Begin typing your search above and press return to search.

విశాఖలో మెట్రో కూత!

విశాఖను ముంబైతో ధీటుగా తయారు చేస్తామని ఈ మధ్యనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

By:  Tupaki Desk   |   10 Jun 2025 9:15 AM IST
విశాఖలో మెట్రో కూత!
X

విశాఖను ముంబైతో ధీటుగా తయారు చేస్తామని ఈ మధ్యనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆర్ధికంగా ఉత్తరాంధ్రా గోదావరి జిల్లాలను కలుపుతూ విశాఖ కేంద్రంగా అతి పెద్ద గ్రోత్ ఇంజన్ గా చేస్తామని నీతి అయోగ్ మీటింగులో ముఖ్యమంత్రి ప్రకటించారు.

దానికి అనుగుణంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు విశాఖ చుట్టూ ఇపుడు చేపడుతున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వచ్చే ఏడాదికి మొదటి దశలో మొదలవుతుంది. దాంతో విశాఖ టూ భోగాపురం దాకా టూరిజం స్పాట్ రాబోతోంది.

ఈ క్రమంలో విశాఖ జనాభా ఈ రోజున పాతిక లక్షలు ఉంది. అది మరో పదేళ్ళలో రెట్టింపు అవుతుంది. పైగా ప్రతీ ఏటా జనాభా పెరిగి ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. దాంతో విశాఖకు కూడా మెట్రో రైలు అవసరం అని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దాంతో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తోంది.

ఈ క్రమంలో అతి తొందరలోనే విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. అక్టోబర్ నాటికి మెట్రో రైలు ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్వ రంగం సిద్ధం అవుతోంది.

ఇక విశాఖలో తాజాగా ఆసియన్ డెవలప్మెంట్ అధికారులు మెట్రో రైలు ప్రాజెక్ట్ అధికారులు పర్యటించి విశాఖలో ఏర్పాటు చేయబోయే ప్రాజెక్ట్ గురించి స్థల పరిశీలన చేశారు. మెట్రో స్టేషన్స్ కారిడార్లు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దాని మీద కూడా వారు పరిశీన చేశారు.

విశాఖలో గాజువాక నుంచి కొమ్మాది దాకా ఏకంగా 42 స్టేషన్లు మూడు కారిడార్లతో మెట్రో రైల్వే ప్రాజెక్ట్ ఏర్పాటు కాబోతోంది. దీనికి సంబంధించిన డీపీఆర్ ని సిద్ధం చేశారు. మొత్తం విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును 46.22 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు.

మొదటి దశలో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావడానికి 1100 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అని అంచనా వేశారు. ఇక విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ ని డబుల్ డెక్కర్ విధానంలో రూపొందిస్తారు. విశాఖ టూరిజం సిటీ కాబట్టి ఈ విధానం వల్ల మరింతగా ప్రయోజనంతో పాటు ఈ ప్రాజెక్ట్ కి పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.

అదే విధంగా గాజువాక కూర్మన్నపాలెం నుంచి కొమ్మాది దాకా 34 కిలోమీటర్లతో ఒక కారిడార్, అలాగే గురుద్వారా నుంచి పాత పోస్తాఫీసు దాకా 6 కిలోమీటర్లతో రెండవ కారిడార్, తాటిచెట్లపాలెం చిన వాల్తేరు లో మూడవ కారిడార్ ని 6 కిలోమీటర్ల నిర్మించనున్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగగా విశాఖలో మెట్రో కూత వినిపించేలా చేయనున్నారు.