గొంతెండుతోంది పవన్ సారూ !
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం ప్రజలు వేదన రోదన ఇది.
By: Tupaki Desk | 6 May 2025 12:15 AM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం ప్రజలు వేదన రోదన ఇది. గడ్డు వేసవి వచ్చేసింది. మే నెల మొదటి వారంలో ఉన్న పరిస్థితులు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ జనలకు నడి నెత్తిన భానుడు కనిపిస్తున్నాడు. దాంతో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. అలాగే కుళాయిల్లో నీరు రావడం లేదు.
దాంతో దాహార్తిని తీర్చుకునేందుకు దారి లేక జనాలు గగ్గోలు పెడుతున్నారు. పిఠాపురం దానికి అతీతం కాదు. అక్కడ మహిళలు సాధారణ జనాలు గొంతు ఎండిపోతోంది ఉప ముఖ్యమంత్రి వర్యా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాసిన్ని మంచినీళ్ళు దక్కేలా చూసి పుణ్యం కట్టుకోండి అని వేడుకుంటున్నారు.
ఇక చూస్తే కనుక పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో నీటి ఎద్దడి భారీగా ఉందని అంటున్నారు. ఈ నియోజకవర్గంలోని యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ మండలంలో తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్య అధికంగా ఉంది. దీంతో మహిళలు మంచినీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెబుతున్నారు.
ఎక్కడ చూసిన మంచి నీరు అన్నది సరఫరా కావడం లేదు అని అంటున్నారు. అలాగ వీధి కుళాయిలు విప్పితే కన్నీరే వస్తోంది కానీ నీరు పడడం లేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే పిఠాపురంలో జల్ జీవన్ మిషన్ ని పూర్తిగా అమలు చేశామని అధికారులు చాలా గొప్పగా చెప్పారు. పవన్ ఎమ్మెల్యే అయిన గత పది నెలలలో కేంద్ర ప్రాజెక్ట్ అయిన జల్ జీవన్ మిషన్ మీద దృష్టి పెట్టారు. దాంతో నీటి కొరత వేసవికి లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
కానీ ఇపుడు చూస్తే అవేమీ వర్కౌట్ అయినట్లుగాలేదు. అధికారులు గొప్పగా చెబుతున్న జల్ జీవన్ మిషన్ పధకం అమలు సరిగ్గా లేదని జనాలు ఆరోపిస్తున్నారు. దీంతో తమకు తాగు నీరు లేదని దాహం తీర్చేది ఎవరు అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని తమకు తాగు నీరు దక్కేలా చూడాలి ఈ ప్రాంతం మహిళలు కోరుతున్నారు ప్రత్యేకించి ఉప్పాడ పరిసర ప్రాంతాల మహిళలు అయితే పవన్ మీద కోటి ఆశలు పెట్టుకున్నారు.
మరి ఈ దాహార్తికి పరిష్కారం కనుగొనేందుకు ఉప ముఖ్యమంత్రి తక్షణం యాక్షన్ ప్లాన్ ని రెడీ చేయాలని కోరుతున్నారు. మంచి నీటి ఎద్దడి అన్నది చాలా చోట్ల ఉన్న సమస్యే కానీ ఇది సున్నితమైనది. నీరు తాగేందుకు లేకపోతే జనాలలో వచ్చే ఆగ్రహం వేరే రూపం తీసుకుంటుంది. ఇక పవన్ సొంత నియోజకవర్గంలో ఈ సమస్య అంటే అది కాస్తా స్టేట్ లెవెల్ న్యూస్ అవుతుంది. దాంతో అధికారులను యుద్ధ ప్రాతిపదికన ఫీల్డ్ లోకి దించి ఎక్కడికక్కడ చర్యలకు పవన్ దిగాలని అంటున్నారు.
