విమాన ప్రమాద మృత్యుంజయుడు పరిస్థితి ఇప్పుడెలా ఉందో తెలుసా?
అహ్మదాబాద్ లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదం అందరినీ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 July 2025 6:00 PM ISTఅహ్మదాబాద్ లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదం అందరినీ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ గాయాలతో సజీవంగా బయటపడ్డారు. దీంతో.. ఆయనను మృత్యుంజయుడు అని సంబోధిస్తున్నారు నెటిజన్లు. ఈ సమయంలో ఆయన తాజా పరిస్థితిని కుటుంబ సభ్యులు వివరించారు.
అవును... అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి అనూహ్యరీతిలో ప్రాణాలతో బయటపడ్డారు మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్. ప్రమాదం అనంతరం ఆయన నడుచుకుంటూ అంబులెన్స్ ఎక్కిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదే సమయంలో.. ఆ విమానంలో ఆయన సీటు నెంబర్ ఏ11 కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పైగా ఇటీవల విమాన టిక్కెట్ల బుక్కింగ్స్ లో ఏ11 సీటుకు డిమాండ్ పెరిగిందని అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... ఆ ఘోర ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా ఉన్నప్పటికీ.. విశ్వాస్ ఇంకా ఆ భయానక క్షణాలను మరచిపోలేకపోతున్నారని.. ఆయనను ఇప్పటికీ నాటి భయానక క్షణాలు, దృశ్యాలు వెంటాడుతూనే ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రధానంగా... ప్రమాద దృశ్యాలతో పాటు ఘటనలో సోదరుడిని కోల్పోవడం వంటి వాటితో విశ్వాస్ మానసికంగా తీవ్రంగా కుంగిపోయాడని తెలిపారు.
ఆయన అర్ధరాత్రి సమయంలో నిద్రలోంచి హఠాత్తుగా మెల్కోంటున్నారని.. ఇక తిరిగి నిద్రపోవడం లేదని తెలిపారు. ఇదే సమయంలో.. ఇప్పట్లో మళ్లీ లండన్ కు వెళ్లే ప్రణాళికలు లేవన్నారు. ఇంట్లో వాళ్లతో కూడా సరిగా మాట్లాడటం లేదని.. ఆయన క్షేమం గురించి తెలుసుకునేందుకు విదేశాల్లో నివసిస్తున్న బంధువులు ఫోన్ లు చేస్తున్నా మాట్లాడలేకపోతున్నట్లు వెల్లడించారు. తిరిగి మామూలు మనిషిని చేసేందుకు మానసిక చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు!
కాగా... బ్రిటన్ లో నివాసముంటున్న విశ్వాస్ కుమార్.. ఇటీవల గుజరాత్ లోని తన కుటుంబాన్ని కలిసేందుకు వచ్చి, తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం రక్తపుమరకలతో నడుచుకుంటూ వచ్చి ఆయన ఆంబులెన్సు ఎక్కారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నాడు వైరల్ అయ్యాయి.
ఇదే సమయంలో... విమానం కూలిన వెంటనే అగ్నిగోళం మండుతుండగా, నల్లని పొగ అంతెత్తున చుట్టూ అలుముకోగా.. వాటి పక్కనుంచి విశ్వాస్ కుమార్ నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ వీడియో మరింత సంచలనంగా మారిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో... నాడు శరీరానికి తగిలిన గాయాలు మానినా... మానసికంగా తగిలిన షాక్ నుంచి మాత్రం ఆయన ఇంకా తేరుకోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
