అవును బాస్.. మీ ఏరియా డిజిపిన్ తెలుసుకోవటం ఎలా?
మీరు ఉండే ఏరియా తపాలా శాఖ పిన్ నెంబరు అడిగితే ఇట్టే చెప్పేస్తారు. కానీ.. పోస్టల్ పిన్ నెంబరులో కొన్ని వేల ఇళ్లు ఉండే పరిస్థితి.
By: Tupaki Desk | 11 Jun 2025 3:00 PM ISTమీరు ఉండే ఏరియా తపాలా శాఖ పిన్ నెంబరు అడిగితే ఇట్టే చెప్పేస్తారు. కానీ.. పోస్టల్ పిన్ నెంబరులో కొన్ని వేల ఇళ్లు ఉండే పరిస్థితి. ఇలాంటి వేళలో.. చిరునామాను మరింత సులువుగా తెలుసుకోవటానికి వీలుగా తయారుచేసిందే డిజిపిన్. ఐఐటీ హైదరాబాద్.. ఇస్రో అనుబంధంతో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సాయంతో తపాలా శాఖ తీసుకొచ్చిన ఈ డిజిపిన్ సాయంతో మరింత కచ్ఛితత్త్వంతో ఒక ప్రాంతాన్ని గుర్తించటం తేలిక అవుతుంది. ఇదంతా బాగానే ఉంది.. మేం ఉండే ప్రాంతం డిజిపిన్ తెలుసుకోవటం ఎలా అన్న సందేహం రావొచ్చు. అలాంటి సందేహానికి సమాధానం వెతికితే.. దానికో పద్దతి ఉంది. దాని ఫాలో అయితే మీరు కోరుకుంది ఇట్టే తెలిసిపోతుంది.
డిజిపిన్ తో మీరున్న లొకేషన్ ను సులువుగా గుర్తించే వీలుంది. ఈ కొత్త విధానం కారణంగా ఇ-కామర్స్ సంస్థలు.. పోలీసులు.. అంబులెన్సు సర్వీసులు.. ఫైర్ డిపార్టుమెంట్ వారు తమ అత్యవసర సేవల్ని అందించేందుకు మరింత తేలిక అవుతుంది. ఇంతకూ డిజిపిన్ అంటే పది అక్షరాలు.. అంకెలతో కూడిన ఒక సంకేతంగా చెప్పొచ్చు.
నాలుగు చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆ ప్రాంత డిజిపిన్ ను క్రియేట్ చేసుకునే వీలు ఉంటుంది. ఇందులో భౌగోళిక సమాచారం మాత్రమే నిక్ష్తిప్తమై ఉండటం వల్ల ప్రైవసీకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురుకావు. ప్రస్తుతం వాడే పిన్ కోడ్ కు లేటెస్ట్ వెర్షన్ గా.. డిజిపిన్ తో మరింత కచ్ఛితత్వాన్ని సంతరించి పెట్టేలా చేస్తుంది. ఇదంతా సరే.. నేను ఉండే ప్రాంతానికి సంబంధించిన డిజిపిన్ ఎలా తెలుసుకోవాలంటే.. దానికో ప్రొసీజర్ ఉంది.
డిజిపిన్ కోసం పోస్టల్ శాఖ ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్ిన వెబ్ సైట్ https://dac.indiapost.gov.in/mydigipin/home లోకి వెళ్లాలి. వెబ్ బ్రౌజర్ కు లొకేషన్ యాక్సెస్ తప్పనిసరి అన్నది మర్చిపోకూడదు. ఒకవేళ దాన్ని ఆపేసి ఉంటే.. బ్రౌజర్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఆన్ చేసుకోవాలి. ఒకవేళ.. డిఫాల్ట్ లొకేషన్ యాక్సెస్ ఆన్ లో ఉంటే మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. నూటికి 90 శాతం మంది తమ లొకేషన్ ను యాక్సెస్ చేసేందుకు వీలుగా ఓకే చేసి ఉంటారు.
లొకేషన్ యాక్సెస్ ఓకే అయిన తర్వాత.. ఐ కాన్సెంట్ మీద క్లిక్ చేసి డిజిపిన్ ప్రైవసీ విధానానికి అంగీకరించాల్సి ఉంటుంది. అప్పుడు తెర మీద రైట్ సైడ్ లో ప్రత్యేకమైన అక్షరాలు.. అంకెల కోడ్ కనిపిస్తుంది. భౌగోళిక సమాచారం ఆధారంగా ఇతర లొకేషన్ల డిజిపిన్ సైతం చూసే వీలుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరుండే ప్రాంతానికి సంబంధించిన డిజిపిన్ ను క్రియేట్ చేసేసుకోండి.
