Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కుకు లక్కు...అమరావతి రాజధానిని చెక్కుతారట!

ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో విశాఖ ఉక్కు పరిశ్రమకి మేలు జరిగింది అనే చెప్పాలి. అప్పటిదాకా ప్రైవేట్ పరం చేస్తారు అన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది.

By:  Tupaki Desk   |   5 July 2025 9:23 AM IST
విశాఖ ఉక్కుకు లక్కు...అమరావతి రాజధానిని చెక్కుతారట!
X

ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో విశాఖ ఉక్కు పరిశ్రమకి మేలు జరిగింది అనే చెప్పాలి. అప్పటిదాకా ప్రైవేట్ పరం చేస్తారు అన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఒకానొక దశలో ప్రైవేట్ అయిపోతుంది అన్న భయాలు కూడా చాలా మందిలో కలిగాయి. లక్షల కోట్ల విలువైన విశాఖ స్టీల్ ప్లాంట్ ని కార్పోరేట్ శక్తులకు కారు చౌకగా అప్పగిస్తారు అన్నది కూడా భారీ ఎత్తున ప్రచారం సాగింది.

అయితే దాదాపుగా నలభై మంది అమరుల త్యాగం పుణ్య ఫలమో అలాగే ఎంతో మంది పోరాటాల బలంలో తెలియదు కానీ విశాఖ ఉక్కు నిలబడింది. ఈ లోగా కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఒక ఎత్తు అయితే కేంద్రంలో బీజేపీకి ప్రభుత్వం స్థాపించేందుకు అవసరం అయిన మెజారిటీ రాకపోవడంతో ఏపీలో కూటమి పార్టీలకు కొత్త బలం వచ్చింది.

దాంతో విశాఖ ఉక్కు బలిపీఠం నుంచి పక్కకు తప్పుకునేలా ఇది దోహదపడింది. ఏకంగా 11 వేల కోట్ల రూపాయలను విశాఖ ఉక్కుకు ఆర్ధిక ప్యాకేజి కింద కేంద్రం కేటాయించింది. దాంతో విశాఖ ఉక్కు ఊపిరి పీల్చుకుంది. ఈ మధ్యనే విశాఖ ఉక్కులో మూడవ బ్లాక్ ఫర్నేస్ ని ప్రారంభించారు. దాంతో ఉత్పత్తి సామర్థ్యం కూడా పెద్ద ఎత్తున పెరుగుతోంది.

ఇపుడు మరో భారీ ఆర్డర్ విశాఖ ఉక్కుకి దక్కబోతోంది అని అంటున్నారు. విశాఖ ఉక్కుని అమరావతి రాజధాని నిర్మాణానికి ఉపయోగించుకోవాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే అయిన పల్లా శ్రీనివాసరావు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఉక్కు యాజమాన్యంతోనూ ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని ఆయన సూచించారు.

అమరావతి రాజధాని పనులను మొత్తం చూస్తున్న పురపాలక శాఖ మంత్రి నారాయణను కలసిన పల్లా ఈ మేరకు వినతి చేశారు. అంతర్జాతీయంగా నాణ్యతా ప్రమాణాలతో కూడిన విశాఖ ఉక్కుని అమరావతి నిర్మాణానికి ఉపయోగించుకుంటే అన్ని విధాలుగా బాగుంటుందని పల్లా ప్రతిపాదించారు. దాని వల్ల ఇటు ఉక్కు కర్మాగారం ఉత్పత్తులకు న్యాయం జరుగుతుందని అలాగే అమరావతి కూడా అద్భుతంగా వస్తుందని అంటున్నారు.

దీనికి సానుకూలంగా స్పందన వచ్చినట్లుగా చెబుతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం లక్షల టన్నుల స్టీల్ అవసరం పడుతుంది. కొన్నాళ్ళ పాటు అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది. దాంతో విశాఖ ఉక్కుకి ఆర్డర్లు వేరే చోట నుంచి రావడం కంటే ఏపీ నుంచే రావడం వల్ల అన్ని విధాలుగా మేలు జరుగుతుందని అంటున్నారు. గాజువాక ఎమ్మెల్యేగా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా సరైన సమయంలో సముచితమైన ప్రతిపాదన చేశారు అని ఉక్కు కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.