'మాన్‌స్టర్ ఇన్ మెరూన్'.. 11 మందిపై క్రికెటర్ దారుణ లైంగిక వేధింపులు
కరీబియన్ దీవులకు సంబంధించిన మీడియా కథనాల ప్రకారం..వెస్టిండీస్ క్రికెటర్ (పేస్ బౌలర్) ఒకరు అత్యాచారం, లైంగిక వేధింపులు సహా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
By: Tupaki Desk | 28 Jun 2025 8:59 AM ISTఅంతులేని స్వేచ్ఛకు.. కట్టుతప్పిన క్రమశిక్షణకు.. ఒక జాతీయత లేని వ్యవస్థకు మారుపేరైన ఆ దేశ క్రికెట్‌లో పెను సంచలనం.. టెస్టు మ్యాచ్ మధ్యలో ఉన్న ఓ క్రికెటర్‌పై తీవ్రస్థాయి లైంగిక ఆరోపణలు.. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది మహిళలు ఫిర్యాదు చేశారు. ఓ అంతర్జాతీయ క్రికెటర్‌పై ఈ స్థాయి ఆరోపణలు రావడం పెను సంచలనం రేపుతోంది. అతడు మంచి భవిష్యత్ ఉన్న మ్యాచ్ విన్నర్ కావడంతో పరిస్థితి ఎక్కడకు వెళ్తుందో చూడాల్సి ఉంది.
గత ఏడాది వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌లో ఓడించింది. చాలా సంవత్సరాల తర్వాత కానీ.. ఈ విజయం అందుకోలేకపోయింది. దీని వెనుక ఓ యువ పేసర్ ఉన్నాడు. పదునైన బంతులతో రెండు ఇన్నింగ్స్‌లోనూ అతడు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. ఆ జట్టును కుప్పకూల్చాడు. దీంతో అతడు ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనంగా మారాడు. గాయాలు వేధిస్తుండడంతో వెనుకబడినా.. ప్రస్తుతం బార్బడోస్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో మంచి ప్రదర్శనే చేశాడు. ఇక ఈ టెస్టు మాంచి ఊపులో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కేవలం 180 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండీస్ 190 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కాస్త కష్టపడితే వెస్టిండీస్‌దే విజయం. ఇలాంటి సమయంలో ఆ దేశ క్రికెటర్‌పై తీవ్రస్థాయి లైంగిక ఆరోపణలు వస్తున్నాయి.
కరీబియన్ దీవులకు సంబంధించిన మీడియా కథనాల ప్రకారం..వెస్టిండీస్ క్రికెటర్ (పేస్ బౌలర్) ఒకరు అత్యాచారం, లైంగిక వేధింపులు సహా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఓ టీనేజర్ సహా 11 మంది మహిళలు అతడు తమను వేధించినట్లు ఆరోపణలు చేశారు. తొలుత ఓ యువతి ముందుకురాగా.. ఆమెను అనుసరిస్తూ ధైర్యం చేసి 10 మంది బయటకు వచ్చారు. కాగా, వెస్టిండీస్ క్రికెటర్లు మెరూన్ రంగు దుస్తులు ధరిస్తారనేది తెలిసిందే. క్రికెటర్‌పై లైంగిక ఆరోపణల రీత్యా ఓ మీడియా సంస్థ 'మాన్ స్టర్ ఇన్ మెరూన్' శీర్షికతో కథనాన్ని ప్రచురించింది.
కాగా, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్ ప్రతిభావంతుడు కావడంతో అతడిని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పెద్దలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అతడి బారినపడిన మహిళలు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు. క్రికెటర్ కెరీర్ దృష్టా‍్య బోర్డు పెద్దలు ఆరోపణలను తొక్కిపెడుతున్నారని విమర్శిస్తున్నారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు డాక్టర్ కిషోర్ షాలోన్ మాత్రం.. అసలు బోర్డుకు ఏ విషయమూ తెలియదని చెప్పారు. మరి ఈ ఆరోపణలు ఎక్కడకు వెళ్తాయో చూడాలి.
