Begin typing your search above and press return to search.

రాజ్యసభకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ?

జస్టిస్ సుదర్శన్ రెడ్డి గుర్తున్నారా. రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి ఆయన గురించి తెలుస్తుంది.

By:  Satya P   |   18 Feb 2026 11:24 PM IST
రాజ్యసభకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ?
X

జస్టిస్ సుదర్శన్ రెడ్డి గుర్తున్నారా. రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి ఆయన గురించి తెలుస్తుంది. గత ఏడాదిలో జరిగిన దేశ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున ఆయన అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్డీయే కూటమి నుంచి సీపీ రాధాకృష్ణన్ కి ఆయనను ప్రత్యర్థిగా ఇండియా కూటమి అన్ని పార్టీలు నిలబెట్టాయి. ఆయన తన వాదనా పటిమతో కొన్ని డిబేట్లలో అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే నంబర్ గేమ్ లో ఆయన ఓటమి చెందారు. ఇక ఆయన పేరు ఇపుడు రాజ్యసభ రేసులో గట్టిగా వినిపిస్తోంది.

రాజ్యాంగ కోవిదుడుగా :

జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ కోవిదుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఉమ్మడి ఏపీలో హైకోర్టు న్యాయ మూర్తిగా సేవలు అందించారు. అలాగే గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. ఇక ఆయన వంటి మేధావి రాజ్యసభలో ఉంటే కాంగ్రెస్ కి ఇండియా కూటమికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ హై కమాండ్ ఆయనను రాజ్యసభకు పంపించాలని భావిస్తోంది అని అంటున్నారు.

రెండు సీట్లలో అలా :

తెలంగాణా రాష్ట్రంలో రాజ్యసభ కోటాలో రెండు సీట్లు ఏప్రిల్ 9న ఖాళీ అవుతున్నాయి. అందులో ఒక దానిని సుదర్శన్ రెడ్డికి ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇక రెండవ సీటుని ఇప్పటికే తెలంగాణా కోటాలో రాజ్యసభలో మెంబర్ గా ఉంటూ పదవీ విరమణ చేస్తున్న సీనియర్ నేత అయిన అభిషేక్ సింఘ్వీకి ఇస్తారని అంటున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఈ విషయాన్ని తెలియచేస్తుంది అని అంటున్నారు.

రాజ్యసభ మెంబర్ గా :

ఇక సుదర్శన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన రాజ్యసభ చైర్మన్ పదవి కోసమే పోటీ పడ్డారు. ఉపరాష్ట్రపతి అంటే రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తారు. అయితే ఆయనకు ఇపుడు రాజ్యసభ ఎంపీ పదవి దక్కితే కీలక సభ్యుడిగా ఉంటారు. కాంగ్రెస్ తరఫున ఇండియా కూటమి తరఫున ఆయన తన వాణిని వినిపిస్తారు.

పోటీ అధికమే :

అయితే తెలంగాణా నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతూంటే వాటి కోసం దాదాపుగా అరడజను మంది దాకా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మాజీ ఎంపీ వి హనుమంతరావు, అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కె కేశవరావు, కాంగ్రెస్ లో సీనియర్ నేత జీవన్ రెడ్డి వంటి వారు ఉన్నారు వీరు కాకుండా మరింత మంది కూడా ఈ పోస్టు కోసం ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు. అయితే ఎవరు ఉన్నా ఎంత మంది రేసులోకి దూసుకుని వచ్చినా కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయమే ఫైనల్ కాబట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి దాదాపుగా రాజ్యసభకు వెళ్లడం ఖాయమైనట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం ఏ మేరకు వాస్తవ రూపం దాలుస్తుందో.