వరంగల్ కార్పరేషన్‌లో త్రిముఖ పోరు.. రేవంత్ బిగ్ స్ట్రాటజీ..!
తెలంగాణ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు అక్టోబరు-నవంబరు మధ్య కాలంలో ఎన్నికలు జరగనున్నాయి.
By: Tupaki Desk | 28 Sept 2026 10:45 AM ISTతెలంగాణ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు అక్టోబరు-నవంబరు మధ్య కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా కీలకమైన హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్లను అధికార పార్టీ ప్రధానంగా హస్తగతం చేసుకునేందుకు కీలక మార్గాలను.. అనుసరిస్తోంది. నేపథ్యంతో పాటు స్థానిక భూముల వివాదాలు, వలసల అంశాలు ఇక్కడి రాజకీయాలను శాసిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం వరంగల్‌లో విస్తృతంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను, అలాగే వరంగల్ లోక్‌సభ స్థానాన్ని కూడా గెలుచుకున్న విషయం తెలిసిందే.
దీంతో కార్పొరేషన్‌ను కూడా చేజిక్కించుకునేందుకు హస్తం పార్టీనాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే.. పంటికింద రాయి మాదిరిగా.. వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యేలు(నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి) మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో రాబోయే గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో వీరు తమ సత్తా చాటాలని నిర్ణయించుకు న్నారు. కాంగ్రెస్‌లోనే ఉన్నా.. కొండా వర్గం ప్రత్యేక రాజకీయాలకు తెరదీసింది.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. రేవంత్ రెడ్డి ఇమేజ్‌ను బాగా వినియోగించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక, ప్రతిపక్ష బీఆర్ ఎస్‌కు వలసల దెబ్బ భారీగా తగలడంతో ఇది కాంగ్రెస్‌కు అనుకూలంగా మారనుందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ముఖ్య నేతలు (కడియం శ్రీహరి, ఆరూరి రమేష్ వంటి వారు) పార్టీని వీడటంతో బీఆర్ఎస్ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటోంది.
వరంగల్‌లోని 22A భూముల వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. అంతేకాదు.. గత పదేళ్లలో తాము చేసిన అభివృద్ధిని, కాంగ్రెస్ ప్రస్తుత వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంజుకోవాలని చూస్తోంది. అయితే.. దీనికి విరుగుడుగా.. రేవంత్ రెడ్డి కూడా.. నాయకులతో టచ్‌లో ఉంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇక, బీజేపీ కూడా వరంగల్ కేంద్రంగా ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది.
వరంగల్ కేంద్రంగా జాతీయ నాయకత్వం పర్యటనలు, క్యాడర్ రివ్యూలు నిర్వహిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ అగ్రనేతలు గ్రౌండ్ లెవెల్ ప్రచారాన్ని వేగవంతం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల వేడి రాజుకుంటున్న దరమిలా 66 డివిజన్లలో పట్టు సాధించేందుకు ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ రాజకీయ సెగలు పెంచుతున్నాయి. బీజేపీ కూడా తానేమీ తగ్గనట్టే వ్యవహరిస్తోంది. దీంతో వరంగల్ కార్పొరేషన్‌లో త్రిముఖ పోరు తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి.
