పేరు కు ఉక్కు...భద్రత మాత్రం తుక్కు
విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే తీర ప్రాంత ప్లాంట్ గా ఘనత దక్కించుకుంది. అంతే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన స్టీల్ ఉత్పత్తి ఇక్కడ నుంచి జరుగుతుంది.
By: Satya P | 10 Jun 2026 12:19 AM ISTవిశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే తీర ప్రాంత ప్లాంట్ గా ఘనత దక్కించుకుంది. అంతే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన స్టీల్ ఉత్పత్తి ఇక్కడ నుంచి జరుగుతుంది. విశాఖ స్టీల్ ఎగుమతులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఇన్ని ఉండి కూడా అల్లుడి నోట్లో శని ఉన్నట్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఎన్నో సమస్యలు సవాళ్ళు ఉన్నాయి. ఇప్పటికి మూడున్నర దశాబ్దాలుగా ఆపరేషన్స్ స్టార్ట్ చేసి ముందుకు సాగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఈ రోజుకీ సొంత గనులు లేవు. దాంతో లాభాలు ఎన్ని గడిస్తున్నా గనుల కొనుగోలు వల్ల నష్టాలలోకి పోతోంది. సొంత గనులను చూపించకుండా దేశంలో నిర్వహిస్తున్న ఏకైక ప్లాంట్ గా కూడా దీనిని చూడాల్సి ఉందని అంటారు.
ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా :
విశాఖ స్టీల్ ప్లాంట్ ని 1970 ప్రాంతంలో ఎన్నో ఉద్యమాల తరువాత అప్పటి కేంద్ర ప్రభుత్వం విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. శ్రీమతి ఇందిరాగాంధీ పార్లమెంట్ లో దీని మీద ప్రకటన చేశారు. అది జరిగిన తరువాత పాకిస్తాన్ తో భారత్ యుద్ధం, ఆ తరువాత దేశంలో ఎమర్జెన్సీ వంటి పరిస్థితులతో ఇందిరాగాంధీ రెండవ టెర్మ్ పూర్తి అయింది. మధ్యలో 1977 నుంచి 1980ల దాకా జనతా ప్రభుత్వం వచ్చింది. అయితే 1980లో మూడవసారి ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్ కి మాట ఇచ్చిన ప్రకారం శంకుస్థాపన చేశారు. అలా రష్యా సాంకేతిక సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ లో నిర్మాణం మొదలైన ఈ ప్లాంట్ 1991కి ఆపరేషన్స్ ని స్టార్ట్ చేసింది. 1992లో విశాఖలో పర్యటించిన అప్పటి ప్రధాని పీవీ నర సింహారావు స్టీల్ ప్లాంట్ లో ఆపరేషన్స్ ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అయితే అయితే సొంత గనులు ఎక్కడ నుంచి వస్తాయి ఎలా కేటాయించాలి అన్నది ఆనాడు ఎవరూ చూడలేదు.
అస్థిర ప్రభుత్వాలతో :
ఇక పీవీ కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్ళ పాటు నడిపారు. ఆ తరువాత 1996 నుంచి 1999 దాకా సంకీర్ణ ప్రభుత్వాలు వరస ఎన్నికలు జరిగి అస్థిరత్వం రాజ్యమేలింది. 1999లో వాజ్ పేయ్ 23 పార్టీలతో కూడగట్టి ఎన్డీయే ప్రభుత్వాని ఏర్పాటు చేశారు. వాజ్ పేయ్ ఏలుబడిలోనే తొలిసారి తీవ్ర నష్టాలతో స్టీల్ ప్లాంట్ మునిగింది. ఆ సమయంలో స్టీల్ ప్లాంట్ ని వాజ్ పేయి ప్రభుత్వం ఆర్ధిక భారం నుంచి ఆదుకుంది. కానీ అసలైన రోగానికి మందు వేయలేకపోయింది. అదే సొంత గనులు కేటాయించడం. ఆ తరువాత వచ్చి పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కూడా సొంత గనులను కేటాయించలేదు. 2014 నుంచి నేటి వరకూ గత పన్నెండేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా సొంత గనుల విషయంలో ఏమీ చేయలేదు అన్న విమర్శలను కార్మిక సంఘాల నేతలు చేస్తారు.
ప్రైవేటీకరణ దిశగా :
గతంలో పెద్దగా వినిపించని ప్రైవేటీకరణ చర్చలు మాటలు గత పుష్కర కాలంగా ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి. దానికి మరో కారణం స్టీల్ ప్లాంట్ లో పూర్తి స్థాయిలో పెట్టుబడులు ఉప సంహరించుకోవాలని కేంద్రం ఆలోచిస్తోంది అన్నది కూడా ప్రచారంలో ఉండడం. అంతే తప్ప నష్టాలు సొంత గనులు లేని కారణంగా వస్తున్నాయని గుర్తించడం లేదని కార్మిక వర్గాల ఆవేదనగా ఉంది. మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ విషయంలో వివక్ష అయితే కొనసాగుతోందని కార్మిక లోకం ఆరోపిస్తుంది.
భద్రతా లోపాలు :
దానికి తోడు అన్నట్లుగా స్టీల్ ప్లాంట్ లో ఆర్ధిక భరాన్ని తగ్గించుకునేందుకు పర్మనెంట్ సిబ్బందిని తగ్గిస్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ సిబ్బందిని వేలాదిగా ఇంటి బాట పట్టించారు. ఇక నిపుణుల కొరత అయితే అధికంగా ఉంది. స్టీల్ ప్లాంట్ లో అత్యంత కీలకమైన విభాగంగా హాట్ మెటల్ వింగ్ ఉంటుంది. ఇక్కడ వందల వేల అత్యధిక ఉష్ణోగ్రతల మధ్యన ఉక్కుని కరిగిస్తారు. సేఫ్టీ ఆడిట్ తో పాటు సేఫ్టీ ప్రోటోకాల్ ఇక్కడ అత్యవసరం. అందువల్ల నిపుణులు అయిన వారు పర్మనెంట్ సిబ్బంది కూడా ఉండాలి. కానీ ఇంటర్నల్ గా బదిలీలు చేస్తున్నారు. తక్కువ స్టాఫ్ తో ఎక్కువ ఉత్పత్తి అన్న విధానం తెచ్చారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. దాంతో ఉండాల్సిన నిపుణులు లేకనే పెను ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికుల భద్రత గాలిలో దీపంగా మారుతోందని అంటున్నారు.
ఈ ప్రమాదం ఏమి చెబుతోంది :
ఇదిఉలా ఉండగా తాజాగా చూస్తే హాట్ మెటల్ కాస్టింగ్ విభాగంలో ఒక భారీ ప్రమాదం జరిగింది. సుమారు 1,500 డిగ్రీల సెల్సియస్ నుండి 1,600 డిగ్రీల సెల్సియస్ వరకు అత్యధిక ఉష్ణోగ్రత గల కరిగిన ఉక్కును తీసుకువెళ్తున్న ఒక లాడర్ సరిగ్గా పనిచేయక పేలిపోయింది. స్టీల్ మెల్టింగ్ షాప్ ఒకటి, అలాగే రెండు కంటిన్యూయస్ కాస్టింగ్ డిపార్ట్‌మెంట్ విభాగాలలో సాధారణ కాస్టింగ్ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఈ భారీ పేలుడు సంభవించింది. దానికి కారణం సరైన భద్రతా ప్రమాణాలు లేవని అంటున్నారు. వీటి విషయంలో పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. కార్మికుల సంఖ్యను తగ్గించడం ఆరు వేల మంది కాంట్రాక్టు కార్మికులను ఇంటికి పంపడం మరో 1600 మంది శాశ్వత సిబ్బందిని వీఆర్ఎస్ పేరుతో తొలగించారు అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
శాశ్వతమైన చర్యలను చేపడితేనే :
భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేవని చాలా సార్లు కార్మిక సంఘాలు పాలకులకు చెబుతున్నా పట్టించుకోలేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ రోజుకీ హాట్ మెటల్ కాస్టింగ్ విభాగంలో పనిచేయడం ఒక సవాల్ గా మారిన నేపధ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చెప్పాలీ అంటే భద్రత అన్నది గాలిలో దీపంగానే ఉంది అని అంటున్నారు. ప్రమాదం జరిగింది అని పరిహారంతో కాకుండా శాశ్వతమైన చర్యలను చేపడితేనే స్టీల్ ప్లాంట్ లో మళ్ళీ ఎలాంటి దుర్ఘటనలు జరగవని అంటున్నారు.
