Begin typing your search above and press return to search.

సీఎం ఆఫీసుకు వాటర్ కట్... తన పరిస్థితి అదే అంటున్న డిప్యూటీ సీఎం!

ఇందులో భాగంగా ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మంచినీటి సమస్య పలకరించింది.

By:  Tupaki Desk   |   5 March 2024 10:32 AM GMT
సీఎం ఆఫీసుకు వాటర్  కట్... తన పరిస్థితి అదే అంటున్న డిప్యూటీ సీఎం!
X

ప్రధానంగా కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో వేసవి వచ్చిందంటే చాలు నీటి కష్టాలు మొదలైపోతుంటాయి. ప్రధానంగా బస్తీల్లో నీటి కులాయిల వద్ద క్యూలు భారీగా నెలకొంటాయి. బిందెడు నీటి కోసం యుద్ధాలు జరుగుతుంటాయి.. ట్యాంకర్ కోసం వేలం పాటలు నిర్వహించే పరిస్థితి తలెత్తుతుందని చెబుతారు. అయితే ఇంకా వేసవి పూర్తిస్థాయిలో రాకముందే బెంగళూరులో నీటి కష్టాలు మొదలైపోయాయి. ఇందులో భాగంగా ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మంచినీటి సమస్య పలకరించింది.

అవును... కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయానికి కూడా తాజాగా నీటి సమస్య ఎదురైంది. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. దీంతో... ఈ వేసవి కర్ణాటకలో, ప్రధానంగా బెంగళూరు సిటీలో ఏస్థాయిలో ఉండబోతుందనే చర్చను తెరపైకి తెచ్చింది. అలా అని పూర్తిగా ఈ సమస్య బెంగళూరు సిటీకే అని కాదు.. కర్ణాటక రాష్ట్రం మొత్తంమీద ఈ సమస్య ఉందని అంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా బెంగళూరు కుమారకృత రోడ్డులోని సిద్దరామయ్య కార్యాలయానికి నీటి కష్టాలు వచ్చాయి. దీంతో అధికారులు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు.

వాస్తవానికి వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉండేది కానీ... ఈదఫా వేసవికి ముందే తీవ్ర స్థాయిలో ఈ సమస్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే నీటి సమస్య అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో నీటి వనరులు ఎండిపోతున్నాయని అంటున్నారు. దీంతో... రానున్న రోజుల్లో తాగునీటి సమస్య ఏ స్థాయిలో ఉంటుందనే విషయం తలచుకుని జనాలు భయాందోళనకు గురవుతున్నారని తెలుస్తుంది.

నా ఇంటివద్ద బోరుబావి కూడా ఎండిపోయింది!:

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయంలోని కష్టాలు అలా ఉంటే... తన పరిస్థితి కూడా అలానే ఉందని అంటున్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఇందులో భాగంగా... బెంగళూరులోని తన ఇంటివద్ద ఉన్న బోర్ వెల్ తో సహా 3000కు పైగా బోర్ వెల్ లు ఎండిపోయాయని తెలిపారు. దీంతో... రాష్ట్ర రాజధానిలోని నీటి కష్టాల సమస్యను పరిష్కరించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారని.. ప్రజలకు సరసమైన ధరలే నీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు.

వాస్తవానికి మండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం కేఆరెస్స్ డ్యాం.. బెంగళూరుకు ప్రధాన తాగునీటి వనరుగా పనిచేస్తుంది. అయితే తాజాగా కేఆరెస్స్ డ్యాం లో నీటిమట్టం వేగంగా పడిపోవడంతో వేసవికి ముందే ఈ సమస్య ఏర్పడింది. ఈ సమయంలో ప్రైవేటు వాటర్ ట్యాంక్ ఏజెన్సీల సహకారం కూడా తీసుకుంటామని.. ముందు ముందు నీటికోసం ఎలాంటి ఇబ్బందులూ ఉండవని శివకుమార్ చెబుతున్నారు!