Begin typing your search above and press return to search.

బీజేపీకి వివేక్ రాజీనామా... కాంగ్రెస్ నుంచి రెండు టిక్కెట్ల ఆఫర్?

ఈ నేపథ్యంలో... రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు మరికొంతమంది నేతలు వివేక్ తో సమావేశమయ్యారు! ఈ సమయంలోనే కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు.

By:  Tupaki Desk   |   1 Nov 2023 8:17 AM GMT
బీజేపీకి వివేక్  రాజీనామా... కాంగ్రెస్  నుంచి రెండు టిక్కెట్ల ఆఫర్?
X

ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసంతృప్త నేతలు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ విషయంలో అధికార బీఆరెస్స్ తో పోలిస్తే.. కాంగ్రెస్ పార్టీయే ఈ అసంతృప్తులను ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు ఉందని అంటున్నారు! ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ బీజేపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు! దీంతో తెలంగాణలో బీజేపీకి మరో గట్టి దెబ్బ తగిలిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇటీవల మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్‌ లో చేరగా.. తాజాగా కమలం పార్టీకి మరో షాక్ ఇస్తూ ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎంపీ వివేక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా.. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. త్వరలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారని అంటున్నారు.

ఇలా బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వివేక్ సైతం బీజేపీకి బై బై చెప్పడంతో రాజకీయంగా కీలక చర్చ నడుస్తుంది. ఇలా వరుసగా బీజేపీ నేతలు కాంగ్రెస్ బాట పడుతుండటంతో హస్తిన కమలం పెద్దలు తీవ్రంగా ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈ ప్రభావం తెలంగాణ వరకూ మాత్రమే పరిమితం అయితే పర్లేదు కానీ... దేశ వ్యాప్తంగా జరిగితే కర్నాటక ఫలితాలే అనే ఆందోళనలో ఉన్నారని తెలుస్తుంది!

వాస్తవానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన సమయంలోనే వివేక్ పేరు బలంగా వినిపించింది. రాజగోపాల్ రెడ్డితోపాటు వివేక్ కూడా బీజేపీకి బైబై చెబుతారని కథనాలొచ్చాయి. అయితే ఆ సమయంలో స్పందించిన వివేక్... ఆ కథనాలను ఖండించారు. తాను బీజేపీ నుంచి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో... రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు మరికొంతమంది నేతలు వివేక్ తో సమావేశమయ్యారు! ఈ సమయంలోనే కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు. దీని పైన తన అనుచరులతో చర్చించిన తరువాత వివేక్ తాజాగా బీజేపీకి రాజీనామా చేశారని తెలుస్తుంది. త్వరలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరుతున్నారు!

కాంగ్రెస్ రెండు టిక్కెట్ల ఆఫర్ ?:

ఈ సమయంలో వివేక్ కు కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు ఆఫర్ చేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఇందులో భాగంగా... చెన్నూరు ఎమ్మెలే సీటుతో పాటు పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ కూడా వివేక్ కుటుంబానికి దక్కిందని చెబుతున్నారు. దీంతో... చెన్నూరు నుంచి వివేక్ కుమారుడు ఎమ్మెల్యేగా... పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వివేక్ ఎంపీగా పోటీచేసే అవకాశాలున్నాయనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తుంది.

మరోపక్క చెన్నూరు సీటు పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించాలని భావించారని అంటున్నారు. మరి వివేక్ రీ ఎంట్రీతో చెన్నూరు విషయంలో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీకి దెబ్బ మీద దెబ్బ పడుతుందనే కామెంట్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.