Begin typing your search above and press return to search.

తన సంస్థకు యాపిల్ ఎంత ఇచ్చిందో చెప్పిన బఫెట్

తన సంస్థలో యాపిల్ చేసిన కీ రోల్ గురించి బఫెట్ మాట్లాడుతూ.. ‘‘బెర్క్ షైర్ సంస్థకు టిమ్ కుక్ నా కంటే ఎక్కువ చేశారు.

By:  Tupaki Desk   |   5 May 2025 6:30 AM
Warren Buffett Hails Tim Cook Over Steve Jobs In Apple
X

వారెన్ బఫెట్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే దిగ్గజ ఇన్వెస్టర్ గా పేరున్న ఆయన.. ప్రపంచంలోనే తోపు కంపెనీల్లో ఒకటైన యాపిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. యాపిల్ ను ఇంత పెద్ద కంపెనీగా చేయటంలో కీలకమైన ఇద్దరు వ్యక్తుల ప్రస్తావన తీసుకురావటమే కాదు..వారిలో ఎవరు గొప్పా? అన్న విషయాన్ని తనదైన శైలిలో చెప్పేశారు. అంతేకాదు.. తన సంస్థ బెర్క్ షైర్ కు యాపిల్ ఎంత చేసిందో.. తన సంస్థకు తాను కూడా అంత చేయలేదంటూ పొగడ్తల వర్షాన్ని కురిపించారు. తన సంస్థ వార్షిక సమావేశంలో బఫెట్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తన సంస్థలో యాపిల్ చేసిన కీ రోల్ గురించి బఫెట్ మాట్లాడుతూ.. ‘‘బెర్క్ షైర్ సంస్థకు టిమ్ కుక్ నా కంటే ఎక్కువ చేశారు. ఆయన చేసిన దానికి క్రెడిట్ తప్పకుండా ఇవ్వాల్సిందే. స్టీవ్ జాబ్స్ తో నాకు కొంత పరిచయం ఉంది. అతడు చేసినట్లుగా మరెవరూ చేయలేరు. యాపిల్ ను క్రియేట్ చేయటం స్టీవ్ కే సాధ్యమైంది. కానీ.. ఆ సంస్థను టిమ్ వలే పెంచి పెద్దది చేయటం ఎవరికీ సాధ్యం కాదు’ అంటూ వ్యాఖ్యానించారు.

స్టీవ్ జాబ్స్ అనంతరం టిమ్ కుక్ 2011లో యాపిల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. నిజానికి యాపిల్ షేర్ విలువ టిమ్ కుక్ కాలంలోనే భారీగా పెరిగింది. ఇక.. బఫెట్ సంస్థ అయిన బెర్క్ షైర్ కు యాపిల్ సంస్థకు ఉన్న అనుబంధాన్ని చూస్తే.. 2016-19 మధ్య ఈ సంస్థ యాపిల్ లో దాదాపు 35 బిలియన్ డాలర్లు పెట్టగా.. 2023 నాటికి అవి కాస్తా 173 బిలియన్ డాలర్లుగా మారాయి. పెట్టిన పెట్టుబడికి యాపిల్ భారీగా రిటర్న్ ఇచ్చినప్పటికీ 2024లో యాపిల్ కు సంబంధించి తన వద్ద ఉన్న షేర్లలో 67 శాతం అమ్మేశారు. కేవలం 30 కోట్ల షేర్లను మాత్రమే ఉంచుకున్నారు.

ప్రస్తుతం యాపిల్ షేరు విలువ 205 డాలర్లు. బఫెట్ సంస్థ వద్ద ఉన్న యాపిల్ షేర్ల విలువ ఇప్పుడు 62 బిలియన్ డాలర్లుగా చెబుతారు. ఇక.. వారెన్ బఫెట్ విషయానికి వస్తే.. తాజా సమావేశంలో ఆయన కీలక ప్రకటన చేశారు. తాను రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి తాను సంస్థ సీఈవో పదవి నుంచి వైదొలుగుతానని చెప్పటం ద్వారా.. ఈ ఇన్వెస్ట్ మెంట్ గురు తన సుదీర్ఘ వ్యాపార జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టే వేళను ప్రకటించేశారు.