Begin typing your search above and press return to search.

బతుకు బంకర్ల పాలు- క్షణక్షణం చావు

యుద్ధం ఎపుడూ శాంతిని ఇవ్వదు. అది భయంకరమైన అశాంతిని బహుమతిగా ఇస్తుంది. అంతే కాదు పక్కలో పాములా శతృవుని ఇస్తుంది.

By:  Satya P   |   2 March 2026 9:03 AM IST
బతుకు బంకర్ల పాలు- క్షణక్షణం చావు
X

యుద్ధం ఎపుడూ శాంతిని ఇవ్వదు. అది భయంకరమైన అశాంతిని బహుమతిగా ఇస్తుంది. అంతే కాదు పక్కలో పాములా శతృవుని ఇస్తుంది. యుద్ధంలో గెలిచినా ఓడినా పగ వదలదు దానికి వడ్డీలు కడుతూనే ఉండాలి. ప్రతీకారం అహంకారం ముందు మమకారం ఓడిపోతూ ఉంటుంది. చివరికి నీడ సైతం కాటేసే పరిస్థితి ఉంటుంది. క్షణక్షణం చస్తూ బతకడం ఒక నరకప్రాయంగా ఉంటుంది. ఎవరు యుద్ధానికి కెలికినా చివరికి జరిగేది ఇదే. అందుకే ఎన్నో సామ్రాజ్యాలను జయించిన అశోకుడు కూడా చివరికి బుద్ధం శరణం గత్యామి అంటూ శాంతి మంత్రం పఠించాడు.

ఇజ్రాయెల్ లో ఇంతేనా :

ఎన్నో యుద్ధాలు ఎపుడూ అశాంతి ఇదీ ఇజ్రాయెల్ పరిస్థితి అని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ జనాలు చూసిన భయానక పరిస్థితులు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా రెండున్నరేళ్ళ నుంచి యుద్ధమే శ్వాసగా పీలుస్తూ ఇజ్రాయెల్ బతుకుతోంది. సతమతం అవుతోంది. మొదట హమాస్ తో గాజా ప్రాంతాంలో యుద్ధం జరిగింది. ఇజ్రాయెల్ భీకర పోరు సాగించింది. అలాగే హిజ్బుల్లా తో లెబనాన్‌లో, యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారులతో ఇజ్రాయెల్ సమరం సాగించింది. అంతే కాదు 2024 జూన్ నెలలో ఏకంగా పదిహేను రోజుల పాటు ఇదే ఇరాన్ తో యుద్ధం జరిగంది. ఇలా యుద్ధంతోనే లేస్తూ పడుతూ ఇజ్రాయెల్ సమాజం తల్లకిందులవుతోంది.

బంకర్లతోనే జీవితం :

యుద్ధం వచ్చిన ప్రతీసారీ ఒక హెచ్చరిక చేసే వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. అంతే అంతా కలసి ఇల్లూ వాకిళ్ళూ అన్నీ వదిలేసి బంకర్లకు చేరుకుంటారు. అలా అక్కడే జీవితాలు గడుస్తాయి. ఆ మీదట అంతా బాగుంది అనుకుంటే బయటకు వచ్చి తమ జీవితాలను ప్రారంభిస్తారు. ఇజ్రాయెల్ ప్రజలకు ఇది అలవాటుగా మారిపోయింది. ఇక శత్రు దేశాలు సంధించే క్షిపణులను కకావికలు చేసే వ్యవస్థ కూడా ఇజ్రాయెల్ కి ఉంది. దాంతో చాలా వరకూ ప్రాణ నష్టం అన్నది లేకపోయినా బతుకు బస్టాండ్ అన్నట్లు బంకర్లతోనే జరిగిపోతోంది అన్న వేడి నిట్టూర్పులు వినిపిస్తున్నాయి.

తాజా యుద్ధంతో ఉలిక్కి :

ఇదిలా ఉంటే గత మూడు రోజులుగా ఇరాన్ తో ఇజ్రాయెల్ అమెరికా కలసి పోరు చేస్తున్నాయి. ఈ దెబ్బతో తాడో పేడో అన్నట్లుగా యుద్ధానికి తెర లేపుతున్నాయి. మరి ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ ఊరుకుంటుందా అందుకే ఆ వైపు నుంచి కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా భారీ ఎదురు దాడులు జరుగుతున్నాయి. దాంతో ఇజ్రాయెల్ కి కూడా భారీ నష్టం సంభవిస్తోంది. చాలా చోట్ల అపార్టుమెంట్లలో నివాసాలు ఉండేవారు బంకర్లు లేక ప్రాణ రక్షణ కోసం పరుగులు తీస్తున్నారు అనేక ప్రాంతాలలో వందలాది మరి ఒకే చోట బంకర్ల కింద బిక్కు బిక్కుమంటున్నారు. చిన్న పిల్లలు వృద్ధులు అలాగే పెంపుడు జంతువులు ఇలా జీవితాలను మోసుకుంటూ బంకర్లే నివాసాలుగా మార్చుకుంటూ ఊపిరి తీస్తున్నారు.

ఎన్నాళ్ళీ యుద్ధం :

ఇదిలా ఉంటే రోజుల తరబడి బంకర్ల కిందనే ఉండాలా అన్న ఆందోళన కూడా చాలా మందిలో ఉందిపుడు. ఎన్నాళ్ళు ఈ యుద్ధం సాగుతుంది అన్నది కూడా చాలా మందిలో కదులుతున్న ప్రశ్న. యుద్ధం వస్తుందని తెలుసు. అంతా ఊహించినదే జరుగుతోంది, కానీ యుద్ధం అన్నది రాకపోతే ఎంత బాగుండుని అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా శాంతిని అంతా కోరుకుంటున్నారు.

యుద్ధానికి సెలవంటూ :

యుద్ధం ఇక వద్దు, యుద్ధం ఇకనైనా ఆగిపోవాలి. ఎందుకంటే అంతా అలసిపోయామని అంటున్నారు. ఒక రోజు రెండు రోజులు కాదు ఏళ్ళ తరబడి ఇలా భయంతో బిక్కుమంటూ బంకర్లలో తలదాచుకోవడం వల్ల కాదు అని అంటున్నారు. పిల్లలు వృద్ధులు మహిళలు అందరికీ ఇది చావు బతుకుల దోబూచులాటగా ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా హై అలెర్ట్ ని ప్రకటించింది. ఆఫీసులు సెలవు, పాఠశాలలు సెలవు, అన్నీ బంద్ ఆ మీదట ఇబ్బందులు ఇదీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఎంత జాగ్రత్తలు తీసుకున్న వందలాది మందికి గాయాలు అయ్యాయి. కొందరు అక్కడా చనిపోయారు. దాంతో ఇజ్రాయెల్ ప్రజానీకం శాంతి శరణం గచ్చామీ అని అంటోంది.