Begin typing your search above and press return to search.

డిసెంబర్ లో అంతరిక్షంలోకి హ్యుమనాయిడ్ రోబో.. సిద్దం చేసిన ఇస్రో..

భారత అంతరిక్ష చరిత్ర పుస్తకంలో మరో బంగారు పేజీ చేరబోతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2025, డిసెంబర్‌లో గగనయాన్‌ ప్రాజెక్టును చేపట్టబోతోంది.

By:  Tupaki Desk   |   4 Nov 2025 5:28 PM IST
డిసెంబర్ లో అంతరిక్షంలోకి హ్యుమనాయిడ్ రోబో.. సిద్దం చేసిన ఇస్రో..
X

భారత అంతరిక్ష చరిత్ర పుస్తకంలో మరో బంగారు పేజీ చేరబోతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2025, డిసెంబర్‌లో గగనయాన్‌ ప్రాజెక్టును చేపట్టబోతోంది. తొలి అన్‌క్రూడ్‌ మిషన్‌ను ప్రయోగించబోతోంది. ఈ మిషన్‌లో మానవాకార రోబో ‘వ్యోమమిత్ర’ అంతరిక్ష యాత్ర చేయబోతోందని ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ నవంబర్‌, 3న అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన, 4,410 కిలోల బరువుతో దేశ చరిత్రలోనే అతిపెద్ద కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ CMS-03 విజయవంతంగా ప్రయోగం అనంతరం వెలువడింది. దీని ద్వారా భారత్‌ స్పేస్‌ టెక్నాలజీలో మరింత ముందడుగు వేసినట్లు సూచిస్తోంది.

వ్యోమమిత్రతో తొలి గగనయాన్‌ ప్రయాణం

గగన్ యాన్‌ ప్రాజెక్టు అభివృద్ధి పనుల్లో 90 శాతం పూర్తయినట్లు నారాయణన్‌ తెలిపారు. మిషన్‌ కోసం అవసరమైన హార్డ్‌వేర్‌ ఇప్పటికే శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రానికి చేరింది.

డిసెంబర్‌లో జరగబోయే ఈ ప్రయోగం G1 మిషన్‌ గగనయాన్‌ ప్రాజెక్టులోని 3 అన్‌క్రూడ్‌ మిషన్లలో మొదటిది. ఇవి విజయవంతమైతే, 2027 ఆరంభంలో భారతదేశం తన మొదటి మానవ అంతరిక్ష యాత్రను చేపడుతుంది.

ఈ మిషన్‌లో ప్రధాన పాత్ర పోషించబోయే ‘వ్యోమమిత్ర’కు ఆ పేరు ‘వ్యోమ’ (అంతరిక్షం) + ‘మిత్ర’ (స్నేహితుడు) అనే సంస్కృత పదాల కలయికతో పెట్టారు. ఇది మానవ ప్రవర్తనను అనుకరించే సగం మానవాకార రోబో. ఇది స్పేస్‌క్రాఫ్ట్‌లో మానవుల ప్రాణరక్షణ వ్యవస్థలు, శ్వాస నియంత్రణ, ఉష్ణోగ్రత, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ లాంటి అంశాలను పరీక్షిస్తుంది. దీని సాయంతో భవిష్యత్‌ మానవ యాత్రల్లో వ్యోమగాముల భద్రతకు అవసరమైన అన్ని పరికరాలు పరీక్షిస్తారు.

మహత్తర అంతరిక్ష ప్రణాళిక

‘గగనయాన్‌’ ప్రాజెక్టు కేవలం ఒక యాత్ర కాదు అది భారత అంతరిక్ష కలను మానవ రూపంలో నెరవేర్చే ప్రయత్నం. ఇస్రో ప్రణాళిక ప్రకారం.. 2026, మార్చి నాటికి 7 ప్రధాన అంతరిక్ష మిషన్లు పూర్తి చేయనుంది.

ఈ జాబితాలో ఎల్వీఎం3-ఎం6 మిషన్ డిసెంబర్‌ మధ్యలో ప్రయోగం చేపట్టనున్నారు. అదనంగా పీఎస్ఎల్ వీ, జీఎస్ఎల్ వీ మిషన్లు కూడా వరుసగా సిద్ధం అవుతున్నాయి.

ఇక గగన్ యాన్‌ ప్రాజెక్టు దశలవారీగా భారతీయ స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణ దిశగా విస్తరించబోతోంది. ఈ ప్రాజెక్టు మొత్తం బడ్జెట్‌ ₹20,193 కోట్లు (సుమారు $2.4 బిలియన్‌) వరకు పెంచింది. దేశ వ్యాప్తంగా 600కి పైగా భారతీయ పరిశ్రమలు ఇందులో భాగమయ్యాయి. ఇది ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ లక్ష్యానికి కొత్త పుంతలు తొక్కినట్లు చెప్పవచ్చు.

భవిష్యత్‌ మానవ యాత్రలకు పునాది..

వ్యోమమిత్ర పాల్గొనబోయే ఈ G1 మిషన్‌ కీలకంగా ఉండబోతోంది. స్పేస్‌క్రాఫ్ట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ కంట్రోల్‌, అవియానిక్స్‌, భద్రతా ప్రొటోకాల్స్‌, ఎమర్జెన్సీ సిస్టమ్స్‌. ఇవి భవిష్యత్‌లో మానవ వ్యోమగాములను సురక్షితంగా అంతరిక్షంలో ఉంచేందుకు అత్యంత అవసరమైన భాగాలు. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్‌ అమెరికా, రష్యా, చైనా వంటి మానవ అంతరిక్ష అన్వేషణకు స్వతంత్రంగా సిద్ధమైన దేశాల సరసన చేరుతుంది.

అంతరిక్ష స్నేహితుడి కొత్త శకం..

వ్యోమమిత్ర ప్రయాణం ఒక యాంత్రిక ప్రయత్నం కాదు.. అది మన దేశం సాంకేతిక సత్తాకు, మనసు కలలకు ప్రతీక. ఇస్రో ఇప్పటి వరకు రాకెట్‌ లాంచ్‌లతో చూపిన సాంకేతిక ప్రతిభ, ఇప్పుడు మానవ జీవిత రక్షణకు పరీక్ష వేస్తోంది. ప్రధాన మంత్రి మోదీ సూచించినట్లు, ‘భారత్‌ రాకెట్లను మాత్రమే కాదు, మానవ ఆశలను కూడా ఆకాశంలోకి పంపిస్తోంది.’

డిసెంబర్‌ వ్యోమమిత్ర ప్రయాణం భారత అంతరిక్ష చరిత్రలో కొత్త దశను ప్రారంభించబోతోంది. అది కేవలం ఒక రోబో ప్రయాణం కాదు, మన కలల నడకకు మొదటి అడుగు.