వక్ఫ్ బిల్లు డిబేట్ : బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి
ఇక వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభ సాక్షిగా స్పష్టం చేశారు.
By: Tupaki Desk | 2 April 2025 10:58 PM ISTలోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లు 2025 ని బీజేపీ ప్రవేశపెట్టింది. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లుని సభ ముందు ఉంచి కీలక ప్రసంగం చేశారు. ఆయన బిల్లుని సమర్ధిస్తూ చాలా వాదనలు వినిపించారు. తనదైన పాయింట్లూ చెప్పారు.
వక్ఫ్ సవరణ బిల్లు మీద అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకున్నామని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి హోదాలో కిరణ్ రిజిజు తెలిపారు. 1954లో తొలిసారి వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు మొత్తం 284 ప్రతినిధులు, 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వక్ఫ్ బోర్డుల ప్రతినిధులు తమ వాదనలు వినిపించారని తెలిపారు. ఈ బిల్లులో కొన్ని సానుకూల మార్పులు చేస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొంటూ విపక్షాలు ఊరకే రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఇక వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభ సాక్షిగా స్పష్టం చేశారు. లోక్ సభలో ఈ బిల్లు మీద జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, వక్ఫ్ బిల్లుకు మెజారిటీ వర్గాల మద్దతు ఉందని అన్నారు. వక్ఫ్ బిల్లు అంశంపై విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని అన్నారు. వక్ఫ్ బిల్లు అతిపెద్ద సంస్కరణగా ఆయన అభివర్ణించారు. అనేక రాష్ట్రాల్లో వక్ఫ్ భూములపై కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. వక్ఫ్ ఆస్తులను ప్రార్థన, ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. అయితే వక్ఫ్ భూములను అక్రమాలకు ఉపయోగిస్తే చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ఇదే తీరున చూస్తే కనుక చర్చ సందర్భంగా రివల్యూషనరీ సోషలిస్టు పార్టీకి చెందిన ఎన్.కె. ప్రేమచందన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తుతూ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లులో కొత్త నిబంధనలను చేర్చే అధికారం ఉందా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుంటూ ప్రతిపక్షాల డిమాండ్ మేరకే బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపామని గుర్తు చేశారు.
కమిటీ తన అభిప్రాయాలను తెలియజేసిందని, వాటిని మంత్రివర్గం సమీక్షించి ఆమోదించిందని చెప్పారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా వక్ఫ్ సవరణ బిల్లు 2025పై మాట్లాడుతూ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి విస్తృత అధికారాలు ఉంటాయని, అది బిల్లును సవరించడమే కాకుండా పునర్నిర్మించగలదని స్పష్టం చేశారు. కాగా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికల ప్రకారం ఎన్డీఏ ఎంపీలు ప్రతిపాదించిన 14 మార్పులను అంగీకరించింది. అయితే విపక్షల తరఫున ఇండియా కూటమి ప్రతిపాదించిన సవరణలకు బిల్లులో చోటు దక్కలేదని ఆయా పార్టీలు మండిపడ్డాయి.
ఇక సమాజ్ వాది పార్టీ అధినేత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అయితే ఈ బిల్లు ద్వారా దేశంలో లౌకిక వాదం దెబ్బతింటుందని అన్నారు. బీజేపీ మత రాజకీయాలకు పరాకాష్ట ఈ బిల్లు అన్నారు. కాంగ్రెస్ ఎంపీలు అయితే ఈ బిల్లు విషయంలో బీజేపీ చెప్పేవన్నీ అవాస్తవాలే అని మండిపడ్డారు.
ఇక ఈ బిల్లు మీద చర్చ సందర్భంగా బీజేపీ మొత్తం ఎన్డీయే పక్షాల కాచుకోవాల్సి వచ్చింది. బిల్లుకు మద్దతు ఇచ్చిన మిత్రపక్షాలు మెత్త మెత్తగానే మాట్లాడి ముగించాయి. అదే ఇండియా కూటమి వైపు నుంచి సభ్యులు అయితే ధాటీగా తమ వాదన వినిపించారు మొదట ఎనిమిది గంటలు మాత్రమే చర్చకు అవకాశం ఇచ్చినా అది కాస్తా మరిన్ని గంటలు పెంచుకుంటూ పోయారు. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలూ బాగా ప్రిపేర్ అయి వచ్చాయి. సభలో అవకాశాన్ని ప్రతీ పార్టీ వాడుకుంది. ఎండీయే కూటమి మీద నిప్పులు చెరిగింది.
బిల్లుకు లోక్ సభలో ఆమోదానికి మెజారిటీ అయితే ఉంది కానీ వాదనల విషయంలో బీజేపీ మైనారిటీ వర్గాలను కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్న పౌర సమాజాన్ని కానీ ఏ మేరకు సంతృప్తి పరచింది. తర్కానికి తగిన జవాబులు ఏ మేరకు ఇచ్చింది అన్నది మాత్రం చర్చనీయాంశంగా ఉంది అనే అంటున్నారు.
