Begin typing your search above and press return to search.

బెంగాల్ సమరం : పోలింగ్ బూత్ లు షేక్ అయ్యాయి !

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టానికి తెర లేచింది. ఒక విధంగా సరికొత్త రికార్డు అని కూడా చెప్పాల్సి ఉంది.

By:  Satya P   |   24 April 2026 9:06 AM IST
బెంగాల్ సమరం : పోలింగ్ బూత్ లు షేక్ అయ్యాయి !
X

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టానికి తెర లేచింది. ఒక విధంగా సరికొత్త రికార్డు అని కూడా చెప్పాల్సి ఉంది. బెంగాల్ లో రెండు విడతలుగా జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మొదటి దశ పోలింగ్ గురువారం ముగిసింది. అయితే ఓటింగ్ శాతం మాత్రం నయా రికార్డులను నెలకొల్పింది. సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ శాతం 90 శాతం దాటిందని రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఎన్నికల చరిత్రలో ఇది అపూర్వమైనదని ఎన్నికల సంఘం పేర్కొంది. జనాలు అంతా పోలింగ్ బూత్ లకు దండెత్తి వచ్చారా అన్నట్లుగా ఓటింగ్ సాగింది. దాంతో జనాల ఉత్సాహానికి ఉత్తేజానికి పోలింగ్ బూత్ లే షేక్ అయిన పరిస్థితి ఉంది అంటున్నారు.

తొలి దశలో వేవ్ :

ఇదిలా ఉంటే మొదటి దశలో పశ్చిమ బెంగాల్‌లోని 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాల్లో సుమారు 3.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి పోలింగ్ ఘట్టం లో అత్యంత చురుకుగా పాల్గొన్నారు. తొలిసారి ఓటు వేస్తున్న ఓటర్ల సంఖ్య కూడా ఈసారి చూస్తే గణనీయంగా ఉంది. పల్లెల నుండి నగరాల వరకు ఓటర్ల ఉత్సాహం ఈ మొదటి విడత ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది.

ఓవరాల్ గా కూల్ గా :

ఇక చూస్తే కనుక పోలింగ్ ఓవరాల్ గా చాలా వరకు ప్రశాంతమైన వాతావరణంలో సాగిందని అంటున్నారు. అయితే ముర్షిదాబాద్, అసన్‌సోల్, బీర్‌భూమ్ వంటి ప్రాంతాలలో చెదురు మదురు ఘటనలు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. అక్కడ ఘర్షణలు విధ్వంసం జరిగినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. మరి కొన్ని చోట్ల బెదిరింపులు, ఈవీఎంలలో సాంకేతిక లోపాలపై కూడా ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయని తెలుసింది. అయితే ఈసారి పోలింగ్ కి భద్రత ఒక పెద్ద సవాలుగా మారింది. పోలింగ్ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర బలగాలను కూడా అనేక చోట్ల భారీగానే మోహరించారు. అదే విధంగా ప్రతి బూత్‌లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్‌లు పహారా కాశాయి. ఈ రకంగా పెద్ద ఎత్తున తీసుకున్న భద్రతా చర్యల వల్ల ఎలాంటి అంతరాయం లేకుండా ఓటింగ్ నిర్వహించడం సాధ్యమైందని కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.

మొదటి దశ కీలకం :

పశ్చిమ బెంగాల్ లో మొత్తం అసెంబ్లీ సీట్లు 294గా ఉన్నాయి. అందులో మెజారిటీ 152 కి మొదటి దశలో పోలింగ్ జరిగింది. ఇక రాజకీయంగా చూసినా కూడా మొదటి దశ చాలా కీలకమైనది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ వామపక్షాలకు ఈ మొదటి దశ అతి పెద్ద బలాబలాల పరీక్షగా నిలిస్తోంది. ఈ మొదటి దశలోని ఓటర్ల వైఖరి వారి మనోభావాలను అనుసరించి రెండవ దశలో ప్రచార వ్యూహాలను ప్రధాన పార్టీలు రూపొందిస్తాయని అంటున్నారు.

మహిళా ఓటింగ్ తో :

ఇక్కడ మొదటి దశలో రెండు అంశాలు అందరిలో చర్చకు తావిస్తున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లకు రావడం ఎవరికి అనుకూలం అన్నది ఒక చర్చ అయితే పోలింగ్ ఏకంగా 90 శాతానికి పై దాటడం అన్నది కూడా ఎవరికి పాజిటివ్ అన్నది మరో చర్చ. సాధారణంగా మహిళా ఓటింగ్ అంటే ఒక గట్టి నిర్ణయం తీసుకునేందుకు వారు వస్తారు అని అంటారు. అలాగే భారీ పోలింగ్ కూడా ఏదైనా రాజకీయ మార్పునకు సంకేతమా అన్న చర్చ కూడా ఉంది. ఇవన్నీ ఇపుడు ప్రధాన పార్టీలు అయిన అధికార తృణమూల్ అలాగే కేంద్రంలో అధికారంలో ఉంటూ బెంగాల్ లో అధికారం కోసం ప్రధాన పోటీదారుగా ఉన్న బీజేపీ శిబిరాలలలో హాట్ డిస్కషన్ గా సాగుతోంది.