దానకర్ణుడు బఫెట్.. ఒకేసారి 50 వేలకోట్లు దానం..మొత్తం 5 లక్షల కోట్లు
డబ్బులు చాలామంది సంపాదిస్తారు.. కొద్దిమందే సంపద సృష్టిస్తారు.. అతికొద్దిమందే డబ్బు ఎలా సంపాదించాలో చెబుతారు.. అత్యంత కొద్దిమందే తాము సంపాదించిన దానం చేస్తుంటారు
By: Tupaki Desk | 29 Jun 2025 9:49 AM ISTడబ్బులు చాలామంది సంపాదిస్తారు.. కొద్దిమందే సంపద సృష్టిస్తారు.. అతికొద్దిమందే డబ్బు ఎలా సంపాదించాలో చెబుతారు.. అత్యంత కొద్దిమందే తాము సంపాదించిన దానం చేస్తుంటారు. ఈ నాలుగు లక్షణాలు ఉన్నవారు ఒకరే ఉంటారు. ఆయనే వారెన్ బఫెట్. ప్రసిద్ధ పెట్టుబడిదారుగానే కాక.. ఆయన అపర దాన కర్ణుడు కూడా. ఎంతోమంది సంపన్నులను ప్రపంచం చూసి ఉంటుంది. కానీ, బఫెట్ మాత్రం వారందరి కంటే స్పెషల్.
తాజాగా బఫెట్ తన చేతికి ఎముల లేదని నిరూపించారు. ఏకంగా రూ.50 వేల కోట్ల విలువైన షేర్లను దానం చేసేశారు.
బెర్క్‌షైర్ హాత్‌వే...! ఇది బఫెట్ సంస్థ. ఇందులోని 6 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఆయన విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం రూపాయిల్లో రూ.50 వేల కోట్లు. ఇది మరో కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్థాపించిన గేట్స్ ఫౌండేషన్, బఫెట్ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు వెళ్తుంది. కాగా, బఫెట్ గతంలో ఎన్నో దానాలు చేసినా.. ఇంత మొత్తం ఒకేసారి ఎప్పుడూ ఇవ్వలేదు.
తాజా దానంతో బఫెట్ తన సంపద నుంచి ఇప్పటివరకు స్వచ్ఛంద సంస్థల నుంచి ఇచ్చిన విరాళం విలువ 60 బిలియన్ డాలర్లు దాటింది. రూపాయిల్లో చెప్పాలంటే రూ.5 లక్షల కోట్లపైనే. జూన్‌లోనే బఫెట్ 5.3 బిలియన్ డాలర్లు, గత ఏడాది నవంబరులో 1.14 బిలియన్ డాలర్లు విరాళం ఇచ్చారు. అంటే 8 నెలల్లోనే వేల కోట్లు ఇచ్చేశారన్నమాట. విరాళాలు పోగా.. బఫెట్ నికర సంపద 152 బిలియన్ డాలర్లు. ప్రపంచంలో ఆరో సంపన్న వ్యక్తి. అయితే, ఇది కూడా 6 బిలియన్ డాలర్ల విరాళం తర్వాత ఒక స్థానం పడిపోవడం గమనార్హం.
బఫెట్ ప్రస్తుత వయసు 94 ఏళ్లు. సంపాదన నుంచి దానాలు చేయడం సరిగ్గా 20 ఏళ్ల కిందట మొదలుపెట్టారు. నిరుడు అనూహ్యంగా వీలునామాను మార్చారు. తన తదనంతర సంపదలో 99.5 శాతం ఓ ట్రస్ట్‌కు వెళ్లేలా చేశారు. బఫెట్ సంతానం సుసీ (71), హోవార్డ్ (70), పీటర్ (67) దీని బాధ్యతలు చూస్తారు. పైగా పదేళ్లలోనే సంపదను పంపిణీ చేసేయాలి. ఈ నిర్ణయాలను ముగ్గురు పిల్లలు కలిసి తీసుకోవాలి. అయితే, బఫెట్ మరణంతోనే గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలు నిలిచిపోతాయి.
సరిగ్గా 60 ఏళ్ల కిందట.. 34 ఏళ్ల యువకుడిగా బఫెట్ అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం ఒమాహా కేంద్రంగా బెర్క్‌షైర్ హాత్‌వే స్థాపించారు. 1.05 ట్రిలియన్ డాలర్ల సంస్థగా తీర్చిదిద్దారు. 200 వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రఖ్యాత సంస్థలు యాపిల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ స్టాక్‌లలో కూడా పెట్టుబడులు పెట్టారు. అతి భారీ విరాళాలు పోగా బఫెట్‌కు బెర్క్‌షైర్ హాత్‌వేలో 13.8 శాతం వాటా ఉంది. ఈ షేర్లను ఎప్పటికీ అమ్మేది లేదని చెప్పారు బఫెట్.
