Begin typing your search above and press return to search.

వైజాగ్ పై చేతులెత్తేసిన వైసీపీ.. విదేశీ క్యాంప్ నుంచే జంపింగులు

యుద్ధానికి ముందే వైసీపీ అస్త్ర సన్యాసం చేసింది. రాష్ట్రంలోని అతిపెద్దైన మున్సిపల్ కార్పొరేషన్ పై పట్టుకోల్పోయింది.

By:  Tupaki Desk   |   18 April 2025 11:52 AM IST
వైజాగ్ పై చేతులెత్తేసిన వైసీపీ.. విదేశీ క్యాంప్ నుంచే జంపింగులు
X

యుద్ధానికి ముందే వైసీపీ అస్త్ర సన్యాసం చేసింది. రాష్ట్రంలోని అతిపెద్దైన మున్సిపల్ కార్పొరేషన్ పై పట్టుకోల్పోయింది. అవిశ్వాసంపై చర్చ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి గైర్హాజరు కావాలని నిర్ణయించింది. దీంతో వైసీపీ మేయర్ హరి వెంకట కుమారికి పదవీ గండం పొంచివున్నట్లేనని చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో విశాఖ కార్పొరేషనులో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న వైసీపీ విశాఖ కార్పొరేషన్ పై జెండా ఎగరేసింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెజార్టీ కార్పొరేటర్లు పార్టీని వీడటంతో మేయర్ హరి వెంకట కుమారి అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్నారు.

విశాఖ కార్పొరేషన్ లో మొత్తం 98 మంది డివిజన్లు ఉండగా, వైసీపీ 58, టీడీపీ 30కి మంది కార్పొరేటర్లు ఉండేవారు. దీంతో వైసీపీకి చెందిన హరివెంకట కుమారిని మేయర్ గా ఎన్నుకున్నారు. అయితే ఎన్నికలు జరిగి నాలుగేళ్లు అయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి టీడీపీ కూటమిలో చేరిపోయారు. ఇలా వైసీపీకి చెందిన దాదాపు 28 మంది పార్టీ మారిపోవడంతో టీడీపీ కూటమికి మెజార్టీ వచ్చింది. దీంతో మేయర్ పై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు. దీంతో 19వ తేదీ శనివారం అవిశ్వాసంపై చర్చకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కౌన్సిల్ ను ఆదేశించారు.

అయితే రాష్ట్రంలో పెద్ద కార్పొరేషన్ ను వదులుకోకూడదనే ఉద్దేశంతో వైసీపీ నేతలు చివరి వరకు విశ్వప్రయత్నాలు చేశారు. పార్టీ విప్ జారీ చేసి కార్పొరేటర్లను కట్టడి చేయాలని భావించారు. అయితే విప్ అస్త్రం కూడా తుస్ మనడంతో వైసీపీ చేతులెత్తేయాల్సివచ్చింది. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చీఫ్ విప్ లక్ష్మీ ప్రియాంకతో నోటీసు జారీ చేస్తే, ఆ తర్వాత ఆమె కూడా పార్టీకి రాజీనామా చేయడంతో వైసీపీ డీలా పడిపోయిందని అంటున్నారు. విశాఖలో సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ పర్యవేక్షణలో కార్పొరేటర్లను డీల్ చేసినా, ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో వైసీపీ ఆలోచనలో పడిపోయింది. ప్రత్యేక సమావేశానికి కోరం లేకుండా చేయాలనే వ్యూహాన్ని ఎంచుకుంది. అయితే ప్రస్తుతం కూటమికి 58 మంది కార్పొరేటర్లు మద్దతు ఉండటం, అదనంగా మరో 11 మంది కో ఆప్షన్ సభ్యుల బలం తోడవడంతో కోరం అస్త్రం కూడా పనిచేయకపోవచ్చని అంటున్నారు. దీంతో ముందుగానే యుద్ధం నుంచి తప్పుకోవాలని వైసీపీ డిసైడ్ అయింది. దీంతో విశాఖ నగరంపై పసుపు జెండా ఎగిరే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు.