పరామర్శకు దీదీ మేనల్లుడు హెల్మెట్ పెట్టుకు వెళ్లారా?
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోని రాజకీయాలు మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా.. తమదైన ప్రత్యేకతను సంతరించుకున్నట్లుగా ఉంటాయి. ఆ కోవలోకే వస్తుంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం.
By: Garuda Media | 31 May 2026 11:48 AM ISTదేశంలోని కొన్ని రాష్ట్రాల్లోని రాజకీయాలు మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా.. తమదైన ప్రత్యేకతను సంతరించుకున్నట్లుగా ఉంటాయి. ఆ కోవలోకే వస్తుంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. రాజకీయవైరం మాటల్లో కంటే చేతల్లోనే ఎక్కువగా ఉంటుంది. దేశంలోని మెజార్టీ రాష్ట్రాలకు భిన్నంగా ఆ రాష్ట్రంలో అధికార బదిలీ సింఫుల్ గా సాగదు. భారీ హింసతో పాటు.. పలువురు ప్రాణాలు పోయే దుర్మార్గమైన పరిస్థితి ఆ రాష్ట్రం సొంతం. అదే సమయంలో బెంగాల్ లో ఒక రాజకీయ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. అదే సమయంలో పొలిటికల్ పవర్ చేతికి వస్తే మాత్రం పరిణామాలు వేగంగా మారిపోతాయి.
అప్పటివరకు తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన రాజకీయ పార్టీ అప్పటికప్పుడు కేరాఫ్ అడ్రస్ లేనట్లుగా మారుతుంది. దీనికి తోడు అధికారంలో ఉన్నప్పుడు.. తామెలా అధికారాన్ని చెలాయించామో.. అంతకుమించి అన్నట్లుగా ప్రత్యర్థి పార్టీల తీరు ఉంటుంది. దీంతో.. అప్పటివరకు తమ మాటకు తిరుగులేదన్నట్లుగా సాగిన పరిస్థితిని నుంచి ఛీత్కారాలు ఎదురయ్యే దుస్థితి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదిహేనేళ్ల పాటు నాన్ స్టాప్ గా అధికారాన్ని చెలాయించిన తృణమూల్ కాంగ్రెస్.. సుదీర్ఘకాలం తర్వాత విపక్ష హోదాలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
నా మాటే శాసనం అన్న తరహాలో..దేశంలోనే అత్యున్నత పదవైన రాష్ట్రపతికి సైతం తమకు ఇష్టం లేకుండా తమ రాష్ట్రానికి వస్తే ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయన్న విషయాన్ని తెలియజేసేందుకు సైతం వెనుకాడని టీఎంసీకి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత షాకింగ్ ఉదంతాలు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ వ్యవహరించిన కాలంలో మరో తిరుగులేని అధికార కేంద్రంగా వ్యవహరించిన ఆమె మేనల్లుడు కం టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి దారుణ చేదు అనుభవం ఎదురైంది.
ఈ మధ్య ముగిసిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో బాధితులైన తమ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన సోనార్ పూర్ కు వెళ్లారు. సౌత్ 24 పరగణాల పరిధిలోని ఈ ప్రాంతానికి వెళ్లిన ఆయన.. ఇటీవల హత్యకు గురైన పార్టీ కార్యకర్త సంజై కర్మాకర్ కుటుంబ సభ్యులను.. తమ రాజకీయ ప్రత్యర్థుల దాడిలో గాయపడిన ఇతర బాధితులను కలిసి వారికి అండగా ఉండేందుకు నిర్వహించిన కార్యక్రమం అనూహ్యంగా ఆయనపైనే దాడి జరగటం గమనార్హం.
ఆయన పర్యటించిన సోనార్ పూర్ ప్రస్తుతం బీజేపీ అధిక్యతలో ఉంది. గతంలో టీఎంసీకి కంచుకోటలాంటి ప్రాంతం.. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం రాజకీయ బలాబలాలు పూర్తిగా మారిపోయాయి. సాధారణంగా విపక్ష పార్టీకి చెందిన కీలక నేత.. పరామర్శ కోసం వస్తున్నప్పుడు.. అది కూడా హత్యకు గురై.. దాడుల బారిన పడిన బాధితుల కుటుంబాలను కలిసేందుకు వచ్చే వేళలో.. ఒకలాంటి గంభీరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. పార్టీ నేతల.. సానుభూతిపరుల పెద్ద ఎత్తున బయటకు రావటం.. తమ సంఘీభావాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అందుకు భిన్నమైన సీన్ దీదీ మేనల్లుడి పరామర్శ పర్యటన సందర్భంగా చోటు చేసుకోవటం విశేషం.
సోనార్ పూర్ లో పర్యటిస్తున్న సమయంలో ఆయనపై నిరసనకారులు ఒక్కసారిగా తిరగబడ్డారు. ఆయనపై గుడ్లు.. చెప్పులు.. రాళ్లు విసరటమే కాదు.. దొంగ.. దొంగ అంటూ నినాదాలు చేయటంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన హెల్మెట్ పెట్టుకొని పరామర్శకు వెళ్లినట్లుగా ఫోటోలు వైరల్ అయ్యాయి. అసలు వాస్తవం ఏమంటే.. బాధితుల ఇళ్లకు అభిషేక్ బెనర్జీ చేరుకున్న తర్వాత.. స్థానిక నిరసనకారులు ఒక్కసారిగా ఆయనపైకి దాడికి దిగారు. గుడ్లు.. చెప్పులు.. రాళ్లు మాత్రమే కాదు ఇటుకలు కూడా విసరటం మొదలైంది. ఇదే సమయంలో ఒక ఇటుక రాయి ఆయన కంటికి సమీపంలో తగలటంతో స్పందించిన భద్రతా సిబ్బంది ఆయన్ను కాపాడేందుకు తక్షణ రక్షణగా ఒక పోలీస్ హెల్మెట్ ఇచ్చి.. ఆయన్ను వెంటనే పెట్టుకోవాలని కోరారు.
అనూహ్య రీతిలో ఉన్న పరిస్థితులను గుర్తించిన ఆయన.. వెంటనే హెల్మెట్ పెట్టుకున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తాను ఆ టైంలో హెల్మెట్ పెట్టుకోకుంటే.. తన తల రెండు ముక్కలయ్యేదని ఒక మీడియా సంస్థకు వెల్లడించారు. ఆయనపై జరిగిన దాడి సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఆయన చొక్కా చినిగిపోగా.. నిరసనకారులు ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఆయన్ను తక్షణం అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. గాయపడిన ఆయన ప్రస్తుతం కోల్ కతాలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తనపై జరిగిన దాడి బీజేపీ స్పాన్సర్ చేసిన కుట్రగా అభివర్ణించారు. తనను చంపేందుకే ఈ దాడికి పాల్పడినట్లుగా అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. మాజీ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ ఘటనపై స్పందించి.. పాలకులు హంతకులుగా మారినట్లుగా మండిపడ్డారు. సాధారణంగా మూడు పర్యాయాలు బ్యాక్ టు బ్యాక్ పాలన సాగించిన పార్టీకి చెందిన కీలక నేతపై ఇలాంటి దాడి జరిగినప్పుడు సానుభూతి వెల్లువెత్తుతుంది. అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటం గమనార్హం.
టీఎంసీలో నెంబర్ 2గా ఉండే అభిషేక్ బెనర్జీ విషయానికి వస్తే.. ఆయన్ను తక్కువగా చూడటానికి కుదరదు. 23 ఏళ్ల చిరు ప్రాయంలోనే పార్టీ యూత్ విభాగానికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి.. 2021 నాటికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందిన ఇతగాడి మాటలు మామూలుగా ఉండవు. అతడి తీరు నచ్చక పలువురు టీఎంసీ నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయారు. అలా వెళ్లిన వారిలో ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా ఒకరు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అతగాడు చేసిన తీవ్ర వ్యాఖ్యలను చూస్తే.. అయ్యగారి వ్యవహర శైలి ఎలా ఉంటుందన్నది ఇట్టే అర్థమవుతుంది.
ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 4 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అర్థరాత్రి దాటిన తర్వాత అసలు ఆట మొదలవుతుందన్న బరితెగింపు మాటలు అతగాడి సొంతం. రెచ్చగొట్టటం.. హింసను ప్రేరేపించేలా మాట్లాడేందుకు ఆయన అస్సలు వెనుకాడరు. ఇలాంటి పవర్ ఫుల్ నేత తమ పార్టీకి చెందిన బాధితుల ఇళ్లకు పరామర్శ కోసం వెళితే.. దాడి జరగటం.. గాయపడటం చూస్తే.. చేసుకున్నోడికి చేసుకున్నంత అన్న మాట గుర్తుకు రాక మానదు.
