విజయనగరంపై పట్టెంత రాజా ..!
విజయనగరం జిల్లా అంటే... టీడీపీ వర్సెస్ వైసీపీ. అంతేకాదు.. పూసపాటి అశోక్‌గజపతిరాజు టీడీపీని.. బొత్స సత్యనారాయణ వర్గం వైసీపీని శాసిస్తాయనే పేరుంది.
By: Tupaki Desk | 21 April 2025 4:50 AMవిజయనగరం జిల్లా అంటే... టీడీపీ వర్సెస్ వైసీపీ. అంతేకాదు.. పూసపాటి అశోక్‌గజపతిరాజు టీడీపీని.. బొత్స సత్యనారాయణ వర్గం వైసీపీని శాసిస్తాయనే పేరుంది. గతంలో బొత్స కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుం చి కూడా.. పూసపాటి వర్సెస్ బొత్స రాజకీయాలు జోరుగానే సాగాయి. బొత్స వైసీపీలోకి చేరిన తర్వాత.. ఆయన హవా కారణంగా పార్టీ దెబ్బతింటోందని భావించిన జగన్.. అక్కడనుంచి ఆయనను తప్పించే ప్రయత్నం చేశారు. కానీ.. టీడీపీ విషయానికి వస్తే.. పూసపాటి వర్గం రాజకీయాలే కనిపించాయి.
గత ఎన్నికలలో అకోశ్ జగపతిరాజు.. తన కుమార్తె అదితి గజపతిరాజును గెలిపించుకున్నారు. ఆ తర్వాత .. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ.. ఎంత రాజకీయాలకు దూరంగా ఉన్నా.. కూడా ఇప్పటికీ.. పూసపాటి వర్గానికే పైచేయిగా ఉంది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేకం గా గ్రూపు రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. పైగా ఆయన కూడా.. రాజాగారి కనుసన్నల్లోనే నడుస్తున్నారు. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని రాజా చెప్పినా.. ఆయన హవా మాత్రం జిల్లాలో ఏ మాత్రం తగ్గలేదు.
అంతేకాదు.. టీడీపీలో రాజాగారి మాటే ఇప్పటికీ చెల్లుబాటు అవుతోంది. ఆయనను వ్యతిరేకించిన వారు.. ఆయనతో విభేదాలు పెట్టుకుని సొంతగా కార్యాలయాలు తెరిచిన మహిళా నాయకులు కూడా.. ఇప్పుడు లేకుండా పోయారు. పైగా.. ఇప్పటికీ.. రాజా మాటే చెల్లుబాటు అవుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం విజయనగరంలో టీడీపీ నాయకులే ఎక్కువగా ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ.. అశోక్ గజపతిరాజు ప్రోత్సాహంతోరాజకీయాల్లోకి వచ్చిన వారే కావడం గమనార్హం.
దీంతో ప్రత్యక్షంగా తాను రాజకీయాల్లోలేనని చెబుతున్నా.. ఏ చిన్న పనికావాలన్నా.. ప్రతి ఒక్కరూ రాజానే సంప్రదిస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అంతేకాదు.. ఆయన ఆశీస్సులతోనే తాను గెలిచానని చాలా మంది నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. సో.. రాజ వైభవం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇదేసమయంలో ఆయనను వ్యతిరేకించిన ఒకప్పటి నాయకులు కూడా ఇప్పుడు.. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు పాకులాడుతుండడం గమనార్హం. దీంతో విజయనగరం రాజకీయాల్లో రాజానే హైలెట్‌గా నిలుస్తున్నారు.