Begin typing your search above and press return to search.

వివేకా దారుణ హ‌త్య కేసులో ఏ5కు బెయిల్ ఇవ్వొచ్చు: సుప్రీంకోర్టు ఆదేశాలు

By:  Tupaki Desk   |   4 Aug 2023 7:34 PM GMT
వివేకా దారుణ హ‌త్య కేసులో ఏ5కు బెయిల్ ఇవ్వొచ్చు:  సుప్రీంకోర్టు ఆదేశాలు
X

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివ‌శంక‌ర‌రెడ్డికి బెయిల్ ఇవ్వొచ్చ‌ని సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది. శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేసుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవ‌ని తెలిపింది. తాజాగా సుప్రీం కోర్టులో జ‌రిగిన విచార‌ణ‌లో.. ఈ ఆదేశాలు జారీ చేసింది. ట్రయిల్ కోర్టులో బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది.

సెప్టెంబర్ వరకు విచారణ ప్రారంభం కాకపోతే బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేసుకోవాల‌ని శివ‌శంక‌ర్ రెడ్డి త‌ర‌ఫున న్యాయ‌వాదికి సూచించింది. గతంలో జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు.. బెయిల్ పిటిష‌న్‌కు ఎలాంటి అడ్డంకులు సృష్టించ‌వ‌ని తెలిపింది. బెయిల్ కోసం జస్టిస్ షా ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు అడ్డురావని ధర్మాసనం తెలిపింది. భాగస్వామ్య పక్షాల అందరి వాదనలు విని మెరిట్స్ ఆధారంగా బెయిల్‌పై నిర్ణయం తీసుకోవచ్చని ట్రయిల్ కోర్టుకు సుప్రీం సూచించింది.

మ‌రోవైపు, ఈ కేసులో ఏ-8గా ఉన్న‌ కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ కోర్టు మ‌రోసారి సమన్లు జారీచేసింది. ఈ నెల 14న త‌ప్ప‌కుండా కోర్టుకు హాజరుకావాలని పేర్కొంది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్ వేసింది. కాగా.. వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాశ్ రెడ్డిని సీబీఐ చేర్చిన విషయం తెలిసిందే.