సముద్ర ప్రయాణం: కాకినాడ టు వైజాగ్ భీమిలి 45నిమిషాల్లోనే.. రూ.200 టికెట్!
ఈ ప్రాజెక్ట్ కేవలం రవాణాకే కాకుండా పర్యాటక రంగానికి కూడా ఊతమిస్తుంది. విశాఖపట్నం నుండి భీమిలి వరకు ఉన్న అందమైన సముద్ర తీరం వెంబడి ఈ గ్లైడర్లలో ప్రయాణించడం పర్యాటకులకు సరికొత్త అనుభూతినిస్తుంది.
By: Sivaji Kontham | 24 March 2026 10:26 AM ISTఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడానికి ఇది ఆలంబనగా నిలవబోతోందా? అంటే అవుననే అంచనా వేస్తున్నారు. ఐఐటి మద్రాస్ స్టార్టప్ రూపొందించిన `సీగ్లైడర్` సాంకేతికత అందుబాటులోకి వస్తే.. కాకినాడ నుండి వైజాగ్ లేదా భీమిలికి ప్రయాణం అత్యంత వేగంగా.. అతి తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. కోల్‌కతా నుండి చెన్నై వరకు సుమారు 1668 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రూ.600లతో.. 3 గంటల్లో చేరుకోగలిగే ఈ టెక్నాలజీ ఏపీ తీరప్రాంతానికి సరికొత్త రూపును ఎందుకు ఇవ్వదు అనేదే అందరి ఆలోచన.
ఈ సీగ్లైడర్లు విమానాల మాదిరిగా కాకుండా.. సముద్ర ఉపరితలానికి కేవలం 4 మీటర్ల ఎత్తులో `వింగ్-ఇన్-గ్రౌండ్` (డబ్ల్యూఐజీ) ఎఫెక్ట్‌తో ప్రయాణిస్తాయి. దీనివల్ల గాలి రాపిడి తగ్గి ఇంధన వినియోగం భారీగా తగ్గుతుంది. కాకినాడ నుండి భీమిలి వరకు ఉన్న సుమారు 200 కిలోమీటర్ల లోపు దూరాన్ని ఈ వాహనంలో ప్రయాణిస్తే.. టికెట్ ధర రూ.200 కంటే తక్కువగానే ఇవ్వొచ్చని కూడా చర్చ సాగుతోంది. ఇది సామాన్య ప్రయాణికులకు ఒక వరం లా మారే వీలుంది.
ఈ ప్రాజెక్ట్ కేవలం రవాణాకే కాకుండా పర్యాటక రంగానికి కూడా ఊతమిస్తుంది. విశాఖపట్నం నుండి భీమిలి వరకు ఉన్న అందమైన సముద్ర తీరం వెంబడి ఈ గ్లైడర్లలో ప్రయాణించడం పర్యాటకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పోర్టులను కలుపుతూ.. వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు అనుసంధానంగా ఈ తీరప్రాంత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తే..రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది.
పర్యావరణ హితం ఈ టెక్నాలజీ మరో ముఖ్య ఉద్దేశ్యం. ఇవి పూర్తిగా విద్యుత్తుతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు కావడం వల్ల కాలుష్యం ఉండదు. వీటికి విమానాశ్రయాల మాదిరిగా రన్‌వేలు అవసరం లేదు.. సముద్రపు నీటినే రన్‌వేగా వాడుకోవచ్చు. దీనివల్ల నిర్మాణ వ్యయం .. మౌలిక సదుపాయాల ఖర్చు కూడా మిగిలిన రవాణా మార్గాల కంటే చాలా తక్కువగా ఉంటుంది.
ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్న ఈ సాంకేతికత విజయవంతమైతే... ఏపీ తీర ప్రాంత ప్రజల ప్రయాణం అమాంతం మారడానికి అవకాశం ఉంటుంది. ఆ మేరకు ప్రభుత్వాలు స్థానిక వుడా శాఖలతో కలిసి ప్రణాళికల్ని రచించవచ్చు. తక్కువ సమయంలో.. తక్కువ ఖర్చుతో.. సురక్షితంగా ప్రయాణించే వీలుంటే ఎవరైనా దీనిని కాదని అంటారా? ఐఐటి మద్రాస్ స్టార్టప్ చేస్తున్న ఈ ప్రయత్నం భవిష్యత్తులో దేశీయ రవాణా రంగాన్నే మార్చివేసేందుకు ఛాన్సుంటుంది. ఆనంద్ మహీంద్రా వంటి పారిశ్రామికవేత్తలు సైతం ఈ సరికొత్త మోడల్‌ను ప్రశంసించడం దీని ప్రాముఖ్యతను చాటుతోంది.
