చరిత్రలో రికార్డు క్రియేట్ చేసిన వక్ఫ్ బిల్లుపై చర్చ - లోక్ సభలో 14 గంటలు.. రాజ్యసభలో 17 గంటలు
దేశ వ్యాప్తంగా పెను చర్చకు కారణమైన వక్ఫ్ బిల్లు సవరణకు సంబంధించి చర్చ పార్లమెంట్ లో సుదీర్ఘంగా సాగటం తెలిసిందే.
By: Tupaki Desk | 5 April 2025 1:10 PM ISTదేశ వ్యాప్తంగా పెను చర్చకు కారణమైన వక్ఫ్ బిల్లు సవరణకు సంబంధించి చర్చ పార్లమెంట్ లో సుదీర్ఘంగా సాగటం తెలిసిందే. పార్లమెంట్ ఉభయ సభల్లో సుదీర్ఘంగా ఈ బిల్లుపై చర్చ జరిగింది. అటు లోక్ సభలోనూ.. ఇటు రాజ్యసభలోనూ అర్థరాత్రి దాటే వరకు చర్చ నడిచింది. ఇక్కడో విశేషం చెప్పాలి. ఈ సవరణ బిల్లుపై పెద్దల సభ (రాజ్యసభ)లో తెల్లవారుజామున 4.02 గంటల వరకు చర్చ సాగటం విశేషం.
గతంలో కొన్ని బిల్లులపై సుదీర్ఘ చర్చ జరిగినప్పటికి.. రాజ్యసభ చరిత్రలో అయితే మాత్రం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆసక్తికర రికార్డును క్రియేట్ చేసినట్లుగా చెబుతున్నారు. గతంలో ఒకసారి తప్పించి.. మరే బిల్లుపైనా ఇంత సుదీర్ఘంగా చర్చ జరగలేదని చెబుతున్నారు. మొత్తంగా 17 గంటల పాటు చర్చ సాగింది. రాజ్యసభలో గురువారం ఉదయం 11 గంటలకు మొదలైన చర్చ శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల వరకు చర్చ సాగింది. రాజ్యసభ చరిత్రలో ఇదో అరుదైన అంశంగా పేర్కొన్నారు. 1981లో రాజ్యసభలో ఎసెన్షియల్ సర్వీసెస్ మొయింటెనెన్స్ బిల్లుపైనా ఉదయం 4.43 గంటల పాటు చర్చ జరిగినట్లుగా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై లోక్ సభలో 14 గంటల పాటు చర్చ జరగటం తెలిసిందే. అయితే.. దీనికి మించి మరో బిల్లుపై చర్చ లోక్ సభలో జరిగినట్లుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి. స్టేట్ ఆఫ్ అవర్ డెమోక్రసీపై గతంలో 20.08 గంటల పాటు సాగిన చర్చే ఇప్పటివరకు రికార్డుగా పేర్కొంటున్నారు. ఆ తర్వాత 1993లో రైల్వే బడ్జెట్ పై 18.35 గంటల పాటు చర్చ సాగింది. 1998లో రైల్వే బడ్జెట్ పైన 18.04 గంటల పాటు చర్చ జరిగింది. మైనార్టీల భద్రతకు సంబంధించిన బిల్లుపై 17.25 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో.. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రాజ్యసభలో రెండో సుదీర్ఘ చర్చ జరిగిన బిల్లుగా నిలిస్తే.. లోక్ సభలో టాప్ 5 సుదీర్ఘ చర్చ జరిగిన బిల్లుగా నిలిచింది.
