Begin typing your search above and press return to search.

ఒళ్లు మండిన భర్త.. పోలీసులతో కలిసి ఏం చేశాడంటే..

విశాఖలో ఓ పేకాట క్లబ్బు గుట్టు రట్టు అయింది. అత్యంత రహస్యంగా పేకాడుతున్న వారిని పోలీసులు చాలా ఈజీగా పట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   7 Aug 2025 3:21 PM IST
ఒళ్లు మండిన భర్త.. పోలీసులతో కలిసి ఏం చేశాడంటే..
X

విశాఖలో ఓ పేకాట క్లబ్బు గుట్టు రట్టు అయింది. అత్యంత రహస్యంగా పేకాడుతున్న వారిని పోలీసులు చాలా ఈజీగా పట్టుకున్నారు. చాలాకాలంగా తాము గుట్టుగా జూదం ఆడుతుంటే పోలీసులకు ఇప్పుడెలా తెలిసిందని సదరు జూదగాళ్లు.. సారీ.. సారీ జూద మహిళలు నివ్వెరపోయారు. అయితే తమలో ఒకరి భర్త ఒళ్లు మండి ఈ పనిచేశాడని తెలిసి షాక్ తిన్నారు. ఇప్పటివరకు జూదం, పేకాడుతూ పురుషులు పట్టుబడిన ఉదంతాలే ఎక్కువ. కానీ, ఏపీలో అదీ విశాఖలో మహిళల కోసం మహిళలు నడుపుతున్న పేకాట క్లబ్బుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

విశాఖపట్నం నాలుగో పట్టణ పోలీసులు ఓ పేకాట శిబిరంపై దాడి చేసి ఆరుగురు మహిళలను అరెస్టు చేయడం కలకలం రేపింది. నగరంలోని లలితా నగర్ ప్రాంతంలో మహిళలు పేకాడుతున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు మెరుపుదాడి చేశారు. పేకాడుతున్న ఆరుగురు మహిళలను అరెస్టు చేసి వారి నుంచి రూ.22 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు.

అయితే ఈ ఘటనలో ఓ ఆసక్తికర విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. జూదానికి బానిసలు అయిన మహిళలు ఎప్పటి నుంచో పేకాడుతూ ఎంజాయ్ చేస్తుండగా, ఇప్పుడు పట్టుబడటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే జూదానికి బానిస లక్షల డబ్బు వృథా చేస్తోందని ఆగ్రహంతో ఓ మహిళ భర్త స్వయంగా పోలీసులకు సమాచారమిచ్చి పట్టించారని తెలుసుకుని అంతా అతడిని అభినందిస్తున్నారు. జూదం వల్ల తమ కాపురంలో చిచ్చు రేగుతోందని, ఎన్నిసార్లు చెప్పినా తన భార్య తీరులో మార్పు రాకపోవడంతోనే తాను పోలీసులకు సమాచారమిచ్చాడని చెబుతున్నారు. ఇక పురుషులు పేకాడితే మహిళలు పట్టించడం ఇన్నాళ్లు చూశాం.. ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని ఈ ఘటనను ఉదహరిస్తున్నారు.