Begin typing your search above and press return to search.

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గుండెపోటు... అధికారుల రియాక్షన్ ఇదే!

ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించి రకరకాల వదంతులు వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 Oct 2023 11:13 AM GMT
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గుండెపోటు... అధికారుల రియాక్షన్ ఇదే!
X

ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించి రకరకాల వదంతులు వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తాజాగా ఆయన కార్డియాక్ అరెస్ట్‌ కు గురయ్యారనే వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. గుండె పోటు రావడంతో పుతిన్ మంచం మీది నుంచి కింద పడిపోయారని.. తాజాగా వార్తలు సంచలనంగా మారుతున్నాయి.

అవును... ఉక్రెయిన్‌ మీద యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి పుతిన్‌ ఆరోగ్యం మీద రకరకాల పుకార్లు వస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆయన పార్కిన్సన్‌ బారినపడ్డారని, అందుకే బహిరంగ ప్రదేశాల్లో వణుకుతా కనిపిస్తున్నారని కథనాలు వచ్చాయి. ఇదే సమయంలో... పుతిన్‌ కు క్యాన్సర్‌ వ్యాది ఉందని.. అయితే ఈ వ్యాదికి రహస్యంగా చికిత్స తీసుకుంటున్నారని మరో ప్రచారం కూడా జరగింది. ఈ నేపథ్యంలో... తాజాగా గుండెపోటు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

పైగా... పుతిన్‌ కొద్ది రోజుల పాటు అజ్ఞాతంగా ఉండటం, ఎవరినీ కలుసుకోకపోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చిందని అంటున్నారు. ఈ సమయంలో రష్యా అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు గుండెపోటు వచ్చిందన్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఇదే సమయంలో సోమవారం సాయంత్రం బ్రెజిల్ అధ్యక్షుడితో పుతిన్ ఫోన్‌ లో సంభాషించినట్టు తెలిపారు.

ఇదే సమయంలో 71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్.. అక్టోబర్ 23న రోజంతా అధికారిక విధులను కొనసాగించారని, అదేవిధంగా... రష్యాలోని ఓ ప్రాంతానికి చెందిన గవర్నర్‌ ను కూడా ఆయన కలిశారని రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి. ఫైనల్ గా... ఈ పుతిన్ ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని.. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని.. ఎలాంటి ఆందోళనా అవసరం లేదని స్పష్టం చేశారు.

అయితే రష్యాలో రిపోర్టింగ్ చేస్తున్న ఒక ఛానెల్ ముందుగా పుతిన్ గుండెపోటు గురించి తప్పుడు వార్తలను ఇచ్చిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. అక్టోబర్ 22 ఆదివారం రాత్రి పుతిన్‌ కు గుండెపోటు వచ్చిందని ఆ ఛానల్ తొలుత ప్రకటించిందంట. ఇంక అక్కడ నుంచి అదిగో తోక అంటే.. ఇదిగో పులి అన్నట్లుగా ఆ వార్త దావాణంలా వ్యాపించిందని చెబుతున్నారు.

ఇదే సమయంలో పుతిన్ కి గుండెపోటు రావడం వల్ల మంచం మీద నుండి పడిపోయారని.. అలా పడిపోయే క్రమంలో టేబుల్ ముఖానికి తగిలిందని.. దీంతో ముక్కుకు గాయం అయ్యి తీవ్ర రక్తస్రావం అయ్యిందని వార్తలు వచ్చేశాయి. దీంతో అది గమనించిన భద్రతా సిబ్బంది.. వైద్యుడికి సమాచారం అందించినట్టు కథనాలు వెలువడ్డాయి! దీంతో... అధికారులు స్పందించి... అది తప్పుడు సమాచారం అన్ని స్పష్టం చేశారు. ఇలాంటి సమాచారాన్ని షేర్ చేయొద్దన్ని సీరియస్ అయ్యారు!