Begin typing your search above and press return to search.

పుతిన్ రెండోసారి భారత్ కు...ట్రంప్ కి షాకేనా ?

రష్యా అధ్యక్షుడు పుతిన్ కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో రెండోసారి భారత్ పర్యటనకు సిద్ధపడడం అంతర్జాతీయంగా సంచలనంగా మారుతోంది.

By:  Satya P   |   19 May 2026 11:04 PM IST
పుతిన్ రెండోసారి భారత్ కు...ట్రంప్ కి షాకేనా ?
X

రష్యా అధ్యక్షుడు పుతిన్ కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో రెండోసారి భారత్ పర్యటనకు సిద్ధపడడం అంతర్జాతీయంగా సంచలనంగా మారుతోంది. గత ఏడాది డిసెంబర్ లో పుతిన్ భారత పర్యటన చేశారు. ఈ సందర్భంగా ప్రపంచం మొత్తం భారత్ వైపే చూసింది. అంతర్జాతీయ పరిణామాలు నాటి కంటే నేడు మరింత సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో పుతిన్ మరోసారి భారత్ టూర్ పెట్టుకున్నారు. సెప్టెంబర్ నెలలో పుతిన్ భారత్ పర్యటనకు వస్తున్నట్లుగా దక్షిణాఫ్రియాలోని రష్యా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

బ్రిక్స్ సదస్సు కోసం :

పుతిన్ భారత్ అధ్యక్షతన సెప్టెంబర్ 12, 13 తేదీలలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వస్తున్నట్లుగా చెబుతున్నారు. ఢిల్లీలో జరిగే ఈ సదస్సుకు పుతిన్ స్వయంగా హాజరవుతారని రష్యా రాయబార కార్యాలయం చేసిన ప్రకటన అంతర్జాతీయంగా ఇపుడు సంచలనంగా మారింది. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఆర్ధిక వాణిజ్య సహకరా సంబంధాల మీద చర్చలు ఒప్పందాలు ఈ సదస్సు ద్వారా జరగనున్నాయి. బ్రిక్స్ సదస్సుకు రష్యా అధ్యక్షుడు హాజరు అవుతారు అన్న వార్తలతో ఈ సదస్సు ప్రాధాన్యత ఇపుడు మరింతగా పెరిగిపోయింది అని అంటున్నారు.

ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో :

మరో వైపు చూస్తే ట్రంప్ ఆంక్షల నేపధ్యంలో పుతిన్ భారత్ పట్ల తన సఖ్యతను చాటుకుంటూ రెండోసారి రావడం అంటే అంతర్జాతీయంగా కూడా ఇది కీలకమైన డిబేట్ కి దారి తీస్తుందని అంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ కలిసి మొదలెట్టిన యుద్ధం రావణ కాష్టంగా అలాగే ఉంది. మరో వైపు ట్రంప్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవద్దు అని గతంలో ఆంక్షలు పెట్టారని ప్రచారం సాగింది. ఇపుడు గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో వెసులుబాటు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అయినప్పటికీ భారత్ తన దేశీయ అవసరాల కోసం ఎవరి నుంచి అయినా చమురుని దిగుమతి చేసుకుంటుందని ఇప్పటికే భారత్ ప్రకటించింది. ఇవన్నీ పక్కన పెడితే గల్ఫ్ యుద్ధం తరువాత ట్రంప్ ఎత్తులు అన్నీ చిత్తు అవుతున్నాయి. మరో వైపు ట్రంప్ చైనాకు వెళ్ళి వచ్చారు.

అంతర్జాతీయ సమాజం మొత్తం :

ఇరాన్ మీద మరోసారి యుద్ధం తప్పదని అంటున్నారు. అయితే ఇరాన్ కి బాహాటంగాన రష్యా మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలో భారత్ కి పుతిన్ రావడం అంటే భారత్ తన చిరకాల నేస్తం అని గట్టిగా ప్రపంచానికి చాటడం కోసమే అని అంటున్నారు. ప్రస్తుత ప్రపంచంలో చూస్తే ఆర్ధిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోతున్న నేపథ్యం ఉంది. దాంతో భారత్ లో పుతిన్ పర్యటన కూడా అత్యంత ఆసక్తిని పెంచుతోంది. ట్రంప్ భారత్ తో మైత్రిని ఏ విధంగా చూస్తున్నారు అన్నది కూడా చర్చకు వస్తోంది. అదే సమయంలో రష్యా మాత్రం ఎప్పటికీ స్థిరంగా భారత్ వైపే ఉంటూ వస్తోంది. ఈ భారీ తేడా రెండు దేశాల మధ్య ఉండడం కూడా ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఇక గతసారి పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్ తో కీలకమైన ఒప్పందాలు కుదిరాయి. ఈసారి మరిన్ని ఒపందాలు రక్షణ పరంగా కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక పుతిన్ భారత పర్యటన అంటే అంతర్జాతీయ సమాజం మొత్తం చెవులు రిక్కించి కళ్ళు పెద్దవి చేసి ఇటు వైపు చూస్తుంది అన్నది తెలిసిందే ఈసారి ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.