యూత్ లో వింత ట్రెండ్.. వీకెండ్ మ్యారేజ్ ఇప్పుడిదే హాట్ టాపిక్
వీకెండ్ మ్యారేజ్‌లో భార్యాభర్తలు ప్రతిరోజూ కలిసి ఉండరు. ఈ పెళ్లిళ్లలో జంటలు తమ కెరీర్‌కు, స్నేహితులకు, వ్యక్తిగత జీవితానికి కూడా సమయాన్ని కేటాయిస్తారు.
By: Tupaki Desk | 3 May 2025 11:00 PM ISTఈ రోజుల్లో ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో యువతరం ఎన్నో కొత్త పదాలు వాడుతున్నారు. తాజాగా పెళ్లికి సంబంధించి ఒక కొత్త ట్రెండ్ బాగా పాపులర్ అవుతుంది. అదే "వీకెండ్ మ్యారేజ్". పేరు వినడానికి కాస్త వింతగా ఉన్నా, చాలా మంది దీన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. వీకెండ్ మ్యారేజ్‌లో భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకుంటారు. కానీ పెళ్లయ్యాక కూడా వేర్వేరు ఇళ్లల్లో ఉంటారు.. అవును, ఇది నిజం. ఈ తరహా పెళ్లిళ్లలో జంటలు కలిసి ఉండరు. వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే.. అంటే శని, ఆదివారాల్లో మాత్రమే కలిసి ఉంటారు. ఆ రెండు రోజుల్లోనే కలిసి తిరగడం, మాట్లాడుకోవడం, తమ బంధాన్ని బలపరుచుకోవడం చేస్తారు.
వీకెండ్ మ్యారేజ్‌లో భార్యాభర్తలు ప్రతిరోజూ కలిసి ఉండరు. ఈ పెళ్లిళ్లలో జంటలు తమ కెరీర్‌కు, స్నేహితులకు, వ్యక్తిగత జీవితానికి కూడా సమయాన్ని కేటాయిస్తారు. అయితే కొన్ని జంటలు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ తమతమ జీవితాలు మాత్రం వేర్వేరుగా గడుపుతారు.. అచ్చం పెళ్లైన కొత్తలో సినిమాలో జగపతిబాబు, ప్రియమణిలాగా.. అన్న మాట. ఈ తరహా సంబంధాన్ని "సెపరేట్ లివింగ్ మ్యారేజ్" అని కూడా అంటారు. ఇందులో జంట కేవలం వారాంతాల్లో మాత్రమే కలుసుకుంటుంది.
ప్రస్తుత తరం యువత తమ వ్యక్తిగత జీవితానికి, కెరీర్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. పెళ్లితో పాటు తమ కోసం కూడా సమయం ఉండాలని కోరుకుంటున్నారు. దీని కారణంగా చాలా మంది వీకెండ్ మ్యారేజ్‌ను ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ట్రెండ్ ప్రపంచంలోని అనేక నగరాల్లో నెమ్మదిగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో వీకెండ్ మ్యారేజ్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది.
వీకెండ్ మ్యారేజ్ మొదట జపాన్‌లో ప్రారంభమైంది. అక్కడి ప్రజలు పెళ్లి తర్వాత తమ వ్యక్తిగత స్వేచ్ఛ, సమయం తగ్గిపోతుందని నమ్ముతారు. పెళ్లయ్యాక చాలా మంది తమను తాము మార్చుకుంటారు. అందుకే జపాన్‌లో ఈ వీకెండ్ పెళ్లిళ్ల పద్ధతిని అనుసరించారు. ఇందులో జంటలు కలిసి ఉండగలరు. వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా బాగా చూసుకోగలరు.
జంటల అభిప్రాయం ప్రకారం వీకెండ్ మ్యారేజ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ లభిస్తుంది. అలాగే జంటలు తమ అభిరుచులకు, కెరీర్‌కు, స్నేహితులకు సమయం కేటాయించుకోవచ్చు. అంతేకాకుండా ఈ పెళ్లిళ్ల వల్ల స్పేస్‌తో పాటు వ్యక్తిగత గుర్తింపు కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ పెళ్లిళ్లలో కేవలం వారాంతాల్లో కలిసి గడిపి, తర్వాత మళ్లీ తమతమ పనుల్లో నిమగ్నమవుతారు.
వీకెండ్ మ్యారేజ్ వల్ల లాభాలు ఉన్నట్లే నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని రోజులు మాట్లాడుకోకపోతే లేదా నమ్మకం లేకపోతే బంధం బలహీనపడవచ్చు. అలాగే దూరంగా ఉండటం వల్ల అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా బంధం మెరుగ్గా ఉండాలంటే ఇద్దరి మధ్య నమ్మకం, అవగాహన, కమ్యూనికేషన్ చాలా ముఖ్యం.
