వక్ఫ్ చట్టం అమలు చేయమని చెప్పినా ఆగని హింస
ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించేలా చేసింది ఎన్డీయే సర్కారు. అయితే.. దీనిపై విపక్షాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేయటం తెలిసిందే.
By: Tupaki Desk | 15 April 2025 10:32 AM ISTఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించేలా చేసింది ఎన్డీయే సర్కారు. అయితే.. దీనిపై విపక్షాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేయటం తెలిసిందే. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వక్ఫ్ సవరణ చట్టం మీద కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయమని మాట ఇచ్చారు. షాకింగ్ అంశం ఏమంటే.. వక్ఫ్ చట్టం అమలు కాదని చెప్పిన తర్వాత కూడా పశ్చిమబెంగాల్ లో అల్లర్లు చెలరేగటం.. అవి కాస్తా హింసగా మారటమే కాదు.. కొత్త చిచ్చును రేపాయి. ఇప్పటికే చెలరేగిన హింస కారణంగా మరణాలు చోటు చేసుకోవటంతో పాటు పలు కుటుంబాలు రక్షణ కోసం ఊళ్లను వదిలేసిన వైనాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి.
ఈ హింసాకాండ వెనుక ఉగ్రభూతం ఉందన్న వాదన వినిపిస్తోంది. హింసకు చెక్ పెట్టేందుకు మమత సర్కారు నిషేధాజ్ఞలు విధించారు. అయినప్పటికి ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ మద్దతుదారులు మాత్రం వాటిని లెక్క చేయకుండా వీధుల్లో నిరసన ప్రదర్శలు చేపట్టటమే కాదు.. వారిని అడ్డుకున్న పోలీసులతో ఘర్షనకు దిగారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు లాఠీ చార్జి జరిపారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముర్షీదాబాద్ లో భారీ హింస చోటు చేసుకోగా.. తాజాగా 24 పరిగణాలో హింస చెలరేగింది. పలు వాహనాలకు నిప్పు పెట్టిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ మద్దతుదారులపై పోలీసులు లాఠీ ఛార్జి జరిపారు. సోమవారం భంగర్ ఏరియాలో ఘర్షణలు జరిగాయి. ఇందులో పలువురు గాయపడ్డారు.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రామ్ లీల మైదాన్ లో ఐఎస్ఎప్ నేత.. భంగర్ ఎమ్మెల్యే నౌషధ్ సిద్ధిఖి చేపట్టిన వక్ఫ్ వ్యతిరే ర్యాలీలో భాగస్వామ్యం అయ్యేందుకు కార్యకర్తలు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. వారు పోలీసులపై దాడికి పాల్పడటంతో పాటు.. బారికేడ్లను ధ్వంసం చేశారు. ఆందోళనకారులు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఉదంతంలో పలువురు పోలీసులు గాయాలపాలయ్యారు. ఇదిలా ఉంటే.. పోలీసులు లాఠీ ఛార్జి జరిపినందుకు నిరసనగా ఐఎస్ఎఫ్ కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయింపు నిరసనలకు దిగారు. పోలీసు బలగాలు భారీగా చేరుకొని అక్కడి వారిని చెదరగొట్టటంతో పరిస్థితి సద్దుమణిగినట్లుగా చెబుతున్నారు.
వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన తర్వాత కూడా ఈ అల్లర్లు చోటు చేసుకోవటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. విభజన రాజకీయాల్ని తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించనని మమతా చెప్పటం తెలిసిందే.అయినప్పటికి అల్లర్లు ఆగలేదు సరికదా పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకొని హింస చెలరేగటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు చర్చగా మారింది.
