Begin typing your search above and press return to search.

మమత స్టాలిన్ మళ్ళీ గెలిస్తే రాజకీయ ప్రకంపనలే !

దేశంలో ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి.

By:  Satya P   |   1 April 2026 8:15 AM IST
మమత స్టాలిన్ మళ్ళీ గెలిస్తే రాజకీయ ప్రకంపనలే !
X

దేశంలో ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 9న అస్సాం, కేరళంలో పాండిచ్చేరి లకు ఎన్నికలు జరుగుతాయి. అలాగే ఏప్రిల్ 23న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లలో అందరి ఫోకస్ ఎక్కువగా బెంగాల్ తమిళనాడుల మీదనే ఉంది. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ ఇద్దరూ ఇండియా కూటమిలో ఫైర్ బ్రాండ్లుగా ముద్ర పడ్డారు. ఈ ఇద్దరూ నేరుగా కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ ని ఢీ అంటే ఢీ అంటూ దూకుడు చేస్తున్నారు.

అంచనాలు చూస్తే :

ఇదిలా ఈ రాష్ట్రాలలో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ఆశలు చూస్తే పశ్చిమ బెంగాల్ ని ఈసారి అయినా స్వాధీనం చేసుకోవాలని ఉంది. అలాగే తమిళనాడులో డీఎంకే ని ఓడించి మిత్ర పక్షం అయిన అన్నా డీఎంకే తో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆరాటపడుతోంది. కానీ మరి కొద్ది రోజులలో ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రాలలో పరిస్థితులు చూస్తే బీజేపీకి కొంత ఇబ్బంది కలిగించే విధంగానే ఉన్నాయని అంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో చూస్తే మమతా బెనర్జీ హవా సాగుతోంది అని సంకేతాలు ఉన్నాయి. అలాగే తమిళనాడులో స్టాలిన్ మరోసారి అధికారంలోకి రావడానికి అనుకూల వాతావరణం ఉంది అని అంటున్నారు.

ఇద్దరూ ఇద్దరే :

ఇక స్టాలిన్ మరోసారి ముఖ్యమంత్రి అయినా మమతా బెనర్జీ వరసగా నాలుగోసారి బెంగాల్ సీఎం అయినా వారిద్దరి జోరుని ఎవరూ ఆపేది లేదని అంటున్నారు. ఇండియా కూటమిలో ఈ ఇద్దరూ మరింత కీలకం అవుతారని అంటున్నారు. ఇండియా కూటమి అయితే ఇప్పటిదాకా ఎన్డీయేతో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ వస్తోంది 2024లో మోడీ మూడోసారి ప్రధాని అయ్యాక వరసగా జరిగిన మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, బీహార్ వంటి చోట్ల ఎన్డీయే విజయ పతాక ఎగువరేసి తన కత్తికి పదును ఎక్కువ అని రుజువు చేసుకుంది. అలాంటి ఎన్డీయే అప్రతిహత విజయాలకు తొలిసారి మమతా స్టాలిన్ బ్రేకులు వేయబోతున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.

పెను ప్రభావం :

ఇక ఈ అయిదు రాష్ట్రాలలో చూసుకుంటే బీజేపీకి తిరిగి అస్సాం దక్కే సూచనలు ఉన్నాయని అంటున్నారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంత్రం పాండిచ్చేరి కూడా ఎన్డీయే ఖాతాలోకి చేరవచ్చు. కానీ కీలక రాష్ట్రాలుగా ఉన్న బెంగాల్, తమిళనాడులో ఎన్డీయే తన బలమైన ప్రదర్శనను చూపించకుంటే మాత్రం అది బీజేపీ శిబిరంలో నిరాశను కలిగించే పరిణామంగానే ఉంటుంది అని అంటున్నారు. ఇక వీటికి అదనం అన్నట్లుగా కేరళంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ గెలిస్తే మాత్రం ఇండియా కూటమికి పట్టపగ్గాలు ఉండవు,

దూకుడు వేరే రేంజిలో :

అక్కడ లెఫ్ట్ పార్టీలు గెలిచినా ఇండియా కూటమిలో భాగస్వాములే. కానీ కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ఇండియా కూటమి దూకుడు వేరే రేంజిలో ఉంటుందని అంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం 2027 లో దేశంలో జరిగే గుజరాత్, యూపీ వంటి రాష్ట్రాల మీద కూడా గణనీయమైన ప్రభావం చూపించడం ఖాయమని అంటున్నారు. మొత్తం మీద చూస్తే బెంగాల్ లో బీజేపీకి ఈసారి కూడా ఆశాభంగం అయితే మాత్రం అది కాషాయ దళానికి కలవరపాటుకు గురి చేసే అంశమని అంటున్నారు. అలాగే తమిళనాడులో స్టాలిన్ పాతుకుని పోతే మాత్రం దక్షిణాదిన బీజేపీ విస్తరణ ఆశలకు సైతం బ్రేకులు పడతాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.