ఎమ్మెల్యే ఎంపీలకు మర్యాద ఇవ్వాల్సిందే !
లక్షల మంది ప్రజలకు వారు ప్రజా ప్రతినిధులు. అయితే వారికి మర్యాద విషయంలో ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
By: Tupaki Desk | 13 May 2025 2:30 PMలక్షల మంది ప్రజలకు వారు ప్రజా ప్రతినిధులు. అయితే వారికి మర్యాద విషయంలో ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక మంత్రి వెళ్తే ఎదురు వచ్చే అధికారులు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏదైనా పని మీద కలవాలని అనుకుంటే మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. నిజానికి గ్రౌండ్ లెవెల్ లో ఉండే సమస్యలు చాలా కనిపిస్తాయి.
వాటి కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ ని కలవాల్సి ఉంటుంది. వివిధ శాఖల ఉన్నతాధికారులని కలవాల్సి ఉంటుంది. కానీ అధికారుల అపాయింట్మెంట్ తమకు బహు కష్టంగా మారుతోందని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వాపోతున్నారు. అధికారులు అయితే కనీసం తమను పట్టించుకోవడం లేదని లెక్కలేనన్ని ఫిర్యాదులు వస్తున్నాయి.
నిజానికి ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తున్నారు అంటే అధికారులు వారి చెప్పేది వినాలి. వారు ఇచ్చే గ్రీవెన్సెస్ ని పరిశీలించాలి. అయితే కూటమి ప్రభుత్వంలో అధికారుల వద్దకు వెళ్తే గంటల కొద్దీ అక్కడ ఆఫీసుల వద్ద వేచి ఉండేలా చేస్తున్నారు అని ఎమ్మెల్యేలు అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రజా సమస్యల మీద ఇస్తున్న విన్నపాలను పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు అంతా స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఫిర్యాదు చేశారు. తాము ఇచ్చిన వినతిపత్రాలకు కానీ చేసిన ఫిర్యాదులకు కానీ కనీసం జవాబు కూడా ఇవ్వడం లేదు అందులో పేర్కొన్నారు.
దాంతో ఆయన వెంటనే స్పందించి ఎమ్మెల్యేల ఆవేదన మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కి లేఖ రాశారు. దాంతో స్పందించిన సీఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంతా వీవీఐపీలుగా పేర్కొన్నారు. వారికి ఆ ప్రోటోకాల్ వర్తిస్తుందని కూడా స్పష్టం చేశారు.
వారి విషయంలో కచ్చితంగా 2012లో చేసిన జీవో 348 ద్వారా సాధారణ పరిపాలన శాఖ చేసిన మార్గదర్శకాలను కూడా గుర్తు చేశారు. ఇక మీదట ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు ఇచ్చే మర్యాద కానీ ప్రోటోకాల్ కానీ ఈ విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర స్థాయి అధికారులూ ఇదే విధంగా ప్రోటోకాల్ పాటించాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చే వినతిపత్రాలు కానీ వారు చేసే ఫిర్యాదులు కానీ వాటి విషయంలో వారు కోరిన విధంగా సమాచారం తో పాటు తగిన సమాధానం ఇవ్వాలని కూడా ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లను కానీ ఇతర ఉన్నతాధికారులను కలుస్తామంటే వారికి తగినంత సమయం ఇచ్చి అపాయింట్మెంట్లు ఇవ్వాలని కూడా స్పష్టం చేశారు.
దీంతో కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా ఫుల్ హాపీ ఫీల్ అవుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా అధికారుల వద్దకు వెళ్ళలేకపోతున్నామని ప్రజా సమస్యల గురించి చర్చించలేకపోతున్నామని ఇప్ప్పటికే అనేక మంది అసంతృప్తితో ఉన్నారు. దీంతో అయ్యనపాత్రుడు చొరవ తీసుకున్నారు. సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు ఇక ప్రజా ప్రతినిధులకు వీవీఐపీ హోదాలో ప్రోటోకాల్ అమలు అవుతుందని అంతా అంటున్నారు. సో అంతా ఫుల్ హ్యాపీ అన్న మాట.