Begin typing your search above and press return to search.

ఖాళీ అవుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్...!

ప్రతీ ఏటా వేలల్లో స్టీల్ ప్లాంట్ నుంచి రిటైర్ అయిన వారు ఉంటారు. వారు ఖాళీ చేసి వెళ్ళిన పోస్టులకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడం మానేసి చాలా కాలం అయింది అని గుర్తు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   7 Jan 2024 12:30 PM GMT
ఖాళీ అవుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్...!
X

ఎంతో ప్రతిష్టను మూటకట్టుకుని ఏపీకి తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఇపుడు తిరోగమనం దిశగా పయనిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏ రోజు అయితే నిర్ణయించిందో నాటి నుంచే ప్లాంట్ కి కొత్త కష్టాలు మొదలయ్యాయి. గత మూడేళ్ళుగా ప్లాంట్ ఊపిరిని మెల్లగా తీసేస్తున్నారు అని ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలు ఆరోపిస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ముఖ్య విభాగాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ మధ్యనే బ్లాక్ ఫర్నెస్ విభాగాన్ని జిందాల్ కి అప్పగించారని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తిని కూడా తగ్గిస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా చూస్తే కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ లో కొత్త ఉద్యోగాలను తీయడం లేదని కూడా అంటున్నారు.

ప్రతీ ఏటా వేలల్లో స్టీల్ ప్లాంట్ నుంచి రిటైర్ అయిన వారు ఉంటారు. వారు ఖాళీ చేసి వెళ్ళిన పోస్టులకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడం మానేసి చాలా కాలం అయింది అని గుర్తు చేస్తున్నారు. దీని వల్ల ప్లాంట్ లో తక్కువ మందితో ఎక్కువ పని చేయిస్తున్నారని పని భారాన్ని పెంచేస్తున్నారు అని అంటున్నారు.

నిపుణులు అయిన వారు అనుభవం కలిగిన వారు రిటైర్ అయిపోతున్నా ప్లాంట్ యాజమాన్యం పట్టించుకోకపోవడం వెనక కేంద్రం ప్రైవేటీకరణ తంత్రం ఉందని ఉక్కు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏదో విధంగా ఉక్కు నష్టాలలో ఉందని చెప్పి ప్రైవేట్ పరం చేయాలన్నదే ఎత్తుగడగా ఉందని అంటున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని నమ్ముకుని ఉత్తరాంధ్రా జిల్లాలో వేలాదిగా ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నారు అని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండడం వల్లనే విశాఖ ఉక్కు నగరం అయిందని అనేక ఇతర వ్యాపారాలు పరిశ్రమలతో విశాఖ ఏపీకి ఆర్థిక రాజధాని స్థాయికి ఎదిగిందని గుర్తు చేస్తున్నారు.

అలాంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే దాని ఘనమైన చరిత్ర ముగిసినట్లే అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తే ప్రస్తుతం పర్మనెంట్ గా పనిచేస్తున్న వారు కూడా తమ ఉద్యోగాలు కోల్పోతారు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం ఈ రోజుకీ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టంగా చెప్పడం లేదని వారు మండిపడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని సొంతంగా నిర్వహించాలనుకోకపోతే సెయిల్ లో విలీనం చేసి అయినా ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని ప్లాంట్ కార్మిక సంఘాల నుంచి డిమాండ్ వస్తోంది. ఎట్టి పరిస్థితులలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వమే నిర్వహించాలని ప్రైవేట్ పరం చేయడాన్ని ఒప్పుకోమని అంటున్నారు. రానున్న రోజులలో ప్లాంట్ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు.