బీజేపీ గెలిస్తే వారంతా జైలుకే !
భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్ మీద పూర్తిగా మోజు ఉంది. మనసు కూడా అక్కడే ఉంది. దేశంలో ఎన్ని రాష్ట్రాలు గెలిచినా బెంగాల్ గెలుపే గెలుపు.
By: Satya P | 22 April 2026 7:00 AM ISTభారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్ మీద పూర్తిగా మోజు ఉంది. మనసు కూడా అక్కడే ఉంది. దేశంలో ఎన్ని రాష్ట్రాలు గెలిచినా బెంగాల్ గెలుపే గెలుపు. మజా అంతా అక్కడే ఉంది. నిజానికి చూస్తే బెంగాల్ మామూలు గడ్డ కాదు, అది పోరు గడ్డ. స్వాతంత్రానికి ఉద్యమ ఊపిరులూదిన నేల. 1905లో వందేమాతరం ఉద్యమం తో జాతిని మేలుకొలిపిన భూమి. దాని కంటే ముందు కూడా చరిత్రలో రాజుల కాలంలో కూడా బెంగాల్ కి ఎంతో వైభవం ఉంది. మొదటి నుంచి చైతన్యం ఎక్కువ కలిగిన ప్రాంతం అది.
మూడు పార్టీల ఆధిపత్యం :
ఇక దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మూడు దశాబ్దాల పాటు అప్రతిహతంగా బెంగాల్ ని కాంగ్రెస్ ఏలింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా ఎందరో పాలించారు. ఇక బెంగాల్ తొలి ముఖ్యమంత్రి 1948లో ప్రఫుల్ల చంద్ర ఘోష్ అయితే కాంగ్రెస్ కి చెందిన చివరి సీఎం గా సిద్ధార్థ శంకర్ రే ఉన్నారు. ఆయన 1977 దాకా పాలించారు. ఆ తరువాత జ్యోతి బాస్ సీపీఎం నుంచి సీఎం అయ్యారు. ఆయన ఏకధాటిగా 33 ఏళ్ళు పాలించి 2000లో రిటైర్ అయ్యారు. ఆయన వారసుడిగా బుద్ధదేవ్ భట్టాచార్య పదకొండేళ్ళ పాటు పాలించి 2011లో మాజీ సీఎం అయ్యారు. ఆనాటి నుంచి నేటి వరకూ వరసగా మూడు ఎన్నికల్లో గెలిచి పదిహేనేళ్ళ పాటు బెంగాల్ సీఎం గా మమతా బెనర్జీ కొనసాగుతున్నారు.
కమల వికాసం కోసం :
బెంగాల్ లో ఎక్కువగా వామపక్ష భావజాలం ఉంటుంది. అంతే కాదు మైనారిటీల ప్రభావితం అయ్యే నియోజకవర్గాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ హిందూత్వ నినాదంతో బీజేపీ కమల వికాసం కోసం గట్టి ప్రయత్నం చేస్తోంది. 2021లో 78 సీట్ల దాకా వచ్చిన బీజేపీ ఈసారి అధికారం కోసం బలమైన పోటీదారుగా మారింది. బెంగాల్ లో ఒక రకమైన నిట్ట నిలువు విభజన వచ్చేలా బీజేపీ చేసిన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది. హిందూత్వ ఓటుని కన్సాలిడేట్ చేయడం మీద బీజేపీ విజయం ఆధారపడి ఉంది. మరో వైపు సెక్యులర్ ఫోర్సెస్ ఎపుడూ తృణమూల్ కాంగ్రెస్ కి అండగా ఉంటూ వస్తున్నాయి. దాంతో పాటు మైనారిటీల పోలరైజేషన్ కూడా మమతా బెనర్జీకి ఉపకరించేలా ఉంది అని అంటున్నారు.
మొదటి దశలో కీలకం :
ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిస్తింది. చివరి రోజున అయితే , కేంద్ర హోం మంత్రి సీనియర్ బీజేపీ నాయకుడు అమిత్ షా పశ్చిమ బర్ధమాన్‌లోని కుల్టీలో భారీ సభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంలో విస్తృత అవినీతి, అరాచకం నెలకొని ఉన్నాయని ఆరోపిస్తూ అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని వారిపై పదేపదే జరుగుతున్న హింసాత్మక ఘటనలను ఆయన ఎత్తిచూపారు. ఇటువంటి వైఫల్యాలకు ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉన్న మమతా బెనర్జీ సిగ్గుపడాలని ఆయన అన్నారు.
జైలుకే పంపిస్తాం :
ఇదిలా ఉంటే డబ్బు కోసం ఉద్యోగాలను అమ్ముకోవడం అక్రమ మైనింగ్‌కు అనుమతించడం చట్టవిరుద్ధమైన స్మగ్లింగ్‌కు పాల్పడటం వంటి ఆరోపణలను కూడా హోం మంత్రి అమిత్ షా మమతా బెనర్జీ ప్రభుత్వంపైన చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే సుపరిపాలనను అందిస్తామని ఆయన హామీ ఇస్తూనే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. అంతే కాదు ప్రతి ఏటా లక్ష ఉద్యోగాలు సృష్టిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఎలాంటి సంక్షేమ పథకాలను నిలిపి వేయబోమని కూడా అమిత్ షా వెల్లడించారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ వెంటనే అవినీతి నాయకులను జైలుకు పంపుతామని ఆయన తీవ్ర హెచ్చరిక జారీ చేయడం విశేషం.
బీజేపీకి చోటు లేదు :
మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హల్దియాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ బీజేపీ తప్పుడు వాగ్దానాలు చేస్తోందని ఆరోపించారు. బెంగాల్ లో బీజేపీకి చోటు లేదని ఆమె కచ్చితనా చెప్పేశారు. మరోసారి తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని కూడా మమత పూర్తి ధీమా వ్యక్తం చేయడం విశేషం. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర పార్టీలు కూడా తమ అభ్యర్థులకు మద్దతుగా తొలి విడతలో ప్రచారం చేశాయి. ఈ నెల 23న జరిగే తొలి విడతలో 152 సీట్లకు పోలింగ్ జరగనుంది. ప్రజా తీర్పు ఏ వైపు ఉంది అన్నతి తరువాత చూడాల్సి ఉంది.
