బెంగాల్ పోలింగ్: ఎన్నికల సంఘం చిత్రమైన నిబంధనలపై విస్మయం!
ఇక, ఎన్నికల ప్రచారం ముగియడానికి గంట ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు లేని విధంగా చిత్రమైన నిబంధనలు విధించింది. వీటిపై సర్వత్రా విమర్శలు.. విస్మయం వ్యక్తమవుతున్నాయి.
By: Garuda Media | 21 April 2026 11:00 PM ISTపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకే ముగిసింది. గురువారం జరగనున్న పోలింగ్ లో 152 స్థానాలలోని అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రజలు తేల్చనున్నారు. ఇక, ఎన్నికల ప్రచారం ముగియడానికి గంట ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు లేని విధంగా చిత్రమైన నిబంధనలు విధించింది. వీటిపై సర్వత్రా విమర్శలు.. విస్మయం వ్యక్తమవుతున్నాయి.
ఇవీ నిబంధనలు..
1) మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు బైకులు, ఆటోల్లో ఎవరూ బయట తిరగ కూడదు.
2) బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. బైకులకు అనుమతి ఇచ్చినా.. సదరు బైకులపై ఇద్దరు చొప్పున కూర్చోకూడదు. కేవలం ఒక్కరు మాత్రమే ప్రయాణించాలి.
3) అంతేకాదు.. అలా వెళ్తున్న వ్యక్తులు ఎవరైనా సరే.. అధికారులు ఆపితే.. తాము ఇంటి నుంచి బయటకు ఎందుకు వచ్చామో చెప్పాలి. దీనికి సంబంధించి సహేతుక కారణం చూపకపోతే.. బైకును స్వాధీనం చేసుకుని 10 వేల రూపాయల వరకు జరిమానా విధిస్తారు.
4) ఆటోల్లో ఇద్దరికి మించి ప్రయాణించడానికి వీల్లేదు(బుధవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్య). వారు కూడా సహేతుక కారణం చూపకపోతే.. కేసులు నమోదు చేస్తారు.
5) తొలిదశ పోలింగ్ జరిగే గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇవేనిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.
కారణమేంటి?
ఎన్నికల సంఘం ఈ నిబంధనలకు సంబంధించి.. రెండు కీలక కారణాలు పేర్కొంది. 1) నగదు రవాణాను నిలువరించడం. 2) క్రౌడ్ నియంత్రణ. బైకులను విచ్చలవిడిగా వదిలేస్తే.. వాటి ద్వారా రాత్రివేళలలో ఓటర్లకు నగదు పంచే కార్యక్రమాలు పెరుగుతా యని పేర్కొంది. రాత్రి వేళల్లో నగదు పంపిణీని అడ్డుకునేందుకు ఈ తరహా నిబంధన అవసరమని తెలిపింది. ఇక, క్రౌడ్ నియంత్రణ కూడా అత్యంత అవసరమని.. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతకల్పించేందుకు ఈ పరిణామాలు ఉపయోగపడతాయని పేర్కొంది.
పార్టీల విమర్శలు..
ఎన్నికల సంఘం విధించిన నిబంధనలపై బీజేపీ మినహా.. ఇతర పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇది ఒక పార్టీకి మేలు చేసేందుకు.. చేసిన ప్రయత్నమని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుయ్యబట్టారు. అయితే.. ఎన్నికల సంఘం నిజాయితీగా వ్యవహరిస్తే.. తప్పులేదని కొందరు పేర్కొన్నారు. ఇదిలావుంటే.. స్కూళ్లకు కాలేజీకి..ఆరోగ్య అవసరాలకు వెళ్లే వారికి మాత్రమే మినహాయింపు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. వారు కూడా.. సంబంధిత ఐడీ కార్డులను దగ్గర ఉంచుకోవాలని పేర్కొంది.
