీవితకాలం కనిష్ఠంగా రెండేళ్ల.. గరిష్ఠంగా ఏడేళ్లు మాత్రమే. దీంతో.. నోట్ల తయారీ ఖర్చు అంతకంతకూ పెరుగుతోంది. 2024-25లో పాడైన నోట్లు ఏకంగా 2380 కోట్లు. పాడైన నోట్ల స్థానంలో కొత్తవి ప్రింట్ చేయటం ఒక ఎత్తు అయితే.. పాత వాటిని ధ్వంసం చేయటం మరో సమస్య. దేశ వ్యాప్తంగా పాడైన నోట్లను నిర్ణీత ప్రాంతాలకు చేర్చటం.. వాటిని ఆడిటింగ్ చేయటం.. వాటి స్థానంలో కొత్తవి ప్రింట్ చేయటం.. పాడైన వాటిని ధ్వంసం చేయటం లాంటి ప్రక్రియ సుదీర్ఘమైనది. ఖర్చుతో కూడుకున్నది.

పేపర్ కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చు అంతకంతకూ పెరుగుతోంది. 2024-25లో నోట్ల ముద్రణకు పెట్టిన ఖర్చు రూ.6373 కోట్లు కావటం గమనార్హం. ఓవైపు డిజిటల్ మనీ చెలామణీ పెరిగినప్పటికి.. కరెన్సీ నోట్ల వినియోగం కూడా పెరిగినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు చర్చకు వచ్చిన పాలిమర్ నోట్ల తయారీ ఖర్చు కాస్త ఎక్కువైనప్పటికి వీటి జీవితకాలం.. పేపర్ కరెన్సీతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువగా ఉండటంతో.. మొత్తంగా ఖర్చు భారీగా తగ్గే వీలుంది.

పేపర్ కరెన్సీకి.. పాలిమర్ కరెన్సీకి మధ్యనున్న తేడా వీటి తయారీనే. వీటిని కాగితంతో కాకుండా ప్రత్యేకమైన పాలీప్రొపిలీన్ మెటీరియల్ తో తయారు చేస్తారు. వీటిని ప్లాస్టిక్ మనీగా కూడా వ్యవహరిస్తుంటారు. తడి.. దమ్మూధూళి లాంటి వాతావరణంలోనే ఇవి పాడైపోవు. ఈ నోట్లకు భధ్రత ఎక్కువగా ఉండటంతో పాటు.. వీటికి పోలిన నకిలీలు తయారు చేయటం దాదాపు అసాధ్యమన్న మాట బ్యాకింగ్ వర్గాలు చెబుతున్నాయి. డిజిటల్ పేమెంట్లు అంతకంతకూ పెరుగుతున్నప్పటికి జనాల వద్ద ఉండే కరెన్సీనోట్లు కూడా పెరుగుతున్నాయి. 2024-25తో పోలిస్తే ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు 12 శాతం కరెన్సీ నోట్లు ప్రజల వద్దకు చేరినట్లుగా చెబుతున్నారు.

పాలిమర్ నోట్ల ఆలోచన చేయటమే కాదు.. 2012లో వీటిని ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో అమలు చేసి చూశారు కూడా. కొచ్చి.. మైసూర్.. జైపూర్.. సిమ్లా.. భువనేశ్వర్ లాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో రూ.10 విలువైన కరెన్సీనోట్లను దాదాపు వంద కోట్ల వరకు ప్రింట్ చేసి చెలామణీ తీరును పరీక్షించారు. అయితే.. వీటి గురించి ఇప్పుడు చర్చ ఎందుకు మొదలైంది? అన్న విషయంలోకి వెళితే.. ఈమధ్యన రిజర్వుబ్యాంక్ నిర్వహించిన ద్రవ్యపరపతి విధాన సమీక్ష సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్ బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పాలిమర్ నోట్ల మీద మాట్లాడుతూ.. వీటి ప్రాతిపాదనలను పరిశీలిస్తున్నామని.. తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

ఇదిగో తోక అంటే.. అదిగో పులి అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు మారటం.. సోషల్ మీడియా.. యూట్యూబ్ చానళ్ల పుణ్యమా అని.. అదిగో పాలిమర్ నోట్లు వచ్చేస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్ బీఐ ఒక స్పష్టమైన ప్రకటనను చేయాల్సి వచ్చింది. కేవలం ప్రతిపాదనే తప్పించి.. కొన్ని వేదికల మీద జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఈ నోట్ల చలామణికి కొందరు డేట్లు కూడా ఇచ్చేయటంతో రిజర్వు బ్యాంక్ మరింత స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. మొత్తంగా చూస్తే.. ఎప్పుడున్నది క్లియర్ గా చెప్పకున్నా.. ఈ తరహా కరెన్సీ నోట్లను చలామణీలోకి తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మాత్రం జోరుగా సాగుతోందని చెప్పక తప్పదు.