అదీ ట్రంప్.. నాలుక మడతట్టేస్తాడంతే..
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆరడం లేదు సరే కదా.. రోజురోజుకూ మరింత భీకరంగా మారుతున్నాయి.
By: A.N.Kumar | 2 April 2026 5:31 PM ISTపశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆరడం లేదు సరే కదా.. రోజురోజుకూ మరింత భీకరంగా మారుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. యుద్ధాన్ని ఆపుతారో లేక మరింత పెంచుతారో అర్థం కాని గందరగోళ పరిస్థితి నెలకొంది.
ట్రంప్ 'నాలుక మడత'.. అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తూ పశ్చిమాసియా సంక్షోభాన్ని మరో మలుపు తిప్పారు. మొదట ఇరాన్‌పై దాడులు మరో 2-3 వారాల్లో ముగిసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన.. హర్మూజ్ జలసంధిలో నౌకల రవాణా భద్రత తమ బాధ్యత కాదని బాంబు పేల్చారు. అయితే కొద్దిసేపటికే తన స్వరాన్ని పూర్తిగా మార్చేసి.. ఒకవేళ హర్మూజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత రవాణాకు ఆటంకం కలిగితే ఇరాన్‌పై భీకర స్థాయిలో బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు. ట్రంప్ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరి అంతర్జాతీయ దౌత్య వర్గాలను అయోమయంలో పడేసింది.
రగులుతున్న లెబనాన్.. ప్రతిఘటిస్తున్న ఇరాన్
క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో లెబనాన్ రాజధాని బీరుట్ శివార్లలో విధ్వంసం తాండవిస్తోంది. భవనాలు కుప్పకూలిపోగా వందలాది వాహనాలు అగ్నికీలలకు ఆహుతయ్యాయి. ఇటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని ఇజ్రాయెల్ అనుకూల దేశాలపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. టెహ్రాన్‌లోని పాత అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన దాడులు ఇరు దేశాల మధ్య ఉన్న పాత కక్షలను గుర్తుకు తెస్తున్నాయి.
శాంతికి సిద్ధమంటున్న ఇరాన్.. కానీ!
యుద్ధం వల్ల జరుగుతున్న నష్టాన్ని గమనించిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమని, అయితే తమకు భద్రతా హామీలు కావాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇరాన్‌పై దాడులు జరగవనే భరోసా ఇస్తేనే వెనక్కి తగ్గుతామని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేయడం గమనార్హం.
నాటోపై ట్రంప్ విమర్శల బాణం
అమెరికా మిత్రదేశాల కూటమి అయిన నాటో పై కూడా ట్రంప్ విరుచుకుపడ్డారు. నాటోను ఒక "కాగితపు పులి" గా అభివర్ణించడమే కాకుండా అవసరమైతే అమెరికా ఆ కూటమి నుంచి వైదొలిగే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పడం సంచలనం రేపింది. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని రంగంలోకి దిగి హర్మూజ్ జలసంధిలో రక్షణ కోసం అంతర్జాతీయ స్థాయి చర్చలకు పిలుపునిచ్చారు.
భారతీయుడికి గాయం.. ప్రాణాలు కోల్పోయిన బంగ్లాదేశీ
ఈ యుద్ధం కేవలం ఇజ్రాయెల్, ఇరాన్‌లకే పరిమితం కాకుండా జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలకు పాకింది. యూఏఈలో జరిగిన డ్రోన్ దాడిలో ఒక భారతీయ పౌరుడు గాయపడటం భారత్‌లో ఆందోళన కలిగిస్తోంది. డ్రోన్‌ను గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసినప్పటికీ దాని శకలాలు పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఇదే క్రమంలో ఒక బంగ్లాదేశ్ పౌరుడు మృతి చెందడం విషాదకరం.
ట్రంప్ మాటలు, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడుల మధ్య పశ్చిమాసియా ఒక అగ్నిగుండంలా మారింది. అగ్రరాజ్యాల మధ్య సరైన అవగాహన లేకపోవడం, హెచ్చరికల పర్వం కొనసాగడం చూస్తుంటే ఈ యుద్ధం త్వరలో ముగుస్తుందా లేక ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న భయం అందరిలోనూ నెలకొంది.
