Begin typing your search above and press return to search.

యుద్ధం కంటే వేగంగా ‘అబద్ధం’!.. సోషల్ మీడియాలో ఏఐ మాయాజాలం.. అసలు నిజమెంత?

ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే, సోషల్ మీడియాలో మాత్రం మరో రకమైన ‘డిజిటల్ యుద్ధం’ నడుస్తోంది.

By:  Tupaki Political Desk   |   7 March 2026 5:00 PM IST
యుద్ధం కంటే వేగంగా ‘అబద్ధం’!.. సోషల్ మీడియాలో ఏఐ మాయాజాలం.. అసలు నిజమెంత?
X

ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే, సోషల్ మీడియాలో మాత్రం మరో రకమైన ‘డిజిటల్ యుద్ధం’ నడుస్తోంది. మనం యూట్యూబ్ లేదా ఇన్‌ స్టాలో ఓపెన్ చేయగానే భయంకరమైన పేలుళ్లు, క్షిపణి దాడుల వీడియోలు కనిపిస్తున్నాయి. కానీ, మీకు తెలుసా? మనం చూస్తున్న ఆ వీడియోల్లో కేవలం 10 శాతం మాత్రమే నిజం అని, మిగిలిన 90 శాతం ఉత్తుత్తిదేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడి ఏది నిజమో, ఏది అబద్ధమో గుర్తుపట్టలేనంతగా వీడియోలు సృష్టిస్తున్నారు.

లైకులు, షేర్ల కోసం 'ఫేక్' దందా!

అసలు ఇలాంటి తప్పుడు వీడియోలు ఎందుకు పెడుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు కారణం చాలా సింపుల్.. అదే డబ్బు. ఎక్కువ మందిని ఆకర్షించడానికి (Attraction), వ్యూస్ పెంచుకోవడానికి, తద్వారా సబ్ స్క్రైబర్స్, లైకుల కోసం కొందరు ఈ దారుణానికి ఒడిగడుతున్నారు. సోషల్ మీడియాలో గాసిప్ లకు ఉండే క్రేజ్ ను వీరం పెట్టుబడిగా మలుచుకుంటున్నారు. యుద్ధం అంటే భయం ఉండాలి కానీ, దాన్ని ఒక వినోదంగా మార్చేసి కాసులు కురిపించుకోవడం నిజంగా బాధాకరం.

ఇరాన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా..?

ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం ఇరాన్‌లో అసలు ఇంటర్నెట్ సౌకర్యమే లేదు. కేవలం ప్రభుత్వం తన అత్యవసర అవసరాల కోసం మాత్రమే 10 శాతం ఇంటర్నెట్‌ను వాడుకుంటోంది. మరి అక్కడ ఇంటర్నెట్ లేనప్పుడు, అక్కడ జరుగుతున్న దాడుల వీడియోలు నిమిష నిమిషానికి సోషల్ మీడియాలోకి ఎలా వస్తున్నాయి? అని ఆలోచిస్తే, అవన్నీ వేరే దేశాల్లో కూర్చుని ఏఐ ద్వారా జనరేట్ చేసినవని అర్థమవుతుంది. ఏ దేశ మద్దతుదారులు ఆ దేశానికి అనుకూలంగా, శత్రు దేశం సర్వనాశనం అయిపోతున్నట్లు వీడియోలు క్రియేట్ చేసి వదులుతున్నారు.

భారత ప్రభుత్వం హెచ్చరిక!

ఈ పరిస్థితులను గమనించిన భారత ప్రభుత్వం ఇప్పటికే ఒక కీలక సూచన చేసింది. యుద్ధ వార్తలను ప్రచురించేటప్పుడు లేదా షేర్ చేసేటప్పుడు ఆచీ తూచీ వ్యవహరించాలని, అధికారిక సమాచారం లేకుండా దేనినీ నమ్మద్దని కోరింది. ఒక చిన్న తప్పుడు వార్త వల్ల సమాజంలో అనవసరమైన భయాందోళనలు కలిగే ప్రమాదం ఉంది.

మనం ఏం చేయాలి?

నిజనిర్ధారణ.. ఏదైనా వీడియో చూడగానే అది పాతదా లేదంటే ఏఐతో సృష్టించినదా అని ఒకసారి ఆలోచించుకోవాలి.

అధికారిక సంస్థలనే నమ్మండి.. పేరున్న వార్తా సంస్థలు లేదా ప్రభుత్వ వెబ్ సైట్ల ద్వారా వచ్చే సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోండి.

అనుమానంగా ఉన్న ఏ వీడియోను ఇతరులకు షేర్ చేయకండి.

టెక్నాలజీ అనేది మనకు జ్ఞానాన్ని ఇవ్వాలి కానీ, ఇలాంటి గందరగోళాన్ని సృష్టించకూడదు. యుద్ధం భూమి మీద జరుగుతుంటే, దాని కంటే భయంకరమైన యుద్ధం మన స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్ల మీద జరుగుతోంది. అబద్ధపు ప్రచారాలకు ఆకర్షితులు కాకుండా, నిజానిజాలను గ్రహించే విజ్ఞతను మనం పెంపొందించుకోవాలి. లేదంటే, ఈ 'డిజిటల్ మాయాజాలం'లో మనం కూడా బాధితులం కాక తప్పదు!