మంత్రిగా గడ్డం వివేక్.. ఎన్ని విశేషాలంటే?
వివేక్ గురించి.. ఆయనకు లభించిన మంత్రి పదవి గురించి చెప్పటానికి ముందు ఆయన తండ్రి కాకా గురించి ప్రస్తావించాల్సిందే.
By: Tupaki Desk | 9 Jun 2025 10:24 AM ISTచివరకు ఉత్కంట. ఎట్టకేలకు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు.. తనదైన చతురతతో తాజా మంత్రివర్గ విస్తరణ సందర్భంగా చోటు దక్కించుకోవటంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి విజయం సాధించారు. దీంతో.. వారి కుటుంబంలో మంత్రి పదవి పొందిన మూడో వ్యక్తిగా నిలిచారు. వివేక్ కు మంత్రి పదవి లభించిన వేళ.. పలు విశేషాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి.
వివేక్ గురించి.. ఆయనకు లభించిన మంత్రి పదవి గురించి చెప్పటానికి ముందు ఆయన తండ్రి కాకా గురించి ప్రస్తావించాల్సిందే. కాంగ్రెస్ దివంగత నేత కాకా అలియాస్ గడ్డం వెంకటస్వామిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాజకీయాల మీదా.. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గురించి అవగాహన ఉన్న ఎవరికైనా ఆయన ఎంత పెద్ద నేతో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మొత్తం మూడుసార్లు ఎమ్మెల్యేగా.. ఏడుసార్లు ఎంపీగా.. మూడుసార్లు కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఆయన సొంతం.
అందుకే ఆయన బతికి ఉన్న వేళలో కాకా అంటే కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే కాకా అన్నట్లుగాఉండేది. ఆయన పెద్ద కుమారుడు వినోద్ ప్రస్తుత బెల్లంపల్లి ఎమ్మెల్యే అయితే.. చిన్న కుమారుడు వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయనకు మంత్రి పదవి లభించింది. వివేక్ సోదరుడు వినోద్ వైఎస్సార్ మంత్రివర్గంలో మంత్రిగా వ్యవహరించారు. కాకా మరణం తర్వాత ఆయన కుటుంబానికి రాజకీయంగా ప్రాధాన్యత తగ్గిందన్న వాదన వినిపిస్తూ వస్తోంది.
తాజాగా కేబినెట్ లో ఆయనకు చోటు కల్పించిన నేపథ్యంలో.. ఆయనకు మళ్లీ ప్రాధాన్యం లభించిందని చెప్పక తప్పదు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో ఉన్న వివేక్.. అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరటం..చెన్నూరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించటం తెలిసిందే. అంతేకాదు.. లోక్ సభ ఎన్నికల్లో తన కొడుకు వంశీ క్రిష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించుకోవటంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు.
- వివేక్ కు మంత్రి పదవి లభించిన వైనంలో నెలకొన్న విశేషాల్ని చూస్తే.. రాజకీయ అనుభవానికి ఢోకా లేకున్నా.. వినోద్.. వివేక్ లు ఎమ్మెల్యేలుగావిజయం సాధించిన తొలి దఫాలోనే మంత్రులు కావటం ఒక విశేషంగా చెప్పాలి.
- నిజానికి వివేక్ 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలుపొందిన వేళలో ఆయనకు కేంద్రమంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ..ఆయన కంటే సీనియర్ నేతలు ఉండటంతో ఆయనకు అవకాశం లభించలేదు.
- కాంగ్రెస్ లో ఉన్న వివేక్ 2013లో అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. కానీ.. ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. 2014 ఎన్నికల ముందు టీఆర్ఎస్ ను విడిచి పెట్టి కాంగ్రెస్ లో చేరారు. ఎన్నికల్లో ఓడారు. 2016లో మరోసారి టీఆర్ఎస్ లో చేరారు. 2019లో టీఆర్ఎస్ ఎంపీగా టికెట్ ఇవ్వలేదు. తీవ్ర మనస్తాపానికి గురై బీజేపీలో చేరారు. అయినా.. ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2024లో వివేక్ కు ఎంపీ టికెట్ ఖాయమని చెబుతున్నా.. 2023లో అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కింది.
- వివేక్ కు క్యాబినెట్ లో బెర్తు దక్కటంతో కాకా ఇంట్లో మూడో మంత్రి పదవిగా చెప్పాలి.
- తెలంగాణ వచ్చాక ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు మంత్రి పదవి లభించటం ఇది మూడోసారి.
- ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుంచి పట్టుబట్టి మంత్రి పదవి సాధించటంలో వివేక్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.