దాచి పెట్టుకోండి లేదంటే గుర్తు పెట్టుకోండి.. బఫెట్ వ్యూహాలు
ప్రపంచ స్టాక్ మార్కెట్ లో తోపు మదుపుదారు ఎవరన్నంతనే.. మరో మాట లేకుండా అందరి నోట వినిపించే మాట వారెన్ బఫెట్.
By: Tupaki Desk | 9 May 2025 1:00 PM ISTప్రపంచ స్టాక్ మార్కెట్ లో తోపు మదుపుదారు ఎవరన్నంతనే.. మరో మాట లేకుండా అందరి నోట వినిపించే మాట వారెన్ బఫెట్. దిగ్గజ మదుపరిగా ఆయనకున్న ట్రాక్ రికార్డు మరెవరికీ లేదనే చెప్పాలి. తాజాగా ఆయనకు చెందిన బెర్క్ షైర్ హాత్ వే సీఈవో పదవి నుంచి రిటైర్ కానున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే విషయంలో ఆయన చెప్పే సూత్రాల్ని పక్కాగా పాటించాలే కానీ కాసుల వర్షం కురుస్తుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఆయన చెప్పే మదుపు పాఠాలు ఎల్లప్పుడూ పాటించాల్సినవే.
మార్కెట్ నుంచి బఫెట్ రిటైర్ అయ్యే వేళలో.. ఆయన చెప్పిన కొన్ని సూత్రాల్ని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అవేమంటే..
- ఒక వ్యాపారాన్ని అర్థం చేసుకున్న తర్వాతే అందులో పెట్టుబడులు పెట్టాలి. వ్యాపారం ఎలా నడుస్తుంది? ఆ సంస్థ ఆదాయ వనరులు ఏమిటో తెలుసుకోవటం చాలా కీలకం. వీలైనంత ఎక్కువ సమాచారం తెలుసుకున్నప్పుడే మంచి నిర్ణయాన్ని తీసుకునే వీలవుతుంది. అదే మీకు లాభాల్ని తెచ్చి పెడుతుంది.
- స్వల్పకాలిక లాభాలకు ఆశ పడటం మంచిది కాదు. దీర్ఘకాలిక వ్రద్ధినే పరిగణలోకి తీసుకోవాలి. మార్కెట్ హెచ్చుతగ్గులకు పట్టించుకోకుండా ఓపికగా ఉండటం నేర్చుకోవాలి. అప్పుడే సంపదను క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కువ ధరల వద్ద షేర్లు కొనటంతో ఎలాంటి ఉపయోగం ఉండదు. వాటి వాస్తవ ధర ఎంతన్నది ఏదో ఒక సందర్భంలో తెలుస్తుంది. ఆయా షేర్లను ఆ సమయంలోనే సొంతం చేసుకోవాలి. ఇది లాభాలకు అవకాశం ఇస్తుంది. అనిశ్చితి పరిస్థితుల్లో ఈ వ్యూహం బాగా పని చేస్తుంది.
- ఆర్థికంగా బలమైన పునాదులు.. స్థిరమైన ఆదాయం.. మంచి నిర్వహణ ఉన్న కంపెనీల మీద ఫోకస్ చేయాలి. ఇలాంటి కంపెనీలు ఎలాంటి సంక్షోభాల్ని అయినా తట్టుకోగలవు. ఒడిదుడుకులు ఏర్పడినా దీర్ఘకాలంలో విజయం సాధిస్తాయి. మార్కెట్ లో హెచ్చుతగ్గులు సహజం. వాటి గురించి ఆందోళన వద్దు.
- స్థిరమైన వ్యూహంతో వ్యవహరించాలి. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. కంపెనీల ప్రాథమిక బలాలపై ఫోకస్ చేయాలి. ఇతరులు భయపడి అమ్మేటప్పుడు మనం కొనాలి. వాటిని సరైన సమయంలో తిరిగి వారికే అమ్మాలి. ఈ వ్యూహం ఎప్పుడు ఆచరణీయమే.
- మనం ఆర్థికంగా విజయం సాధించాలంటే మనపై మనం పెట్టుబడి పెట్టాలి. పత్రికలు.. మంచి పుస్తకాలు చదవటం.. నిపుణుల మాట వినటం.. ఆర్థిక అక్షరాస్యత పెంచుకోవటం చాలా ముఖ్యం.
- ఒక షేరు కొని కనీసం పదేళ్ల పాటు దాన్ని కొనసాగించలేనప్పుడు దాని గురించి 10 నిమిషాలు ఆలోచించటమే వ్రథానే. వైవిధ్యమైన పెట్టుబడులు పెట్టటం ముందు నేర్చుకోండి. ఇది కాలపరీక్షలో నెగ్గిన విషయమన్నది మర్చిపోవద్దు.
- కొందరు అప్పులు తెచ్చి మార్కెట్లో మదుపు చేశామని చెబుతారు. దీంతో బాగా సంపాదించామని చెబుతారు. అవన్నీ నమ్మొద్దు. యువత ఇలాంటి సలహాలకు దూరంగా ఉండాలి. మీ దగ్గర ఉన్న మిగులు డబ్బునే పెట్టుబడిగా పెట్టండి.