Begin typing your search above and press return to search.

ఢమల్ ధమాకా : ఆ 14 గ్రామాలకు రెండు రాష్ట్రాలలో ఓట్లు!

రెండు భాషలు. రెండు ఓటు హక్కులు. గత నాలుగు దశాబ్దాలుగా ఈ గ్రామాల వివాదం కొనసాగుతూనే ఉన్నది.

By:  Tupaki Desk   |   20 April 2024 1:45 AM GMT
ఢమల్ ధమాకా : ఆ 14 గ్రామాలకు రెండు రాష్ట్రాలలో ఓట్లు!
X

తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులలో ఉన్న 14 గ్రామాల ప్రజలు సరిహద్దు వివాదంతో ప్రతిసారి ఎన్నికల్లో రెండు చోట్ల ఓట్లను వినియోగించుకుంటున్నారు. ఈ పార్లమెంటు ఎన్నికలలోనూ వారు అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణలో ఒక్కొక్కరు రెండు ఓట్లు వినియోగించుకోనున్నారు. 3357 మంది ఓటర్లు ఈ 14 గ్రామాల పరిధిలో ఉన్నారు.

ఇటీవల తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న వీరు ఈ రోజు జరిగిన లోక్ సభ తొలివిడత పోలింగ్ లో మహారాష్ట్రలోని చంద్రపూర్ పార్లమెంట్ పరిధిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరిగి వచ్చే నెల 13న తెలంగాణ పరిధిలోని ఆదిలాబాద్ లోక్ సభ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని కొమురంభీం జిల్లా కెరమెరి మండలం, మహారాష్ట్రలోని చంద్రా పూర్ జిల్లా జివితి తాలుకా పరిధిలో ఉన్న కెరమెరి మండలంలోని పరందోలి, కోట, శంకర్కులొద్ది, ముకధం గూడ, లెండి గూడ, ఈసాపూర్, మహర్జా గూడ, అనంతపూర్, భోలాపూర్, గౌరీ, లేందీజలా, లక్మాపూర్, జంకపూర్, పద్మావతి గ్రామాలది రెండు రాష్ట్రాలు.

రెండు భాషలు. రెండు ఓటు హక్కులు. గత నాలుగు దశాబ్దాలుగా ఈ గ్రామాల వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఇక్కడ 3357 మంది ఓటర్లు ఉండగా అందులో 1,763, మహిళలు 1,594 మంది పురుషులు. వీరంతా తెలంగాణలో ఎస్టీ లంబాడాలుగా, మహారాష్ట్రలో వెనకబడిన కులాల్లో సంచార తెగగా గుర్తింపు పొందారు.

1983లో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ 14 గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తారని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయించారు. 1991లో మహారాష్ట్ర రాజురా ఎమ్మెల్యే వామనరావు చాటప్ ఈ గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లో కలపడాన్ని శాసనసభలో లేవనెత్తాడు.

ఆ తర్వాత 1996లో బీజేపీ, శివసేన ప్రభుత్వం కేబినెట్ ఉత్తర్వులు రద్దు చేసింది. దీనిపై అప్పట్లో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లినా ఆ వివాదం ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. రెండు చోట్లా ఓటు హక్కు అన్న సంబరం తప్ప ఓట్లయ్యాక ఎవరూ మా సమస్యలు పట్టించుకోవడం లేదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.