వాల్ మార్ట్ లో సామూహిక కత్తిపోట్లు... అసలేం జరిగింది?
ఈ సందర్భంగా స్పందించిన ప్రత్యక్ష సాక్షులు.. ఇది నిజంగా అత్యంత భయంకరంగా ఉందని.. ఈ దాడిలో నిందితుడు మడతపెట్టే తరహాలో ఉన్న కత్తిని వాడినట్లు కనిపించిందని చెబుతున్నారు.
By: Tupaki Desk | 27 July 2025 4:00 PM ISTఇటీవల కాలంలో సామాన్య ప్రజలపై తుపాకులతో కాల్పులు జరపడాలు, రద్దీగా ఉన్న ప్రాంతంలోకి కారుతో దూసుకుపోవడాలు, కత్తులతో దాడి చేయడాలు వంటి (సైకో) ఘటనలు ఎక్కువగా తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... తాజాగా అమెరికాలోని వాల్ మార్ట్ స్టోర్ లో కత్తిపోట్లు ఘటన తీవ్ర కలకలం రేపింది.
అవును... అమెరికాలో కత్తిపోట్ల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇందులో భాగంగా... మిచిగాన్ ట్రావర్స్ సిటీలోని వాల్ మార్ట్ స్టోర్ లో శనివారం రాత్రి ఓ దుండగుడు కత్తితో బీభత్స సృష్టించాడు. ఈ క్రమంలో కత్తి చేతపట్టి జనాలపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో సుమారు 11 మంది గాయపడగా... బాధితుల్లో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం.. నిందితుడిని అందుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ సందర్భంగా స్పందించిన ప్రత్యక్ష సాక్షులు.. ఇది నిజంగా అత్యంత భయంకరంగా ఉందని.. ఈ దాడిలో నిందితుడు మడతపెట్టే తరహాలో ఉన్న కత్తిని వాడినట్లు కనిపించిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన గవర్నర్ గ్రెట్చెన్ విట్మెర్... ఈ క్రూరమైన హింసతో బాధపడుతున్న బాధితులకు అండగా తాము ఉన్నామని తెలిపారు!
ఇదే క్రమంలో స్పందించిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) డిప్యూటీ డైరెక్టర్ డాన్ బొంగినో ఈ దాడుల ప్రమేయాన్ని ధృవీకరించారు. ఈ సందర్భంగా.. వాల్మార్ట్ లో జరిగిన దాడుల దర్యాప్తులో గ్రాండ్ ట్రావర్స్ కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి అవసరమైన మద్దతును అందించడానికి ఎఫ్.బీ.ఐ. సిబ్బంది ప్రతిస్పందిస్తున్నారని తెలిపారు.
