"ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ" గళమెత్తిన మరో ఎమ్మెల్యే
ఈ నేపథ్యంలో ఆయనకు మద్దుతుగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సైతం విమాన సర్వీసుల రద్దుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 17 April 2025 11:25 AMవిశాఖ నుంచి విమాన సర్వీసులు రద్దుపై మరో ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే గంటా తన ఎక్స్ ఖాతాలో ‘‘ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ’’ అంటూ చేసిన పోస్టు రచ్చ రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దుతుగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సైతం విమాన సర్వీసుల రద్దుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై రాష్ట్రంలోని ఎన్డీఏ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించడం తీవ్ర చర్చకు దారతీస్తోంది.
ఏపీ ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా చెప్పే విశాఖ నుంచి రాజధాని అమరావతికి విమాన సర్వీసులు లేకపోవడంపై తీవ్రవిమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని ఎత్తిచూపుతూ రెండు రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా ట్వీట్ చేయగా, ఆయనకు పార్టీ అధిష్టానం క్లాసు తీసుకుందని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం మనది, ఏవియేషన్ మినిస్టర్ మనోడు ఉన్నప్పుడు సీనియర్లు ఇలా మాట్లాడవచ్చా? అంటూ గంటాను టీడీపీ అధిష్టానం ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయనకు తోడుగా బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా తన గళాన్ని విప్పారు.
విశాఖ నుంచి రాజధానికి ఎయిర్ కనెక్టవిటీ లేకపోవడంతో చాలా ఇబ్బంది ఎదురవుతోందని విష్ణుకుమార్ రాజు తాజాగా ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు చెప్పడం లేదు కానీ, విజయవాడకు విమాన సర్వీసులు రద్దుచేయడం వల్ల పారిశ్రామిక, వ్యాపార వర్గాల వారు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యే విష్ణు వ్యాఖ్యానించారు. దీంతో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి ఎక్కువవుతోందని అంటున్నారు. విశాఖ-విజయవాడ మధ్య ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ సర్వీసులను రద్దు చేయడం, అందుకు కేంద్ర పౌర విమానయానశాఖ అనుమతించడం తప్పని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ చూస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రాంతానికి చెందిన వారు కావడంతో మరిన్ని విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికైనా ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని విమానాలను పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది.