వీడెవడండి బాబు? భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కుతిన్నాడు
‘నిన్ను కొరుక్కు తింటా’ అంటూ భార్య మీద తనకున్న ప్రేమను చెప్పేందుకు ఈ సరదా సంభాషణ చాలా జంటల్లో జరుగుతుంటుంది.
By: Tupaki Desk | 5 May 2025 1:00 PM IST‘నిన్ను కొరుక్కు తింటా’ అంటూ భార్య మీద తనకున్న ప్రేమను చెప్పేందుకు ఈ సరదా సంభాషణ చాలా జంటల్లో జరుగుతుంటుంది. విన్నంతనే సరదాగా అనిపించే ఈ మాటను చేతల్లో నిజంగానే చేసి చూపించిన ఒక భర్త దుర్మార్గం..భార్యకు పెద్ద కష్టాన్నే తీసుకొచ్చింది. తాజాగా భార్య ముక్కు అందంగా ఉందంటూ ఒక భర్త ఆమె ముక్కును కొరుక్కు తిన్న వైనం షాకింగ్ గా మారింది.
ఈ దరిద్రపుగొట్టు ఉదంతం పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని శాంతీపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బేర్పారా ప్రాంతంలో బాపన్ షేక్.. మధు ఖాతూన్ అనే జంట నివసిస్తున్నారు. ఏమైందో ఏమో కానీ ఈ నెల రెండో తేదీ తెల్లవారుజామున మూడు గంటల వేళలో బాపన్ షేక్ ఇంట్లో అలజడి చెలరేగింది. మధు ఖాతూన్ అరుపులు.. కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
ఏమైందో అన్న భయాందోళనలో చుట్టు పక్కల వారు వారి ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే.. ఆమె ముక్కు నుంచి తీవ్రమైన రక్తస్రావం జరగటంతో హడలిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరోవైపు తన తల్లితో కలిసి పోలీస స్టేషన్ కు వెళ్లిన మధుఖాతూన్.. భర్తపై కంప్లైంట్ చేసింది. అవకాశం దొరికితే తన ముక్కును కొరుక్కు తింటానని చెప్పే తన భర్త అన్నంత పని చేశాడని.. తన భర్త తన ముక్కును కొరుక్కు తిన్న విషయాన్ని పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేసింది.
