రూ.5కే ఫిష్ మీల్స్.. పశ్చిమబెంగాల్ లో సంచలన పథకం
విపక్షం తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలకు గట్టి కౌంటర్ గానే సీఎం సువేందు ఈ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు.
By: Tupaki Political Desk | 27 May 2026 12:16 PM ISTపశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన పథకాన్ని ప్రకటించారు. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా రూ.5కే చేప భోజనం పెట్టే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు 400 చోట్ల క్యాంటిన్లు తెరచి పేదలకు నాన్ వెజ్ భోజనం రుచిచూపిస్తామని వెల్లడించారు. బెంగాలీలకు ఎంతో ఇష్టమైన చేపలతో భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి సువేందు అధికారి నిర్ణయించడం సంచలనంగా మారింది. ఇప్పటివరకు దేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ తరహా క్యాంటిన్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. రూ.5కు అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం అమలు చేస్తున్నారు. కానీ, తమిళనాడులో చేపలతో భోజనం పెడతామని ప్రభుత్వం ప్రకటించడం విస్తృత చర్చకు దారితీస్తోంది.
పశ్చిమ బెంగాల్ ప్రజల మనసు గెలుచుకునేందుకు సీఎం సువేందు ఈ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారని అంటున్నారు. బెంగాలీల జీవితంలో విడదీయరాని భాగమైన ‘చేపల భోజనాన్ని’ కేవలం రూ. 5 లకే అందిస్తామని ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది క్యాంటీన్ల ద్వారా ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. రాజకీయంగానే కాకుండా, సామాజికంగానూ ఈ పథకం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ పథకానికి రకరకాల పేర్లు పరిశీలిస్తున్నారు. తమిళనాడులో అమ్మా క్యాంటిన్, ఏపీలో అన్నా క్యాంటిన్, కర్ణాటకలో ఇందిరా క్యాంటిన్, రాజస్థాన్ లో అన్నపూర్ణ రసోయి అన్న పేర్లతో ఈ తరహా పథకాన్ని అమలు చేస్తున్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తొలిసారిగా రూ.5 భోజనం పథకం అమలులోకి తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది. రాజస్థాన్ లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ హయాంలో ఈ క్యాంటిన్లను ప్రారంభించారని చెబుతున్నారు. కానీ, బెంగాల్ లో మాత్రం ఇతర సంక్షేమ పథకాలకు భిన్నంగా చేప భోజనం రూ.5కే అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. బెంగాల్ సంస్కృతి, ఆహార అలవాట్లలో చేపలకు అత్యున్నత స్థానం ఉంది.
బలమైన రాజకీయ వ్యూహం!
విపక్షం తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలకు గట్టి కౌంటర్ గానే సీఎం సువేందు ఈ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్లో చేపల వినియోగాన్ని, మాంసాహారాన్ని నిషేధిస్తుందంటూ తృణమూల్ కాంగ్రెస్ (TMC) గతంలో విస్తృతంగా ప్రచారం చేసింది. సంస్కృతిని గౌరవిస్తున్నామనే సంకేతం ఇవ్వడానికే ముఖ్యమంత్రి ఈ సంచలన పథకానికి తెరతీశారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాము బెంగాలీ సంస్కృతికి, వారి ఆహార అలవాట్లకు వ్యతిరేకం కాదని, పైగా వాటిని ప్రోత్సహిస్తామని నిరూపించేందుకే కేవలం ఐదు రూపాయలకే చేప కూరతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించాలని సీఎం సువేందు అధికారి నిర్ణయించారని అంటున్నారు.
400 క్యాంటీన్లు
ప్రాథమిక సమాచారం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 400 క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ.5కే ఫిష్ మీల్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారని అంటున్నారు. ఈ పథకంతోపాటు 'అన్నపూర్ణ యోజన' కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 3,000 ఆర్థిక సాయం కూడా అందిస్తామని సీఎం ప్రకటించారు. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ 400 క్యాంటీన్లను అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉందని నివేదికలు చెప్తున్నాయి.
