బాబు డ్రీమ్ ప్రాజెక్ట్ కి రేవంత్ మోకాలడ్డు ?
ఏపీ ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉంది. తమ మూడు ప్రాంతాలూ సాగు తాగు నీటితో కలకళలాడాలన్నదే ఆ లక్ష్యం.
By: Tupaki Desk | 5 April 2025 4:00 PM ISTరెండు రాష్ట్రాలు అయిన తరువాత ప్రతీ చిన్న దానికీ వివాదాలే వస్తున్నాయి. ఎవరికీ ఇబ్బంది లేకుండా రెండు రాష్ట్రాలు అన్నదమ్ములుగా అభివృద్ధి చెందాల్సి ఉండగా రాజకీయాలు ఎమోషన్స్ సెంటిమెంట్స్ మధ్యలోకి వస్తున్నాయి. దాంతో అనుకున్న పనులు ఆగి ప్రజలకే నష్టం వస్తుందని అంటున్నారు.
ఏపీ ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉంది. తమ మూడు ప్రాంతాలూ సాగు తాగు నీటితో కలకళలాడాలన్నదే ఆ లక్ష్యం. ఏపీ దిగువన ఉన్న రాష్ట్రం. అటు జీవనదులైన క్రిష్ణా, గోదావరి అన్ని రాష్ట్రాలలో పారుతూ చివరికి చేరేది ఏపీలోనే. అంటే లాస్ట్ డెస్టినేషన్ అన్న మాట. అక్కడ నుంచి సముద్రంలోకి ఈ నీళ్ళు వెళ్ళిపోతాయి వరదలు వస్తే ఆ నీరు కూడా ఎగువ నుండి దిగువకు వదిలేస్తే నష్టం కష్టం ఏపీకే వస్తున్నాయి
ఈ నేపథ్యంలో వరద నీటిని ఒడిసి పట్టి కొత్త ప్రాజెక్టులు కట్టుకోవాలన్నది ఏపీ ప్రభుత్వం ఆలోచన. ఇక చూస్తే కనుక గోదావరి నుండి దాదాపు 2,000 టీఎంసీల అడుగులు నీరు సముద్రంలోకి ప్రవహిస్తోంది. అదంతా ఉప్పు నీటి పాలు అవుతోంది. అలా వృధాగా పోతున్న నీటిని ఎంతో కొంత దారి మళ్ళిస్తే కరవు ప్రాంతాలు కూడా సస్యశ్యామలం అవుతాయి.
అలా గోదావరి మిగులు జలాలను రాయలసీమ ప్రాంతం కరువుతో బాధపడకుండా నివారించేందుకు ఉపయోగించుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఈ విషయాన్ని అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఆయన దీని మీద చర్చించి ఆమోదముద్ర వేశారు.
ఏపీ కరువు నిరోధక రాష్ట్రం అనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి ముఖ్యమంత్రి మెగా పోలవరం - బనకచెర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టును ప్లాన్ చేశారు. దాదాపుగా పదివేల కోట్ల రూపాయల నిధులు ఈ భారీ ప్రాజెక్ట్ కి ఖర్చు అవుతాయి. దాని కోసం ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడానికి అన్ని ఆర్థిక అవకాశాలను అన్వేషిస్తున్నారు. ఈ ప్రాజెక్టు గోదావరి నది నుండి కేవలం 200 టీఎంసీల అడుగులు వరద నీటిని లింక్ కెనాల్ ద్వారా బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్‌కు బదిలీ చేస్తుంది. అలా కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలో నీటి డిమాండ్‌ను తీరుస్తుంది అని ప్రభుత్వం చెబుతోంది.
అంటే సముద్రంలోకి పోతున్న రెండు వేల టీఎంసీలలో ఇది పదవ వంతు అన్న మాట. ఈ నీటిని మళ్ళించి రాయలసీమకు నీరు ఇస్తామని ప్రభుత్వం ఆలోచన చేస్తూంటే దానిని అడ్డుకుంటామని తెలంగాణా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న నీటి ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళతామని తాజాగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టే రాయలసీమ ఎత్తిపోతల, బనకచర్ల ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరితో తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు తాగునీటికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీని కంటే ముందు అక్కడ విపక్ష బీఆర్ఎస్ సెంటిమెంట్ ని ఎగదోసి మరీ కాంగ్రెస్ ని జనం ముందు దోషిగా చూపించాలని చూస్తోంది 2020లో భారీ వరదలు గోదావరికి వచ్చాయి. ఆ సమయంలోనే పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుని పోయింది. అలా వచ్చిన రెండు వేల టీఎంసీల నీరు వృధాగా సాగరంలోకి పోతోంది. మరి ఎవరికీ దక్కకుండా నీరు పోతే ఏమి లాభం అన్న చర్చ ఉంది.
గోదావరి మీద ప్రాజెక్టులు ఎగువ రాష్ట్రాలు కట్టుకుంటున్నాయి. వాటికి సరిపడా నీరు తీసుకున్నాకే దిగువకు గోదావరి వస్తుంది. అలా మిగులు జలాల నుంచి కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటామని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తూంటే ఇందులో తెలంగాణాకు కానీ మరో ఎగువ రాష్ట్రానికి కానీ నష్టం ఏ మేరకు ఉంటుంది అన్న చర్చ చేస్తున్నారు. నిజంగా నష్టం అనుకుంటే రెండు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు కూర్చుని ఒక సామరస్య పూర్వకమైన పరిష్కారానికి రావాలని కోరుతున్నారు. నీరు అన్నది చాలా ప్రధానం జీవనదులు ఉప్పు నీరులో కలసిపోతే అది ఎవరికీ క్షేమమూ కాదు క్షంతవ్యమూ కాదని అంటున్నారు. చూడాలి మరి బాబు డ్రీమ్ ప్రాజెక్టు బనకచర్ల ఏమవుతుందో.
