నందిగ్రామ్ లో ఓడిన మమతకు భవానీపూర్ లో టఫ్ ఫైట్
పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖ చిత్రం మెల్లగా మారుతోంది. ఇప్పటిదాకా వచ్చిన సర్వేలు అన్నీ పూర్వ పక్షం చేస్తూ అక్కడ మార్పు కనిపిస్తోంది.
By: Satya P | 11 April 2026 8:47 AM ISTపశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖ చిత్రం మెల్లగా మారుతోంది. ఇప్పటిదాకా వచ్చిన సర్వేలు అన్నీ పూర్వ పక్షం చేస్తూ అక్కడ మార్పు కనిపిస్తోంది. నాలుగవ సారి వరుసగా మమతా బెనర్జీ గెలుస్తారు అని సర్వే నివేదికలు అయితే బయటకు వచ్చాయి. ఇవన్నీ మార్చి నెలాఖరు దాకా చేసినవి కావడం విశేషం. అసలైన ఎన్నికల మూడ్ ఏప్రిల్ నెలలోనే కనిపిస్తోంది. ఓటర్లు సీరియస్ గా ఈ ఎన్నికలను ఇపుడే చూస్తున్నారు. మమతకు మూడు సార్లు అధికారం ఇచ్చిన వారు ఇపుడు మార్పు వైపు ఉంటారా అన్న చర్చ అయితే సాగుతోంది.
బీజేపీ నినాదం :
మార్పు అన్నదే బీజేపీ బలమైన నినాదంగా మారింది ఒక వైపు అమిత్ షా మరో వైపు ప్రధాని నరేంద్ర మోడీ బెంగాల్ మారాల్సిందే జాతీయ స్రవంతిలో అభివృద్ధిలో భాగం కావాల్సిందే అంటూ భావోద్వేగమైన ప్రసంగాలు చేస్తున్నారు. ఇన్నాళ్ళు బిక్కు బిక్కుమని జీవిస్తున్నారు అని కూడా బీజేపీ అగ్రనేతలు చెప్పడం విశేషం. బెంగాల్ కి బీజేపీ ఇవ్వబోయేది శాంతి అని కాషాయ నేతలు అంటున్నారు. ప్రజలకు స్వేచ్చ ఇస్తామని చెబుతున్నారు. ఫ్రీగా ప్రజలు ఉండేలా ప్రజాస్వామ్య పాలన ఏమిటో చూపిస్తామని మోడీ చెబుతున్నారు. మమత పాలన అంతా అరాచకం అవినీతి దోపిడీ దౌర్జన్యం అని బీజేపీ అగ్ర నేతలు తూర్పారా పడుతున్నారు.
ఉమ్మడి పౌరస్మృతి హామీ :
బీజేపీ పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపు ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రజలు భయంతోనూ, నిరాశతోనూ ఉన్నారని, మనస్ఫూర్తిగా మార్పును కోరుకుంటున్నారని అన్నారు. గత 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్‌లో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తనను తాను నిరూపించుకుందని ఆయన గుర్తు చేశారు. ఈ రోజున రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే అక్రమ చొరబాట్లపై ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించని విధానాన్ని అవలంబిస్తోందని అమిత్ షా గట్టిగా చెప్పారు.
హిందూ ఓటింగ్ పైనే :
బీజేపీ బెంగాల్ లో హిందూ ఓటింగ్ పోలరైజేషన్ మీదనే ఫోకస్ పెడుతోంది. ఈ రాష్ట్రంలో ముస్లిం జనాభా అధికంగా ఉంటూ ప్రభావితం చేసే నియోజకవర్గాలు ఎక్కువగానే ఉన్నాయి. అదే సమయంలో హిందూ ఓటింగ్ బాగా ఉన్న చోట్ల బీజేపీ దూసుకుని పోయే ప్రయత్నం చేస్తోంది. గతంతో పోలిస్తే హిందువులలో ఐక్యత కనిపిస్తోంది అని అది తమకు వరంగా మారుతుందని బీజేపీ వర్గాలు ఆశాభావంతో ఉన్నారు. ఇక మమతా బెనర్జీ మైనారిటీ బుజ్జగింపు విధానాలు మూడు సార్లు సీఎం గా ఉన్న లా అండ్ ఆర్డర్ లో వైఫల్యాలు కొరవడిన అభివృద్ధి ఇవన్నీ జనాల్లో చర్చకు బీజేపీ నేతలు పెడుతున్నారు. బీజేపీ ఈసారి ఎక్కువగా ఎంచుకున్న ఆయుధం లా అండ్ ఆర్డర్ నే కావడం విశేషం.
మళ్ళీ ఓడించాలని :
ఇదిలా ఉంటే 2021 ఎన్నికల్లో నందిగ్రాం లో మమతా బెనర్జీ ఓటమి పాలు అయ్యారు. ఆమెను ఒకనాడు తృణమూల్ కాంగ్రెస్ లో ఆమె సహచరుడిగా ఉన్న సువేందు అధికారి ఓడించారు. ఆమె పార్టీ గెలిచినా మమత ఓటమి పాలు కావడం 2021లో ఒక హిస్టరీ. అయితే ఈసారి మమత భవానీపూర్ కి షిఫ్ట్ అయ్యారు. అక్కడ నుంచి సేఫ్ జోన్ గా భావించి పోటీకి దిగారు. అయితే ఆమెని ఇక్కడ కూడా ఓడించాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. అందుకే నందిగ్రాం లో ఆమెను ఓడించిన బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారిని భవానీపూర్ నుంచి పోటీ చేయిస్తోంది.
లెక్కలన్నీ పక్కాగా :
ఇక భవానీపూర్ లో లెక్కలు అన్నీ తమకు అనుకూలంగా ఉంటాయని బీజేపీ భావిస్తోంది. అక్కడ హిందువులు ఎక్కువగా ఉన్నారు. అలాగే సిక్కులు జైనులు గుజరాతీలు ఇలా చాలా మంది ఉన్నారు. హిందువులలో ఈ విభిన్నమైన వర్గాలు అన్నింటినీ తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ చూస్తోంది దాంతో పాటు సువేందు అధికారిని పోటీకి దించడం వెనక గెలుపు సెంటిమెంట్ ఉందని భావిస్తున్నారు. మమతను ఓడించడం అలాగే ఆమె ఎక్కడికీ పర్యటనలు చేయకుండా తన సొంత నియోజకవర్గంలోనే తిరిగేలా చేయడం బీజేపీ ప్లాన్ గా కనిపిస్తోంది.
వ్యతిరేకత పెద్దగానే :
మరో వైపు చూస్తే తృణమూల్ కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెద్దగానే ఉంది అని నివేదికలు ఉన్నాయి. బీజేపీ గెలుపు గుర్రం అని నిరూపించుకుంటే ఆ వైపునకు మొగ్గేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. బీజేపీ కూడా వచ్చేది తమ ప్రభుత్వమే అని గట్టిగా చెబుతోంది ఈ పరిణామాల నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కి సీన్ మారుతోంది. గెలుపు అన్నది కష్టమవుతోంది. స్వయంగా మమతా బెనర్జీ భవానీపూర్ లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. దీనిని బట్టి చూస్తే కాషాయ దళం మమతా దీదీ చుట్టూ ఎన్నికల వ్యూహం ఎలా బిగించిందో అర్ధం అవుతుంది అని అంటున్నారు.
