Begin typing your search above and press return to search.

నయా ట్రంప్.. ‘ఎఫ్ బీఐ’ను మూసేస్తాడట

అందరూ నడిచే దారికి కొందరికి అస్సలు నచ్చదు. దశాబ్దాల తరబడి సాగే వ్యవస్థల్ని చాప చుట్టేసి సముద్రంలో పడేయాలన్న ఆత్రుత కొందరికి ఉంటుంది

By:  Tupaki Desk   |   15 Sep 2023 3:54 AM GMT
నయా ట్రంప్.. ‘ఎఫ్ బీఐ’ను మూసేస్తాడట
X

అందరూ నడిచే దారికి కొందరికి అస్సలు నచ్చదు. దశాబ్దాల తరబడి సాగే వ్యవస్థల్ని చాప చుట్టేసి సముద్రంలో పడేయాలన్న ఆత్రుత కొందరికి ఉంటుంది. అలాంటి వారి మాటలకు ఊగిపోతూ.. ఇన్నాళ్లకు తాము కోరుకునే వ్యక్తి బయటకు వచ్చారన్న భావన కొంతమందికి ఉంటుంది. ఇదే తీరు కొన్నేళ్ల క్రితం అమెరికా అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అందుకునేలా చేసింది. నోరు తెరిస్తే వివాదాస్పద వ్యాఖ్యలు.. విచిత్రమైన మాటలు.. అలివి కాని హామీలు.. మొత్తంగా రెచ్చగొట్టటమే ధ్యేయమన్నట్లుగా ట్రంప్ శైలి ఉండేది.

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టి.. ఇష్టారాజ్యంగా మాట్లాడిన ట్రంప్ ఘన చరిత్ర గురించి తెలిసిందే. ఎన్నికల్లో ఓడిన విషయంపైన ఆయన పేచీ ఎంతవరకు వెళ్లిందో తెలిసిందే. 'అతి'ని అతికించుకొని మరీ చెలరేగిపోయే రిపబ్లిక్లన్ల నేత ట్రంప్ నకు ఏ మాత్రం తీసిపోని మరో నేతగా మారుతున్నారు భారత మూలాలు ఉన్న వివేక్ రామస్వామి. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులోకి వచ్చిన ఆయన.. ట్రంప్ నకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆయన వ్యాఖ్యలు.. విధానాలు ఉండటం గమనార్హం.

తాజాగా ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైన పక్షంలో తాను చేయబోయే మార్పుల మీద కుండబద్ధలు కొట్టేశారు. తాను అమెరికా అధ్యక్షుడ్ని అయితే.. ప్రభుత్వంలోని మూడు వంతుల ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తానని పేర్కొన్నారు. తొలి ఏడాది పూర్తి అయ్యే లోపు తాను చెప్పిన వారిలో సగం మందిని ఇంటికి పంపించేస్తానని చెప్పి సంచలనంగా మారారు.

''అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నా పని మొదలు పెడతా. దేశ వ్యాప్తంగా విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందిలో 75 శాతం మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తా. ఇన్ని లక్షల మంది సిబ్బంది అమెరికా ప్రభుత్వానికి పెను భారం. తొలి ఏడాది పూర్తి అయ్యేలోపు 75 శాతం ఉద్యోగుల్లో యాభై శాతాన్ని ఇంటికి పంపుతా. మిగిలిన సగం మందిలో 30 శాతం ఉద్యోగుల్ని వచ్చే ఐదేళ్లలో పదవీ విరమణ చేయిస్తా. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. పిచ్చి పని అస్సలే కాదు'' అని తేల్చేశారు. ప్రస్తుతం అమెరికాలో 22.5 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అందులో 75 శాతం మంది అంటే దాదాపు 16 లక్షల మందిని ఇంటికి పంపించనున్నట్లుగా చెప్పి సంచలనంగా మారారు.

ప్రభుత్వ ఉద్యోగులపై కత్తి దూసిన వివేక్ రామస్వామి.. అమెరికాకు కీలక విభాగమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ)ను మూసేస్తానని చెప్పారు. అంతేకాదు.. విద్య.. పొగాకు.. ఆయుధాలు.. పేలుడు పదార్థాలు.. అణు నియంత్రణ కమిషన్.. అంతర్గత ఆదాయ సేవలు.. వాణిజ్య శాఖల ప్రక్షాళన కోసం ప్రయత్నిస్తానని చెబుతున్న వివేక్ మాటలు విన్నతనే ట్రంప్ కు ఏ మాత్రం తీసిపోని నేతగా అనిపించక మానదు. రానున్నరోజుల్లో మరెన్ని సంచలనాలకు వివేక్ కేరాఫ్ అడ్రస్ గా మారతారో చూడాలి.