మోడీతో కలసి పవన్ యోగాలో పాల్గొంటారా ?
విశాఖలో అంతర్జాతీయ యోగా డే కి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
By: Tupaki Desk | 17 Jun 2025 5:00 AM ISTవిశాఖలో అంతర్జాతీయ యోగా డే కి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ఒకసారి యోగా మీద సమీక్ష నిర్వహించారు ఇపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ఒక అధికారిక పర్యటన పెట్టుకుని మరీ విశాఖలో సమీక్ష చేశారు.
ఆయన నాలుగు గోడల మధ్య సమీక్ష చేయలేదు. యోగా డే జరిగే విశాఖ బీచ్ ప్రాంతంలో అధికారులతో వచ్చి మరీ అక్కడ పరిస్థితులను వాతావరణాన్ని ఇతర ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారు. ఒక వేళ 21న వానలు పడితే చేయాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి కూడా చర్చించారు.
ఇక చూస్తే గడచిన నెల రోజులుగా ఏపీలో యోగాంధ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రెండు కోట్ల మంది దాకా యోగా డే వేళ పాల్గొనేలా అన్ని రకాల చర్యలను తీసుకుంటోంది. ఇదిలా ఉంటే యోగా విషయంలో కూటమిలోని బీజేపీ టీడీపీ ఇంతలా ఉత్సాహం చూపిస్తూంటే పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నారని ప్రచారం సాగుతోంది.
ఆయన యోగా డే గురించి పెద్దగా మాట్లాడింది లేదు అని అంటున్నారు. ఆయన ఎందుకో ఇటీవల కాలంలో చాలా లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక వైపు తన సినిమాల బిజీలో ఉండడం వల్లనే ఈ విధంగా జరుగుతోంది అని అంటున్నా ఆయనలో ఏమైనా అసంతృప్తి ఉందా అన్న చర్చ కూడా మరో వైపు సాగుతోంది.
ఇవన్నీ ఇలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీతో ఈ నెల 21న విశాఖలో యోగా డేలో పాల్గొంటున్నారు. ఆయన ప్రత్యేకంగా ఒక గంట పాటు యోగాభ్యాసములు బీచ్ రోడ్డులో ఉన్న తనకు ప్రత్యేకంగా కేటాయించిన వేదిక మీద వేస్తారని అంటున్నారు. ఇక మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉంటారు. ఆయన కూడా యోగాసనాలు వేస్తారు. మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అని అంటున్నారు.
మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో మోడీ పాల్గొనే కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారా లేదా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికి ఆరు నెలల క్రితం ఈ ఏడాది జనవరి 8న విశాఖలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోడీ చంద్రబాబు పవన్ నారా లోకేష్ కలసి పాల్గొన్నారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ మధ్యలో విశాఖ వచ్చినా ఏజెన్సీ పర్యటనకే పరిమితం అయ్యారు.
ఇపుడు విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగా డే జరుగుతోంది. మరి ఇంతటి కార్యక్రమంలో పవన్ పాల్గొంటున్నారా లేదా అన్న చర్చ వస్తోంది. పవన్ పాల్గొంటే ఆ కార్యక్రమానికి ఫుల్ గ్లామర్ వస్తుందని అంటున్నారు. మరి మోడీ తో పాటు యోగాసనాలు వేసే వారిలో పవన్ తప్పకుండా ఉంటారు అని అంటున్నారు. చూడాలి మరి పవన్ విశాఖ టూర్ ఎపుడో అన్నది.
