బెంగాల్ లో మరో రచ్చ.. 91 లక్షల ఓట్లు అవుట్.. అత్యధికం ఎక్కడంటే?
ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ.. చిన్న మాటలో చెప్పాలంటే ‘‘సర్’. ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నానటమే కాదు.. కొందరు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
By: Garuda Media | 8 April 2026 10:13 AM ISTఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ.. చిన్న మాటలో చెప్పాలంటే ‘‘సర్’. ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నానటమే కాదు.. కొందరు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చేపట్టిన సర్ ప్రక్రియ అనంతరం అక్కడి ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 91 లక్షల మంది ఓటర్లు అవుట్ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే.. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనప్పటికీ దాడి డేటా ఇదే విషయాన్ని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
గత ఏడాది అక్టోబరు చివరి నాటికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 7.66కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ‘సర్’ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు 90.83 లక్షల ఓటర్లను తొలగించారు. 60.06 లక్ష్ల ఓటర్లను డౌట్.. పెండింగ్ జాబితాలో చేర్చారు. న్యాయాధికారుల పరిశీలన తర్వాత 27.16 లక్షల ఓట్లు తీసేశారు. మిగిలిన 32.68 లక్షల ఓట్లు చెల్లుబాటు అవుతాయని ప్రకటించి జాబితాతాల్లో పేర్లను పునరుద్ధరించారు.ఇప్పుడు 27.16 లక్షల మంది ఓటర్ల పరిస్థితి ఏమిటి? అన్నది గందరగోళంగా మారింది.
దీనికి ముందు అసలు సర్ అంటే ఏంటి? ఆ ప్రక్రియలో ఏం చేస్తారన్నది చూస్తే.. ఈ అంశంపై వచ్చే విమర్శలు.. ఆరోపణల వెనుకున్న విషయాలు ఏమిటన్న దానిపై కాస్తంత అవగాహన వచ్చే వీలుంది. ‘సర్’ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితాను సమగ్రంగా ప్రక్షాళన చేసేందుకు స్టార్ట్ చేసిన ఒక స్పెషల్ ప్రోగ్రాంగా దీన్ని చెప్పాలి. సాధారణంగా జరిగే ఓటర్ల జాబితా సవరణ కంటే మరింత విస్త్రతమైనదిగా చెబుతారు. అదే సమయంలో కచ్ఛితమైనదన్నది మరో వాదన.
తొలుత బూత్ స్థాయిలో అధికారులు నేరుగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటరల్ వివరాలు సరి చూస్తారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరుల పేర్ల జాబితాలో చేరుస్తారు. అదే సమయంలో జాబితాలో కంటే ఎక్కువసార్లు ఉన్న పేర్లను.. మరణించిన వారి పేర్లను.. శాశ్వితంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి ఓట్లను తొలగిస్తారు. ఓటర్ల పేర్లు.. చిరునామా.. ఇతర సమాచారంలో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుతారు.
ఒక వేళ ఏమైనా అభ్యంతరాలు.. ఫిర్యాదులు ఉంటే న్యాయాధికారులు విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటారు. ఓటర్ల జాబితాలో పారదర్శకతను పెంచేందుకు.. అనర్హులను తొలగించి జాబితాను స్వచ్చంగా ఉంచేందుకు ఈ సర్ ప్రక్రియను చేపడుతున్నారు. ఇక.. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రంలో సర్ ప్రక్రియ తర్వాత ఓటర్లు పెద్ద ఎత్తున తీసేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఉంది కాబట్టి.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి సానుకూలంగా ఉన్న వారి ఓటర్లను గంపగుత్తగా తీసేస్తున్నారన్నది వివాదం.
ఇందుకు తగ్గట్లే బెంగాల్ ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపై తీవ్రంగా మండిపడ్డారు. మతువా.. రాజ్ బంశీ ఇతర మైనార్టీల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లుగా ఆమె మండిపడుతున్నారు. తాజాగా నాదియా జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల సభలో మాట్లాడిన ఆమె.. మైనార్టీలు ఎక్కువగా ఉండే ముర్షాదాబాద్.. మాల్దా.. ఉత్తర దీనాజ్ పూర్ జిల్లాల్లో కొన్ని వర్గాల ఓట్లను ఎంచుకొని మరీ ఎక్కువగా తొలగించినట్లు ఆరోపించారు.
తాను సుప్రీంకోర్టు వెళ్లిన తర్వాతే సందేహాలు ఉన్నట్లుగా పేర్కొంటూ పక్కన పెట్టిన 60 లక్షల ఓట్లలో 32 లక్షల ఓట్లను పునరుద్ధరించినట్లుగా పేరకొన్నారు. ముఖ్యమంత్రి మమత మాటలు ఇలా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘం తుది డేటాను చూస్తే.. ముస్లిం ప్రాబల్య జిల్లాగా పేరున్న ముర్షీదాబాద్లో అత్యధికంగా 11.01 లక్షల పేర్లు జ్యూడీషియల్ స్క్రూటీనీకి పంపగా.. వీటిల్లో 4.55 లక్షల ఓట్లను న్యాయాధికారుల పరిశీలన తర్వాత తొలగించారు.
బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా అయిన ఉత్తర 24 పరగణాల జిల్లాలో 3.25 లక్షల ఓట్లు.. మాల్దాలో 2.39 లక్షలు.. దక్షిణ 24 పరగణాల జిల్లాలో 2.23 లక్షలు.. పూర్వ వర్ధమాన్ జిల్లాలో 2.09 లక్షలు.. నాదియా జిల్లాలో 2.98 లక్షల ఓట్లను తీసేశారు. నాదియా.. ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో మతువా వర్గీయుల జనాభా ఎక్కువ. మొత్తంగా పశ్చిమ బెంగాల్ లో చేపట్టిన సర్ ప్రక్రియ ఇప్పుడు హాట్ టాపిక్ గా.. రాజకీయ వివాదంగా మారింది. రానున్న రోజుల్లో ఇదో పెద్ద అంశంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
